Chandrababu: సంపూర్ణ మద్య నిషేధం.. ఇదో కాలం చెల్లిన మాటగా మిగిలిపోయింది. అప్పుడెప్పుడో ఎన్టీఆర్ మద్య నిషేధం అమలుచేసి తన చిత్తశుద్ధిని నిరూపించుకున్నారు. నిషేధాన్ని అమలుచేసి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. అటు తరువాత ఏ ప్రభుత్వమూ, ఏ పార్టీ మద్య నిషేధం అమలుచేస్తామని ముందుకు రాలేదు. ప్రకటించలేదు కూడా. అయితే 2019 లో అధికారమే పరమావధిగా భావించిన జగన్ మద్య నిషేధం హామీ ఇచ్చారు. పాదయాత్రలో ఊరువాడా ఇదే ప్రచారం చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇదే చెప్పారు. నవరత్నాల్లో ఇదో ప్రాధాన్యతాంశంగా చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో అక్క చెల్లెళ్ల కళ్లలో ఆనందం నింపేందుకు పక్కాగా అమలుచేస్తానని కూడా ప్రజలకు హామీ ఇచ్చారు. తీరా అధికారంలోకి వచ్చాక అమలుచేయలేక పోయారు. పైగా తానే మద్యం దుకాణాలను నడిపే గురుతర బాధ్యతను తీసుకున్నారు. మద్యం లేనిదే ప్రభుత్వానికి ఆదాయం సమకూరదన్నట్టు భావిస్తున్నారు. ఏడాదికి 25 శాతం షాపులను తగ్గించి.. నాలుగేళ్లలో సంపూర్ణ మద్య నిషేధం వైపు అడుగులేస్తానన్న మాటను అటకెక్కించారు. నిషేధం అన్నమాట అసాధ్యమని తేల్చేశారు. నిషేధం లేదన్న సంకేతాలు ఇచ్చారు.

అయితే ఇప్పుడు చంద్రబాబు జగన్ ఫెయిల్యూర్ పై గట్టిగా నిలదీయడం మానేసి మందుబాబులకు మద్దతుగా మాట్లాడడం ప్రారంభించారు. దానిని ఒక రాజకీయ హామీగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. సభలు, సమావేశాలు, రోడ్ షోలో సరదాగా వ్యాఖ్యానం మాటున తన భవిష్యత్ ను, మందుబాబుల మద్దతును కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. నాణ్యమైన మద్యంను తక్కువ ధరకు అందిస్తానని కూడా హామీ ఇస్తున్నారు. గతంలో తానిచ్చిన మద్యం, ఇప్పుడు జగనిస్తున్న మద్యంను సరిపోల్చుతూ ఏది కావాలో కోరుకోండి అంటూ మందు బాబులకు ఆప్షన్ ఇచ్చారు. ఆరోగ్యకరమైన మందు కావాలో.. అనారోగ్యకరమైన మందును కోరుకుంటారో మీరే చెప్పాలంటూ చెబుతుండడం చూస్తుంటే ఎటువంటి రాజకీయానికి దిగజారారో అర్థమవుతుంది. సంపూర్ణ మద్యనిషేధం చేస్తానన్న జగన్ ఆ పనిచేయకపోగా.. బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా ఉండి ప్రభుత్వ చర్యలపై పోరాటం చేయకపోగా.. నాణ్యత కలిగిన మద్యం అందిస్తానని చెప్పడం దేనికి సంకేతం.

మద్యం పాలసీలో జగన్ సర్కార్ పూర్తిగా విఫలమైంది. మద్య నిషేధం హామీతో మహిళల ఓట్లు కొల్లగొట్టిన జగన్ .. అధికారంలోకి వచ్చాక ప్రభుత్వాన్ని నడిపేందుకు అదే మద్యం ఆదాయం తప్పనిసరిగా మారింది. అందుకే ప్రజలను ఒప్పించే ప్రయత్నం చేశారు. మద్యం ఆదాయం లేనిదే పథకాలు అమలుచేయలేమని.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా కొద్దిరోజుల పాటు మద్య నిషేధం అమలుచేయలేనని కూడా చెప్పుకొచ్చారు. దానికి ప్రజల నుంచి సమ్మతం లభించింది. కానీ ఆయుధంగా దొరికిన అస్త్రాన్ని విపక్షాలు వదులుకున్నాయి. మద్య నిషేధం ఎందుకు అమలుచేయలేకపోయారని ప్రశ్నించాయి. పైగా మద్యం ధరలను తగ్గించాలని మాత్రమే పోరాట బాట పట్టిన సందర్భాలున్నాయి. కానీ మద్య నిషేధం గురించి పక్కాగా ఉద్యమించిన సందర్బాలు లేవు. ఇప్పుడు మరోసారి అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తున్న చంద్రబాబు సాయంత్రానికి మందు సీసా పట్టుకునే మందుబాబులకు తానే గుర్తొచ్చేలా ఆరోగ్యకరమైన మందు, అనారోగ్యమైన మందు అన్న వాదనను ముందుంచడం దిగజారిన రాజకీయాల గురించి తెలియజేస్తోంది.