Repopulate Russia: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆ దేశ మహిళలకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. పది మంది, అంత కంటే ఎక్కువ మంది పిల్లల్ని కనే మహిళలకు భారీ బహుమానంగా.. మదర్ హీరోయిన్ అవార్డును ప్రకటించారు. ఈ అవార్డును 1944లో అప్పటి సోవియట్ ప్రీమియర్ జోసెఫ్ స్టాలిన్ మొదట ప్రవేశపెట్టారు. దీని ప్రకారం 10మంది అంత కంటే ఎక్కువ పిల్లలను కనే మహిళలకు భారీ బహుమతి ఇస్తారు. ఆ డబ్బు మన భారత కరెన్సీలో రూ.13 లక్షలకు పైనే ఉంటుంది. ఈ డబ్బు 10వ బిడ్డ మొదటి పుట్టిన రోజున చెల్లిస్తారు. ఓ కండీషన్ ఏంటంటే.. అప్పటికి మిగతా 9 మంది పిల్లలు కూడా జీవించి ఉండాలి. పాత అవార్డును మళ్లీ ఇప్పుడు బయటకు తీయడం ఆ దేశంలోనే కాదు… ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది.

జనాభా తగ్గుతుండడంతో..
గత కొంతకాలంగా రష్యాలో జనాభా తగ్గుతోంది. దీంతో ఆందోళన చెందిన అధ్యక్షుడు పుతిన్ దేశంలో జనాభాను పెంచుకోవడం కోసం సోవియట్ కాలంలో అమల్లో ఉన్న పురస్కారాన్ని పునరుద్ధరించారు. కుటుంబాలను విస్తరించే దిశగా ప్రజలను ప్రోత్సహించేందుకు గానూ.. 10, అంతకంటే ఎక్కువ మంది పిల్లల్ని కనే మహిళలకు నజరానా ప్రకటించారు. ఈ మేరకు ’మదర్ ’హీరోయిన్’ అవార్డును ప్రకటించినట్లు వాషింగ్టన్ పోస్ట్ కథనం వెల్లడించింది.
Also Read: Basara IIIT: బాసర ట్రిపుల్ ఐటీలో అసలేం జరుగుతోంది? సురేష్ ఆత్మహత్యకు కారణమేంటి?
పదో బిడ్డ పుట్టిన రోజే…
పది మంది అంతకంటే ఎక్కువ పిల్లలను కనే మహిళలకు మిలియన్ రూబెల్స్ (భారత కరెన్సీలో దాదాపు రూ. 13లక్షలకుపైన) నజరానా ఇస్తామని పుతిన్ సర్కారు ప్రకటించింది. ఈ మొత్తాన్ని ఒకేసారి చెల్లించనున్నట్లు తెలిపింది. అయితే, దీనికో మెలిక కూడా పెట్టింది. 10వ బిడ్డ మొదటి పుట్టి రోజు నాడు ఈ నగదు చెల్లిస్తారట. అప్పటికి మిగతా 9 మంది పిల్లలు జీవించి ఉండాలని షరతు పెట్టారు.

1944లో అవార్డు..
నిజానికి ఈ అవార్డును 1944లో అప్పటి సోవియట్ యూనియన్‌లో ప్రీమియర్ జోసెఫ్ స్టాలిన్ ప్రవేశపెట్టారు. యూఎస్‌ఎస్‌ఆర్ గౌరవ పురస్కారంగా పేర్కొంటూ దాదాపు 4 లక్షల మంది పౌరులకు ఈ అవార్డును అందజేశారు. ఇప్పుడు రష్యా జనాభా పెంచడం కోసం పుతిన్ ఈ అవార్డును మళ్లీ వెలుగులోకి తీసుకురావడం గమనార్హం. కుటుంబం ఎంత పెద్దగా ఉంటే దేశంపై అంత ఎక్కువ గౌరవం ఉంటుందని పుతిన్ అభిప్రాయపడుతున్నారట.
కోవిడ్, ఉక్రెయిన్‌పై సైనిక చర్య కారణంగా..
కోవిడ్ మహమ్మారితో పాటు ఉక్రెయిన్ రష్యా యుద్ధం కూడా మదర్ హీరోయిన్ అవార్డు ప్రకటించడానికి కారణమనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య మొదలుపెట్టిన నాటి నుంచి వేలాది మంది క్రెమ్లిన్ సైనికులు మరణించినట్లు అంతర్జాతీయ అధ్యయనాలు పేర్కొన్నాయి. ఈ యుద్ధంలో ఇప్పటివరకు దాదాపు 15వేల మంది రష్యా సైనికులు మృతిచెంది ఉంటారని అంచనా. అయితే క్రెమ్లిన్ మాత్రం ఈ వార్తలను తోసిపుచ్చుతోంది. ఏదేమైనప్పటికీ.. ప్రస్తత పరిస్థితుల్లో కేవలం మిలియన్ రూబెల్స్ కోసం 10 మంది పిల్లల్ని కని పెంచడం సాధ్యమేనా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరి ఈ అవార్డుకు ప్రజలు ఎలా స్పందిస్తారో చూడాలి..!
Also Read:Rajasingh- Lawyer Karuna Sagar: రాజాసింగ్ తరుఫు న్యాయవాది సాగర్ సంచలన వ్యాఖ్యలు