Basara IIIT: చదువుల తల్లి సరస్వతీ దేవి కొలువుదీరిన, శక్తిపీఠంగా ప్రసిద్ధి చెందిన బాసర క్షేత్రంలో ఏర్పాటు చేసిన ట్రిపుల్ ఐటీ(రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెన్నాలజీ) మూడు నెలలుగా నిత్యం వార్తల్లో నిలుస్తోంది. తరచుగా జరుగుతున్న సంఘటనలు వర్సిటీ ప్రతిష్టను దిగజార్చుతున్నాయి. జూన్‌లో సమస్యల పరిష్కారానికి పది రోజులపాటు విద్యార్థులు పగలు రాత్రి తేడా లేకుండా ఆందోళన చేశారు. శాంతియుతంగా ప్రభుత్వం దిగివచ్చేలా చేశారు. విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి స్వయంగా వర్సిటీకి వచ్చి సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. కానీ నేటికీ అవి నెరవేరలేదు. తర్వాత ఫుడ్ పాయిజన్ అయి సుమారు 600 మంది అస్వస్థతకు గురయ్యారు. మరో రోజు హాస్టల్ పైకప్పు పెచ్చులూడిపడింది. ఇంకోరోజు హాస్టల్‌లో ఫ్యాన్ ఊడిపడింది. ఈ ఘటనల్లో విద్యార్థులు గాయపడ్డారు. తాజాగా ఓ విద్యార్థి హాస్టల్‌లో ఉరేసుకున్నాడు. దీంతో బాసర ట్రిపుల్ ఐటీ అగ్నిగుండంలా రగిలిపోతోంది. అసలు బాసర ట్రిపుల్ ఐటీలో అసలేం జరుగుతోంది.. విద్యార్థి సురేశ్ ఆత్మహత్యకు కారణమేంటన్న దానిపై స్పెషల్ ఫోకస్.

-జూన్లో చెలరేగిన మంటలు..
బాసర ట్రిపుల్ ఐటీలో జూన్‌లో చెలరేగిన మంటలు మూడు నెలలుగా మండుతూనే ఉన్నాయి. ఆ విద్యాలయంలో చదువుకోవాలన్నా, కడుపునిండా భోజనం చేయాలన్నా, కంటినిండా నిద్రపోవాలన్నా ఓ యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సమస్యల సుడిగుండంలో నలిగిపోతున్నారు అక్కడి విద్యార్ధులు. ఒక ఇష్యూ సద్దుమణిగింది అనుకునేలోపే మరో ఇష్యూ తెరపైకి రావడం, బాసర ట్రిబుల్ ఐటీ అగ్నిగుండంగా మార్చేస్తోంది. సమస్యలు పరిష్కారమయ్యాయి. విద్యాలయం గాడిలో పడుతుందనుకునే లోపు మళ్లీ సమస్య, ఒకటి కాదు వేల సమస్యలు బాసర ట్రిపుల్ ఐటీని చుట్టుముడుతున్నాయి. కారణాలేవైనా నెలరోజుల వ్యవధిలో ఇద్దరు విద్యార్ధులు ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో మరణించడం కలకలం రేపుతోంది.
-నాసిరకం భోజనంతో విద్యార్థుల తిప్పలు..
మూడు నెలల క్రితం 12 సమస్యలపై విద్యార్థులు ఉద్యమం మొదలు పెట్టారు. పర్మినెంట్ వీసీ, నాణ్యమైన భోజనం, యూనిఫాంలు, మరుగుదొడ్లు, నీటి సమస్య, ల్యాప్‌టాప్‌లు తదితర సమస్యలపై 12 రోజులు శాంతియుతంగా ఆందోళన చేశారు. వీరి నిరసనతో ప్రభుత్వమే దిగివచ్చింది. తర్వాత నెలరోజులక్రితం హాస్టల్‌లో మధ్యాహ్నం తయారు చేసిన ఎగ్ ప్రైడ్ రైస్ వికటించింది. ఈ ఘటనలో 600 మంది అస్వస్థతకు గురయ్యాడు. దాదాపు 15 రోజులపాటు చికిత్స తీసుకుని కోలుకున్నారు. మళ్లీ గాడిలో పడుతుందనుకునేలోపు క్యాంపస్‌లో వారం క్రితం గంజాయి వాసన గుప్పుమంది. ఇద్దరు స్టూడెంట్స్ నుంచి గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు ప్రకటించారు. తర్వాత రెండు రోజుల వ్యవధిలో నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లికి చెందిన సివిల్ ఇంజనీరింగ్ స్టూడెంట్ సురేష్ ఫ్యాన్ కు ఉరేసుకుని మరణించడంతో క్యాంపస్ మళ్లీ అగ్నిగుండంలా మారింది. సురేష్ ఆత్మహత్యతో బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్ధులు మరోసారి ఆందోళనకు దిగడంతో పరిస్థితి మళ్లీ అదుపుతప్పింది.
-అధికారుల ఒత్తిడే కారణమా..
సురేష్ ఆత్మహత్యకు అధికారుల ఒత్తిడే కారణమంటోన్న స్టూడెంట్స్, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. గంజాయి కేసులో పోలీసులు, అధికారులు విచారణ పేరుతో సురేశ్‌ను వేధిస్తున్నారని ఆరోపించారు. ఈ క్రమంలోనే మనస్తాపం చెందిన సురేశ్ ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపిస్తున్నారు. రెండు మూడు నెలలుగా పోలీస్ పహారాలోకి క్యాంపస్‌ను నేట్టేసి విద్యార్థులకు స్వేచ్ఛ లేకుండా చేశారని, ఇది కూడా సురేశ్ సూసైడ్‌కి కారణమంటున్నారు. అయితే, సురేష్ సూసైడ్‌కు పర్సనల్ రీజన్సే కారణమంటున్నారు పోలీసులు.

-చదువులో ముందు..
ఆత్మహత్య చేసుకున్న సురేశ్ చదువులో ముందు ఉండేవాడని విద్యార్థులు చెబుతున్నారు. తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కుమారుడు కావడం, ఉన్నత లక్ష్యంతో ట్రిపుల్ ఐటీలో చేరాడు. జీవితంలో స్థిరపడి తండాలో ఆదర్శంగా నిలవాలనుకున్నాడు. ఆదర్శ పాఠశాలలో చదవి 10 జీపీఏ సాధించి తన బ్యాచ్‌లో ట్రిపుల్ ఐటీ సాధించిన విద్యార్థిగా కూడా గుర్తింపు పొందాడు. కానీ అర్ధంతరంగా జీవితాన్ని ముగించాడు.
–చనిపోయినా బతికున్నట్లు డ్రామా..
సరేశ్ చనిపోయిన తర్వాత కూడా అధికారులు బతికే ఉన్నట్లు సుమారు గంటసేపు నాటకం ఆడడం కూడా విద్యార్థుల ఆగ్రహానికి కారణమవుతోంది. ఉరేసుకున్న సురేశ్‌ను సహచర విద్యార్థులే కిందకు దించారు. అప్పటికే శరీరం చల్లబడింది. ఆ తర్వాత అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు బాడీని స్థానిక డిస్పెన్సరీకి తరలించి బతికే ఉన్నాడని, పరిస్థితి విషమంగా ఉందని సుమారు గంటపాటు చికిత్స చేశారు. ప్రిస్క్రిప్షన్‌పై మందులు కూడా రాశారు. చివరకు విషమించిందని నిర్మల్ ఆస్పత్రికి తరలించారు. తర్వాత చనిపోయినట్లు ప్రకటించారు. వర్సిటీలోని విద్యార్థుల వద్దనే విషయం ఎందుకు దాచారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
రావణ కాష్టంలా రగులుతున్న బాసర ట్రిపుల్ ఐటీని చక్కదిద్దే నాథుడే లేకుండా పోయారు. అందరి ప్రమేయంతో వర్సిటీ రణరంగంగా మారుతోంది. పోలీసుల ఎంట్రీ.. ఆందోళనలు, అధికారులు పట్టింపు లేకపోవడంతో ఇలాంటి ఎన్నో ఉపద్రవాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికైనా వర్సిటీని చక్కదిద్దే నాథుడు కావాలని విద్యార్థులంతా ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు. వారి కష్టాలు తీర్చే వారికోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.
Also Read:Rajasingh- Lawyer Karuna Sagar: రాజాసింగ్ తరుఫు న్యాయవాది సాగర్ సంచలన వ్యాఖ్యలు
[…] […]