Putin India Visit: రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత్‌కు వచ్చారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. ఐసీసీ వారెంట్ నేపథ్యంలో ఆయన పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రత్యేకంగా ఏఐ సెక్యూరిటీతోపాటు డ్రోన్ రూం కూడా ఏర్పాటు చేశారు. ఇక భారత ఆప్తమిత్రుడు అయిన పుతిన్‌కు మన ఆతిథ్యం కూడా గొప్పగా ఉండేలా కేంద్రం ఏర్పాట్లు చేసింది.
హైదరాబాద్ హౌస్‌లో బస..
పుతిన్‌కు ఢిల్లీ అశోక్ రోడ్‌లోని హైదరాబాద్ హౌస్‌లో బస ఏర్పాటు చేశారు. హైదరాబాద్ చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్‌కు చెందిన గెస్ట్ హౌస్. బ్రిటిష్ వైస్రాయ్ హౌస్‌కు సమానంగా ఉండాలని ఆయన కోరిక మేరకు ఆర్కిటెక్ట్ ఎడ్విన్ లూటియన్స్ డిజైన్ చేశాడు. సీతాకోకచిలుక ఆకారంలో ఇండో–యూరోపియన్ శైలిలో 1920లలో 2 లక్షల పౌండ్లతో (నేటి విలువ రూ.170 కోట్లు) నిర్మించారు.
భవన విశేషాలు
36 గదులు, విశాల కోర్ట్‌యార్డ్‌లు, ఫౌంటైన్‌లతో అలంకరించిన ఈ ప్రాసాదం రాచరికత్వానికి చిహ్నం. స్వాతంత్య్రానంతరం సంస్థానాల విలీనంతో కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చింది. 1974లో విదేశాంగ శాఖ స్వీకరించింది. ప్రస్తుతం విదేశీ అధినేతలకు ఆతిథ్యం, కీలక చర్చల వేదికగా పనిచేస్తోంది.
ప్రధాని మోదీ విదేశీ అతిథులతో విందులు, చర్చలకు ఈ భవనాన్ని ఎంచుకుంటారు. బిల్ క్లింటన్, జార్జ్ బుష్ వంటి అగ్రనేతలు ఇక్కడే భారత నాయకులతో సమావేశమయ్యారు. పుతిన్ పర్యటన సందర్భంగా ఈ ప్రాసాదం మరోసారి ప్రపంచ దౌత్య చరిత్రలో మైలురాయిగా నిలుస్తోంది.