https://oktelugu.com/

Visakhapatnam: విశాఖలో ఈ పరిణామం వెనుక కథేంటి?

విశాఖను పాలన రాజధానిగా జగన్ సర్కార్ ప్రకటించింది. కానీ దానిని సాకారం చేయలేకపోయింది. ఇప్పుడు ఎన్నికలు ముంచుకొస్తుండడంతో అందుకు తగ్గట్టుగా ఏదో ఒకటి చేయాలన్న తలంపునకు వచ్చింది.

Written By: , Updated On : September 7, 2023 / 01:07 PM IST
Visakhapatnam

Visakhapatnam

Follow us on

Visakhapatnam: విజయదశమి ముంచుకొస్తోంది. మరో 40 రోజులు గడువు మాత్రమే ఉంది. అయితే ఏంటంటారా? అదేనండీ.. విశాఖ నుంచి జగన్ పాలన సాగించే రోజులు దగ్గర పడుతున్నాయి. అందుకు తగ్గట్టుగానే జగన్ సర్కార్ సన్నాహాలు ప్రారంభించింది. విశాఖ పోలీస్ కమిషనరేట్ ఆఫీస్ హోదాను ఒక్కసారిగా పెంచేసింది. అడిషనల్ డీజీ హోదాను కట్టబెడుతూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అమరావతిని రాజధానిగా ప్రకటించిన సమయంలో సైతం విజయవాడ కమిషనరేట్ కు ఇదే విధంగా అడిషనల్ డీజీ హోదా కల్పిస్తూ నాటి చంద్రబాబు సర్కార్ ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పుడు కూడా అదే రిపీట్ కావడంతో విశాఖ రాజధానికి వేగంగా జగన్ సర్కార్ అడుగులేస్తుంది అన్నమాట.

విశాఖను పాలన రాజధానిగా జగన్ సర్కార్ ప్రకటించింది. కానీ దానిని సాకారం చేయలేకపోయింది. ఇప్పుడు ఎన్నికలు ముంచుకొస్తుండడంతో అందుకు తగ్గట్టుగా ఏదో ఒకటి చేయాలన్న తలంపునకు వచ్చింది. విశాఖ నుంచి పాలన సాగించేందుకు జగన్ ఫిక్స్ అయ్యారు. విజయదశమి నాటికి విశాఖకు మకాం మార్చాలని నిర్ణయించారు. రుషికొండలో చేపడుతున్న నిర్మాణాల్లో సీఎం నివాసముండనున్నట్లు తెలుస్తోంది. ఎంపీ భవన్లో క్యాంప్ ఆఫీస్ ను ఏర్పాటు చేస్తారని భావిస్తున్నారు.

వారంలో మూడు రోజులు పాటు జగన్ విశాఖలో ఉంటూ పాలన సాగిస్తారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. సోమవారం నుంచి బుధవారం వరకు విశాఖలో.. గురువారం నుంచి శనివారం వరకు తాడేపల్లిలో జగన్ అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తోంది. అలా రెండు చోట్ల రాజధాని ఉనికి ఉండేలా చూసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ ఎన్నికల్లోపు కర్నూలుకు న్యాయ విభాగానికి చెందిన కొన్ని కార్యాలయాలను తరలించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా మూడు రాజధానుల అంశాన్ని సజీవంగా ఉంచేందుకు జగన్ ఈ ప్లాన్ బి ని పక్కాగా అమలు చేయాలని భావిస్తున్నారు.

విశాఖ పోలీస్ కమిషనరేట్ హోదాను అప్ గ్రేడ్ చేయడంతోనే జగన్ కీలక నిర్ణయానికి డిసైడ్ అయ్యారని అధికార వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే విశాఖలో శాంతి భద్రతల విఘాతం కలుగుతున్న దృష్ట్యా.. సీఎం క్యాంప్ ఆఫీస్ పెడితే ప్రముఖుల తాకిడి పెరిగే అవకాశం ఉంది. వారి భద్రత కూడా కీలకంగా మారనుంది. అందుకే కమిషనరేట్ హోదాను అడిషనల్ డీజీ హోదాకు పెంచేశారు. ఏకంగా ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో విశాఖలో పోలీస్ కార్యకలాపాలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. తద్వారా రాజధాని అనే అంశంపై ప్రజలకు స్పష్టమైన సంకేతాలు ఇచ్చేలా తాజా ఉత్తర్వులని పోలీస్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికైతే విశాఖకు రాజధాని కళ తెచ్చేందుకు జగన్ ఒక అడుగు ముందుకు వేశారు. ప్లాన్ బి పక్కాగా అమలు చేయనున్నారు.