Daggubati Purandeswari: మరిది చంద్రబాబుపై కేసులు పెట్టిస్తున్న పురందేశ్వరి!?

స్కిల్ స్కాంలో అరెస్ట్ అయిన చంద్రబాబు దాదాపు 52 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఎన్ని రకాల ప్రయత్నాలు చేసిన ఆయనకు న్యాయస్థానాల్లో ఊరట దక్కలేదు.

Written By: Dharma, Updated On : November 4, 2023 3:19 pm

Daggubati Purandeswari

Follow us on

Daggubati Purandeswari: వ్యూహమో.. యాదృచ్ఛికమో తెలియదు కానీ.. చంద్రబాబుపై ఒక పద్ధతి ప్రకారం కేసులు నమోదవుతూ వస్తున్నాయి. బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి లేవనెత్తిన అవినీతి పైనే జగన్ సర్కార్ ఫోకస్ పెడుతుండడం విశేషం. ఇలా పురందేశ్వరి నుంచి ఆరోపణలు వచ్చిన మరుక్షణం.. చంద్రబాబుపై కేసులు నమోదవుతుండడం చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు కేసుల వెనుక పురందేశ్వరి ఉన్నారన్న అనుమానం వచ్చే రీతిలో జగన్ సర్కార్ వ్యవహార శైలి ఉంది.

స్కిల్ స్కాంలో అరెస్ట్ అయిన చంద్రబాబు దాదాపు 52 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఎన్ని రకాల ప్రయత్నాలు చేసిన ఆయనకు న్యాయస్థానాల్లో ఊరట దక్కలేదు. చివరకు అనారోగ్య కారణాలతో హైకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే జగన్ సర్కార్ మాత్రం ఒక్క స్కిల్ స్కాం తోనే ఆగలేదు. వరుసగా ఓ ఐదారు కేసులు బనాయించింది. అవన్నీ ఇప్పుడు న్యాయస్థానాల్లో రకరకాల స్థాయిలో ఉన్నాయి. ప్రస్తుతానికైతే చంద్రబాబుకు రిలీఫ్ లభించింది. కానీ జగన్ సర్కార్ మాత్రం తన ప్రయత్నాలు తగ్గించడం లేదు. మొన్న మద్యం కుంభకోణం, నిన్న ఇసుక కుంభకోణం అంటూ చంద్రబాబుపై సిఐడి కేసులు పెడుతూనే ఉంది. అయితే ఇవన్నీ పురందేశ్వరి లేవనెత్తిన ఆరోపణలే కావడం విశేషం.

ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా నియమితురాలైన పురందేశ్వరి జగన్ సర్కార్ పై టార్గెట్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అడ్డగోలుగా చేస్తున్న అప్పులు, సంక్షేమ పథకాలు జరుగుతున్న అవినీతి, కుంభకోణాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ వచ్చారు. దీనిపై కేంద్ర పెద్దలకు ఫిర్యాదు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఆమె ఆశించిన స్థాయిలో కేంద్రం నుంచి రెస్పాన్స్ రాలేదు. అదే సమయంలో అవినీతి కేసుల్లో చంద్రబాబు అరెస్టు అయ్యారు. అప్పటినుంచి ఆమె దూకుడు పెంచుతూ వచ్చారు. ఆమె తెలుగుదేశం పార్టీకి తొత్తుగా మారారని.. మరిది చంద్రబాబు అరెస్టును సహించలేకపోతున్నారని వైసీపీ కౌంటర్ అటాక్ చేస్తోంది. చంద్రబాబు అరెస్టు విషయంలో తమ తప్పిదం లేదని.. పురందేశ్వరి లేవనెత్తిన అంశాలపై స్పందిస్తున్నట్లు జగన్ సర్కార్ సంకేతాలిస్తోంది. సోషల్ మీడియాలో సైతం ఇదే తరహా ప్రచారం చేస్తుంది.

మొన్నటికి మొన్న పురందేశ్వరి మద్యం కుంభకోణం గురించి ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వమే నేరుగా మద్యం దుకాణాలు నడుపుతూ.. మద్యం ఆదాయాన్ని వైసిపి నేతలు పక్కదారి పట్టిస్తున్నారని.. ఏడాదికి 25 వేల కోట్ల రూపాయలకు పైగా దోపిడీకి పాల్పడ్డారని పురందేశ్వరి ఆరోపించారు. ఈ క్రమంలోనే చంద్రబాబుపై జగన్ సర్కార్ మద్యం కుంభకోణం జరిగిందంటూ కేసులు నమోదు చేసింది. ఇసుక కుంభకోణంలో జగన్ సర్కార్ 7వేల కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడిందని పురందేశ్వరి ఆరోపించారు. ఈ క్రమంలోనే చంద్రబాబుపై ఇసుక కుంభకోణం కేసు నమోదయ్యింది. దీంతో పురందేశ్వరి ఇస్తున్న హింట్ తోనే జగన్ సర్కార్ చంద్రబాబు పై కేసులు నమోదు చేస్తుందని సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. పోస్టులు వెలుస్తున్నాయి. వాటినే వైసీపీ సోషల్ మీడియా వైరల్ చేస్తోంది. మరిది చంద్రబాబుపై కేసులు నమోదుకు పరోక్షంగా పురందేశ్వరి కారణమన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.