Punjab Effect: కాంగ్రెస్ లో అంతర్గత కుమ్ములాటలు తారాస్థాయికి చేరుతున్నాయి. అధికారం కోసం నేతల్లో సయోధ్య కరువవుతోంది. దీంతో పార్టీ అప్రదిష్ట మూటగట్టుకుంటోంది. తాజా రాజకీయాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి మనుగడ కష్టమేననే సూచనలు కనిపిస్తున్నాయి. ఇటీవల పంజాబ్ లో చోటుచేసుకున్న పరిణామాలతో రాజస్తాన్ సైతం విభేదాల్లో మునిగిపోతోంది. ప్రస్తుత సీఎం అశోక్ గెహ్లాట్ యువ నేత సచిన్ పైలట్ మధ్య విభేదాలు ముదిరాయి. ఇన్నాళ్లు మామూలుగా ఉన్న పరిస్థితుల్లో ఒక్కసారిగా మార్పు వస్తోంది. సచిన్ వర్గం ఆయనకు సీఎం పీఠం అప్పగించాలని డిమాండ్ చేస్తోంది. దీంతో కాంగ్రెస్ పార్టీ ఎటూ తేల్చులేకపోతోంది.
పంజాబ్ లో పొడచూపిన రాజకీయాలు రాజస్తాన్ లో కూడా ఉద్వేగాలు రావడానికి కారణమవుతున్నాయి. సచిన్ పైలట్ వల్లే రాజస్తాన్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించాలంటే సచిన్ ను సీఎం చేయాల్సిందేనని కార్యకర్తల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. దీంతో రాజస్తాన్ రాజకీయాల్లో కూడా విభేదాలు మొదలైనట్లేనని తెలుస్తోంది. వయోభారంతో అనారోగ్యంతో బాధపడుతున్న అశోక్ గెహ్లాట్ ను తప్పించి సచిన్ ను సీఎం చేయాలనే వాదన బలంగా వినిపిస్తోంది.
2018లో రాజస్తాన్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో సచిన్ పైలట్ సీఎం అవుతారని అందరు ఆశించారు. కానీ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ ను అధిష్టానం నియమించింది. దీంతో సచిన్ వర్గం అసంతృప్తి వ్యక్తం చేసింది. దీంతో అధిష్టానం సచిన్ పైలట్ ను డిప్యూటీ సీఎంను చేసినా వారిలో సంతృప్తి చెందలేదు. సచిన్ పైలట్ నే సీఎం చేయాలనే డిమాండ్ వచ్చినా అధిష్టానం ఒప్పుకోలేదు. ఈ నేపథ్యంలో అంతర్గత విభేదాలు పెరిగిపోయాయి. ప్రస్తుతం పంజాబ్ పరిణామాల నేపథ్యంలో రాజస్తాన్ లో కూడా సీఎం ను మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కాంగ్రెస్ పార్టీ వల్లే స్టేట్లలో విభేదాలు పొడచూపి సీఎంలను మార్చే వరకు వెళుతోంది. దీంతో నాయకుల్లో అసంతృప్తి పెరుగుతోంది. ఇదే ప్రత్యర్థి పార్టీలకు వరంగా మారుతోందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస పార్టీ సీఎంలను మర్చే సంస్కృతికి ఎప్పుడు చరమగీతం పాడుతుందో అని నేతల్లో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అంతర్గత కుమ్ములాటల కారణంగానే మధ్యప్రదేశ్ లో అధికారం కోల్పోయినట్లు తెలుస్తోంది. చత్తీస్ గడ్ లో కూడా నాయకత్వ మార్పు తప్పదేమోనని సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.