
మనలో చాలామంది ప్రభుత్వ ఆస్పత్రుల్లో కొన్ని రోజుల పాటు ఉండాలంటే సముఖత చూపరు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం బాగానే అందినా అక్కడ మౌలిక సౌకర్యాలు బాగా ఉండవనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో టాయిలెట్స్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఆస్పత్రుల పరిశీలనకు వచ్చిన రాజకీయనాయకులు సైతం రోగులు ఇలాంటి సమస్యలు చెబితే పెద్దగా పట్టించుకోరు.
అయితే పుదుచ్చేరి ఆరోగ్య మంత్రి మల్లాడి కృష్ణారావు మాత్రం కరోనా ఆస్పత్రిలో మరుగుదొడ్డి శుభ్రం చేసి ప్రశంసలు అందుకున్నారు. దగ్గర్లో ఎన్నికలు లేకపోయినా రోగులు సమస్య చెప్పిన వెంటనే స్వయంగా పరిష్కరించి నిజమైన లీడర్ అనిపించుకున్నారు. పుదుచ్చేరి ఇందిరా గాంధీ మెడికల్ కాలేజీ హాస్పిటల్ లో నిన్న కృష్ణారావు పర్యటించారు. అక్కడ బాధితులను పరామర్శించి వసతులు, ఇతర విషయాల గురించి ఆరా తీశారు.
ఆ సమయంలో ఆస్పత్రిలో టాయిలెట్స్ ను సరిగ్గా శుభ్రపరచటం లేదని కొందరు రోగులు ఆయనకు ఫిర్యాదు చేశారు. దీంతో మంత్రి రంగంలోకి దిగి టాయిలెట్స్ శుభ్రం చేసి రోగులు మరోసారి ఫిర్యాదు చేయకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆస్పత్రి సిబ్బందిని సున్నితంగా మందలించారు. కరోనా బాధితులు మరుగుదొడ్లు వినియోగించిన తరువాత నీళ్లతో శుభ్రం చేయాలని సూచించారు. మీడియాతో మంత్రి మాట్లాడుతూ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కొత్తగా నర్సులు, డాక్టర్లు, ఆరోగ్య కార్మికులను 458 మందిని నియమించుకుంటున్నట్లు తెలిపారు.