YCP: ఎన్నికల్లో గెలుపోటములు అన్నది సహజం. ప్రభుత్వాల పనితీరు, ప్రజా వ్యతిరేకత,సానుకూలత గెలుపోటములను నిర్దేశిస్తాయి. అయితే ఈ ఫలితాలను సర్వేలు ప్రభావితం చేస్తున్నాయి. గతంలో సర్వేలకు విశ్వసనీయత ఉండేది. ప్రీ పోల్స్,పబ్లిక్ పల్స్ అనేది పారదర్శకంగా కొనసాగేది. కానీ సర్వేలను సైతం రాజకీయ పార్టీలు ప్రభావితం చేస్తున్నాయి. సర్వే చేసే సంస్థలను.. రాజకీయ పార్టీలు తమకు అనుకూలంగా ఫలితాలు ఇవ్వాలని బలవంతం పెడుతున్నాయి. ఈ క్రమంలో సర్వే సంస్థల ఫలితాలు గాడి తప్పుతున్నాయి.ప్రజాభిప్రాయం ఒకటైతే..అవి ఇచ్చే ఫలితాలు విరుద్ధంగా ఉంటున్నాయి. కొన్ని సర్వే సంస్థలు అయితే ఏకపక్షంగా ముందుకెళ్తున్నాయి. ఈ క్రమంలో ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నాయి. నిన్నటి వరకు ఏపీలో వైసీపీకి అనుకూలంగా సర్వే ఫలితాలు వచ్చాయి. ఇప్పుడు కొన్ని సంస్థలు విపక్షాలకు అనుకూలంగా ఫలితాలు ఇస్తుండడంతో..అసలు వాస్తవం ఏంటి? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
గతంలో జాతీయస్థాయిలో కొన్ని సర్వే సంస్థలకు మంచి పేరు ఉండేది.ప్రజాభిప్రాయాన్ని సక్రమంగా చెప్పడంలో అవి విజయం సాధించేవి. దేశంలో రెండు సర్వే సంస్థలకు అత్యధికంగా స్ట్రైక్ రేట్ ఉండేది. ఒకటి మై యాక్సిస్ ఇండియా, రెండు సి ఓటర్. ఈ సర్వే సంస్థలు సక్సెస్ రేట్లో ముందుకు సాగేవి. ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపించే సరికి ఈ రెండు సంస్థలు సర్వే చేపట్టాయి. టిడిపి, జనసేన కూటమికి అనుకూలంగా ఫలితాలు ఇచ్చాయి. ఈ ఫలితాలను వైసిపి శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. తప్పుడు సర్వేలు గా తేల్చి చెబుతున్నాయి. ఈ సర్వే సంస్థల ఫలితాలను విశ్వసించకూడదని వైసిపి అనుకూల మీడియా కథనాలు ప్రచురించడం విశేషం.
అయితే మొన్నటి వరకు వైసిపికి కొన్ని సర్వే సంస్థలు అనుకూల ఫలితాలు ఇచ్చాయి. కానీ వాటిని ఎల్లో మీడియా పరిగణలోకి తీసుకోలేదు. ఇప్పుడు ఇండియా టుడే, సి ఓటర్ సంస్థ టిడిపికి అనుకూల ఫలితాలు ఇవ్వడంతో.. ఎల్లో మీడియా పతాక శీర్షికన ఈ సర్వే ఫలితాలను వెల్లడించడం విశేషం. ఒకటి మాత్రం నిజం. ఏపీలో వైసీపీ సర్కార్ ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. ప్రజాభిప్రాయం మారుతోంది. ఈ గుణపాఠాన్ని మరిచిపోయి ఇంకా పాత భ్రమలోనే వైసీపీ నేతలు ఉన్నారు. విశ్వసనీయతగా ఉన్న సర్వే సంస్థలు ఇచ్చిన ఫలితాలను బట్టి జాగ్రత్తలు తీసుకుంటే ఆ పార్టీకే మంచిది.
గత ఏడాదిగా ప్రజాభిప్రాయం మారుతూ వస్తోంది. సరిగ్గా ఏడాది కిందట జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది. ఎమ్మెల్యే కోటా కింద జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో సైతం అనూహ్య గెలుపు టిడిపి ఖాతాలో పడింది. తరువాత విపక్షాలన్నీ ఏకతాటి పైకి వచ్చాయి. జనసేనతో టిడిపి పొత్తు పెట్టుకుంది. బిజెపి సైతం ఈ రూట్లోకి వస్తోంది. మరోవైపు షర్మిల రూపంలో ప్రమాదం పొంచి ఉంది. అటు వామపక్షాలు సైతం జగన్ అధికారానికి దూరం కావాలని కోరుకుంటున్నాయి. ఈ పరిణామాల క్రమంలో ప్రజల మూడ్ మారుతోంది. సర్వే సంస్థలు కూడా అవే చెబుతున్నాయి. ఈ క్రమంలో జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ మేకపోతు గాంభీర్యంతో ముందుకు సాగితే మాత్రం ఆ పార్టీకే నష్టం.