మాజీ మంత్రి వివేకానంద రెడ్డి(Vivekananda Reddy) హత్య కేసులో వేగం పెరిగింది. సీబీఐ దర్యాప్తులో ఆసక్తికర విషయాలు వెలుగుచూస్తున్నాయి. వైఎస్ కుటుంబ సభ్యులను విచారించడంతో అందరిలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సీబీఐ అధికారులను బుధవారం వైఎస్ వివేకా కుమార్తె డాక్టర్ సునీత(Sunitha) కలవడంతో ఆమె పాత్రపై కూడా సందేహాలు వ్యక్తం అవుతున్నాయని పలువురు భావిస్తున్నారు. అసలు ఆమె సీబీఐ విచారణకు ఆమె స్వయంగా వెళ్లారా? లేక సీబీఐ అధికారులే పిలిచారా? అనేది చర్చనీయాంశం అయింది.. మొత్తానికి సీబీఐ విచారణలో పలు విషయాలు తెలుస్తున్నాయనేది నిర్వివాదాంశం.
పులివెందుల అతిథి గృహంలో నిర్వహించిన సీబీఐ విచారణకు రెండో రోజు కడప ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి, ఆయన సోదరుడైన పులివెందుల మున్సిపల్ వైస్ చైర్మన్ వైఎస్ మనోహర్ రెడ్డి హాజరయ్యారు. వైఎస్ వివేకా కూతురు హైకోర్టుకు సమర్పించిన జాబితాలో వీరిద్దరి పేర్లు ఉన్నాయని తెలుస్తోంది. గతంలో జరిగిన ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసిన వివేకానందరెడ్డి ఓటమికి మనోహర్ రెడ్డి కూడా కారణమని ప్రచారం జరిగింది. భాస్కర్ రెడ్డి, మనోహర్ రెడ్డి ఇచ్చిన సమాచారంతో సునీతను పిలిచి మాట్లాడారా అనే ప్రశ్నలు వస్తున్నాయి.
రెండో రోజు కూడా సునీతను పిలిచి మరింత సమాచారం రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. వివేకా హత్యకు కుటుంబ గొడవలే కారణమై ఉంటుందా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. దీంతో భాస్కర్ రెడ్డి, మనోహర్ రెడ్డి లతో వివేకాకు ఏవైనా గొడవలున్నాయా? విషయాలపై ఆరా తీస్తున్నారు. ఆర్థికపరమైన గొడవలా? రాజకీయ సంబంధమైనవా అని సీబీఐ అధికారులు విచారణ చేపడుతున్నారు.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు రోజురోజుకు మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే పలు కోణాల్లో సీబీఐ దర్యాప్తు చేపడుతోంది. అనుమానితుల నుంచి సమాచారం రాబట్టేందుకు ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో వైఎస్ వివేకా కుమార్తెను విచారించడంతో అందరిలో కూడా ఆసక్తికర చర్చ సాగుతోంది. అసలు కేసు ఎటు వైపు వెళుతుందో అనే సందేహాలు నెలకొనన్నాయి. దీంతో ఇప్పటికి సేకరించిన ఆధారాలతో కేసు ఓ కొలిక్కి వస్తుందని భావిస్తున్నారు. కీలక ఆధారాలు సేకరించి కేసును సుఖాంతం చేసే విధంగా ప్రయత్నాలు సాగుతున్నట్లు తెలుస్తోంది.