రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపు అంశంలో ఈసీ అఫిడవిట్ కు రిప్లై పిటీషన్ మాజీ ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ హైకోర్టులో దాఖలు చేశారు. ఈ పిటీషన్ లో పలు కీలక విషయాలను నిమ్మగడ్డ వెల్లడించారు.
ఎన్నికల కమిషనర్ తీసుకునే నిర్ణయాలన్నీ ఎన్నికల సంఘం సెక్రటరీకి చెప్పాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. సెక్రటరీ విధులు కేవలం కమిషనర్ రోజు వారీ విధుల్లో సాయం చేయటానికి మాత్రమే పరిమితంగా ఉంటాయన్నారు.
ఎన్నికల వాయిదా నిర్ణయం అత్యంత గోప్యతగా తీసుకోవాల్సిన నిర్ణయమని తెలిపారు. ఎన్నికల సంఘంలోని న్యాయ విభాగం ఎన్నికల వాయిదా నోటిఫికేషన్ డ్రాఫ్ట్ తయారు చేసిన తర్వాతే తాను సంతకం చేశానని వెల్లడించారు. ఎన్నికల వాయిదా నిర్ణయం ప్రకటిస్తూ నిర్వహించిన మీడియా సమావేశం ఒకరోజు ముందుగానే నిర్ణయించినట్లు చెప్పారు. ఎన్నికల కమిషనర్ కి తన విచక్షణ అధికరంతో వాయిదా వేసే అధికారం ఉంటుందన్నారు.
ఎన్నికల కమిషనర్ తీసుకునే నిర్ణయాలు అన్నింటినీ ఎన్నికల సంఘంలో ఉన్న ఉద్యోగులతో చర్చించాల్సిన అవసరం లేదనే విషయాన్ని పిటీషన్ లో పేర్కొన్నారు.
ఎస్.ఈ.సి తొలగింపు వ్యవహారంలో ప్రభుత్వం తరపున రాష్ట్ర ఎన్నికల సంఘము కార్యదర్శి రామసుందర రెడ్డి కౌంటర్ దాఖలు చేశారు. కౌంటర్ లో లేవనెత్తిన అంశాలపై మాజీ ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ తన పిటీషన్ లో సమాధానం ఇచ్చారు.