Prime Minister Modi : ప్రధాని నరేంద్రమోదీకి జంతువులు అంటే చాలా ఇష్టం. అందుకే ఆయన మన దేశంలో అంతరించిపోయిన చీతాలను మళ్లీ పెంచేందుకు ఆఫ్రికా దేశాల నుంచి కోట్ల రూపాయలు వెచ్చించి తెప్పించారు. అడవిలోకి వాటిని విడుదల చేసి.. స్వయంగా కెమెరాతో వాటిని ఫొటోలు తీశారు. ఇక మోదీ తన ఇంట్లో పక్షులను పెంచుతారు. గతంలో ఆయన తన ఇంట్లో నెమళ్లకు ఆహారం పెట్టడం కూడా చూశాం. తాజాగా మోదీ తన ఇంటికి దీప జ్యోతి అనే అతిథిని ఆహ్వానించారు. మోదీ ఇంట్లో పెంచుతున్న గోవు.. ఇటీవలే దూడకు జన్మనిచ్చింది. దానికి దీపజ్యోతి అని పేరు పెట్టారు. వినాయక నవరాత్రి సందర్భంగా దీపజ్యోతిని మోదీ తన ఇంట్లోకి ఆహ్వానించారు. ప్రత్యక పూజలు చేశారు.
తల్లిగా గోవు..
గోవులు అనాదిగా మనతో అనుబంధం కొనసాగిస్తున్నాయి. ఆవులను పూజించే సంస్కృతి కూడా ఎప్పటి నుంచో వస్తోంది. హిందూ సంప్రదాయంలో గోవుకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఒక్క గోవును పూజిస్తే కోటి దేవుళ్లను పూజించినట్లు చెబుతారు పండితులు. భూమిపై మానవ మనుగడ ఉన్నప్పటి నుంచి గోవులు మనకు సేవ చేస్తున్నాయి. సహాయ సహకారాలు అందిస్తున్నాయ. సింధు నాగరికతలో మనుషులతో మొదట స్నేహం చేసిన జంతువులు కుక్క, గోవు, గుర్రం, కోళ్లు అని చరిత్ర చెబుతోంది. ఇక బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ నేపథ్యం ఉన్న పార్టీ. పూజలు, పునస్కారాలకు ప్రాధాన్యం ఇస్తారు. మోదీ స్వయంగా అనేక పూజలు చేస్తారు. ప్రధాని నరేంద్ర మోదీకి గోవులంటే చాలా ఇష్టం.
మోదీ ఇంట్లో గోమాత..
ప్రధాని మోదీ ఇల్లు ఢిల్లీలోని లోక కళ్యాణ మార్గంలో ఉంది. అక్కడ తల్లి ఆవు.. దూడకు జన్మనిచ్చింది. వినాయక నవరాత్రుల సమయంలో ఈ దూడ పుట్టడం గొప్ప విషయంగా చెబుతున్నారు. దీంతో మోదీ శనివారం దీపజ్యోతిని ఇంట్లోకి ఆహ్వానించారు. తమ కుటుంబం లోకి కొత్త మెంబర్ వచ్చినట్లు తెలిపారు. ఆవు అన్ని రకాలుగా ఆనందాన్ని తెస్తుంది. ఈ దూడ తలపై కాంతి ఆకారంలో ఒక మార్క్ ఉంది. అందుకే ఈ దూడకు దీప జ్యోతి అనే పేరు పెట్టినట్లు ప్రధాని మోదీ తెలిపారు.