PM Modi- Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి కోసం బీజేపీ పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తోందా? రాజకీయాలంటే తనకు ఇంట్రెస్ట్ లేదని చెప్పినా వినడం లేదా? ఎలాగైనా పొలిటికల్ రీఎంట్రీ ఇవ్వాలని భావిస్తోందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తాజాగా ప్రధాని మోదీ చిరంజీవికి ఆహ్వానం పంపారని పొలిటికల్ సర్కిల్ లో ప్రచారం సాగుతోంది. కర్నాటక ఎన్నికల తరువాత తప్పనిసరిగా తనను కలవాలని ప్రధాని మోదీ స్వయంగా చిరంజీవిని కోరినట్టు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఇదో ఆసక్తికరమైన వార్తగా మారింది. అంతటా దీనిపైనే చర్చ సాగుతోంది.
సినిమాల్లో బిజీ..
ప్రస్తుతం చిరంజీవిని సినిమా రంగంపైనే దృష్టిపెట్టారు. వరుస సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. సినీ రంగమే బాగుందని..అనవసరంగా రాజకీయాల్లోకి వెళ్లి టైమ్ వేస్ట్ చేశానని బాధపడ్డారు. సుమారు 10 ఏళ్ల పాటు నటనకు దూరమై మూల్యం చెల్లించుకున్నానని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. సినీ రంగంలో చాలా ప్రశాంతంగా ఉన్నారు. ఫుల్ జోష్ లో ఉన్నారు. అయితే మెగాస్టార్ అలా హ్యాపీగా ఉండడం ఇష్టం లేదా లేక ఆయన అంటే తమకు అమిత ఇష్టమా ఏమో తెలియదు కానీ రాజకీయ పార్టీలు ఎపుడూ చిరంజీవికి గేలం వేస్తూనే ఉన్నాయి. నాడు విలీనం పేరిట కాంగ్రెస్ తనలో కలుపుకోగా.. ఇప్పుడు కమలం పార్టీ గురిపెట్టింది.
ఎప్పటి నుంచో ప్రయత్నం..
అయితే చిరంజీవిని రాజకీయాల్లో మళ్లీ తేవాలని బీజేపీ చేయని ప్రయత్నమంటూ లేదు. చాలాసార్లు ప్రయత్నించినా చిరంజీవి ముఖం మీదే చెప్పేశారు. భీమవరంలో అల్లూరి విగ్రహావిష్కరణ సమయంలో సైతం ప్రధాని మోదీ చిరంజీవికి ప్రాధాన్యమిచ్చారు. సీఎం జగన్ తో పాటు కేంద్ర మంత్రులు, హేమాహేమీలు ఉన్నా.. అందర్నీ కాదని చిరంజీవితోనే చనువుగా మెలిగారు. యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంలో సైతం బీజేపీ నేతలు చిరంజీవితో మంతనాలు జరిపినట్టు వార్తలు వచ్చాయి. కానీ చిరంజీవి ససేమిరా అన్నారన్న ప్రచారం సాగింది. అటు కేంద్ర మంత్రి ఒకరు అదేపనిగా ఫోర్సుచేసినట్టు టాక్ నడిచింది. అందుకే ఓ సినీ ఈవెంట్ లో మళ్లీ రాజకీయాల్లోకి వెళ్లేది లేదని ప్రచారానికి తెరదించారు.
ఎందుకు పిలిచినట్టు?
అయితే ఇప్పుడు ప్రధాని మోదీ చిరంజీవిని ఎందుకు పిలిచినట్టు అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. సడెన్ గా చిరంజీవికి ప్రధాని మోడీ నుంచి ఇన్విటేషన్ ఎందుకు వచ్చింది అన్నదే చర్చగా ఉంది. అయితే తెలంగాణా ఎన్నికలు దగ్గరలో ఉన్నాయి కాబట్టి…ఎన్నికల్లో చిరంజీవిని పూర్తిగా వాడుకునేందుకే ఈ ఆల్ ఆఫ్ సడెన్ ఇన్విటేషన్ అని అంటున్నారు. ఇప్పటికే రాజకీయాల్లో ఎందుకు వెళ్లానా? అని అంతర్మథనం చెందుతున్న చిరంజీవి ప్రధాని కోరికను యాక్సెప్ట్ చేసే చాన్సే లేదని కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే ప్రధానిలాంటి పవర్ ఫుల్ లీడర్ పిలిచారు కనుక.. చిరంజీవి తప్పకుండా వెళతారని.. కానీ బీజేపీకి సపోర్టు చేసే చాన్స్ చాలా తక్కువ అని విశ్లేషకులు చెబుతున్నారు.