PM Modi : ఏపీ రాజకీయాలు హీట్ పుట్టిస్తున్నాయి. పొత్తులతో లెక్కలు మారుతున్నాయి. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలోకి ఎంట్రీ ఇచ్చింది. అటు ఏపీలో సైతం టిడిపి,జనసేన, బిజెపి జతకట్టాయి. ఈ నేపథ్యంలో వైసిపి వర్సెస్ కూటమి అనే పరిస్థితి వచ్చింది. అందుకు తగ్గట్టుగానే ఇరుపక్షాలు వ్యూహాలు రూపొందిస్తున్నాయి. ఈ మూడు పార్టీలు ఎన్నికల ప్రచార సభలను ప్రారంభించాయి. ఈరోజు చిలకలూరిపేట సమీపంలో జరిగిన భారీ బహిరంగ సభకు ప్రధాని మోదీ హాజరయ్యారు. ఎన్డీఏ విధానాలను చెబుతూనే వైసీపీ సర్కార్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ తీరును ఎండగట్టారు. దీంతో ప్రధాని మోదీ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
గత ఎన్నికలకు ముందు ఎన్డీఏ నుంచి తెలుగుదేశం పార్టీ బయటకు వెళ్ళింది. దీంతో ఎన్నికల్లో వైసీపీకి బిజెపి నుంచి సాయం అందింది. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపితో సన్నిహిత సంబంధాలు కొనసాగాయి. రాష్ట్ర ప్రభుత్వ పరంగా, పాలనాపరంగా ప్రధాని మోదీ జగన్ కు సహకారం అందిస్తూ వచ్చారు. అటు తెలుగుదేశం పార్టీని ఎన్డీఏలో చేర్చుకోవద్దని.. అవసరమైతే తాను చేరతానని జగన్ ప్రధానికి విజ్ఞప్తి చేసినట్లు వార్తలు వచ్చాయి. అటు పొత్తు అంశం లో జాప్యం జరగడంతో బిజెపికి ఇష్టం లేదని ప్రచారం జరిగింది. దీని వెనుక జగన్ ఉన్నారన్న అనుమానాలు వ్యక్తం అయ్యాయి. కానీ అనూహ్యంగా బిజెపి టిడిపిని ఎన్డీఏలోకి రప్పించింది. ఏపీలో కూటమిలోకి చేరింది. అయినా సరే జగన్ విషయంలో బిజెపి సానుకూలంగా ముందుకెళ్తుందని అంతా ఆశించారు. కానీ నేటి బహిరంగ సభలో ప్రధాని ఆ అనుమానాలను పటాపంచలు చేస్తూ వైసీపీ సర్కార్ పై తీవ్రస్థాయిలో విరుచుకు పడడం విశేషం.
ప్రధాని మోదీ ఏపీ ప్రజలకు ప్రత్యేక పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ ఓటు వేసే ముందు రెండు సంకల్పాలు తీసుకోవాలని సూచించారు. కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ ను స్థాపించడం ఒకటోదని.. రాష్ట్రంలో అవినీతి వైసీపీ సర్కార్ కు చరమగీతం పాడడం రెండోదని పిలుపునివ్వడం విశేషం. రాష్ట్రంలో మంత్రులు అవినీతి అక్రమాల్లో పోటీ పడుతున్నారని ఆరోపించారు. ఐదేళ్లలో ఏపీ అభివృద్ధి కుంటుపడిందని.. దానిని గాడిలో పెట్టే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్, వైసిపి వేరు కాదని.. రెండు ఒక్కటేనని.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని.. ఆ రెండు పార్టీల పన్నాగాన్ని గుర్తించి ఎన్డీఏ ఓటు వేయాలని ప్రధాని పిలుపునివ్వడం విశేషం. 2014 ఎన్నికలకు ముందు కూడా వైసిపి పై ప్రధాని మోదీ ఇదే తరహా ఆరోపణలు చేశారు. మళ్లీ ఇప్పుడు అదే ఆరోపణలు చేయడం గమనార్హం.