PM Modi : హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన బీజేపీ బీసీ ఆత్మగౌరవ సభలో ప్రధాని మోడీ తెలంగాణ ప్రజలకు సంచలన హామీలు ఇచ్చారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పై నిప్పులు చెరిగారు. తెలంగాణ ఏర్పాటుకు దారితీసిన నీళ్లు, నిధులు, నియామకాల సమస్యలపై ప్రధాని మోదీ మాట్లాడారు. మూడు అంశాల్లోనూ తెలంగాణ ప్రజలు నిరాశకు గురయ్యారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో బీసీ, ఎస్సీ , ఎస్టీ జనాభా గణనీయంగా ఉన్నప్పటికీ బీఆర్ఎస్ ప్రభుత్వం బీసీ (వెనుకబడిన తరగతి) ప్రయోజనాలను నిరంతరం విస్మరించిందని ప్రధాన మంత్రి ఆరోపించారు.
కాంగ్రెస్ రూపంలోని బీఆర్ఎస్ యొక్క ‘సీ టీమ్’ ఉనికిని కూడా ప్రధాని మోడీ హైలైట్ చేశారు. కాంగ్రెస్ ఎజెండాలో బీసీ ఆకాంక్షలు లేకపోవడాన్ని ఎత్తి చూపారు. “కాంగ్రెస్ , బీఆర్ఎస్ వారి DNA లో మూడు సాధారణ విషయాలను ఎత్తి చూపాడు. ఒకటి వారి రాచరిక వారసత్వ పాలన, రెండోది అవినీతి, మూడోది బంధుప్రీతి. ఈ వంశపారంపర్య పార్టీల ఆశ్రయంలో అవినీతి వర్ధిల్లుతుంది. అవకాశాలు వారి బంధువులకు మాత్రమే లభిస్తాయి. వంశపారంపర్య మనస్తత్వంతో నడిచే బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లు ఇక్కడ ఏ బీసీని ముఖ్యమంత్రిగా చేయనివ్వవు అని మోడీ విమర్శించారు..
దేశవ్యాప్తంగా ఓబీసీ వర్గాల అభ్యున్నతికి, ప్రాతినిథ్యానికి బీజేపీ నిబద్ధతను ప్రధాని ఉద్ఘాటించారు. బీజేపీకి అవకాశం వచ్చినప్పుడు ఆదివాసీ వర్గానికి చెందిన ద్రౌపది ముర్ముని రాష్ట్రపతిగా నియమించామని… వంశపారంపర్య పార్టీలు దళితులు, వెనుకబడినవారు లేదా ఆదివాసీలు ఎవరినీ ఎదగనివ్వవనని అన్నారు.. నేడు దేశంలో ఓబీసీ వర్గాలకు అత్యధిక ప్రాతినిధ్యం కల్పిస్తున్న ఏకైక పార్టీ బీజేపీ మాత్రమే. తెలంగాణలో గెలిస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని సంచలన ప్రకటన చేశారు.
