Presidential elections 2022: రాష్ట్రపతి అభ్యర్థిని ఏకగ్రీవంగా రంగంలోకి దించాలనుకున్న ప్రతిపక్షాల ప్రయత్నాలు ఫలించలేదు. అన్ని పార్టీలు కలిసి ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌ను నిలబెట్టాలని ప్రతిపాదించినప్పటికీ అందుకు ఆయన నిరాకరించడంతో ప్రతిపక్షాలు దిక్కుతోచని పరిస్థితుల్లో పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం బుధవారం మధ్యాహ్నం ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో జరిగిన ప్రతిపక్షాల సమావేశంలో 17 పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ భేటీకి కాంగ్రె్‌సను ఆహ్వానించడంపై తీవ్ర అభ్యంతరాలు తెలిపిన టీఆర్‌ఎస్, బీజేడీ, శిరోమణి అకాలీదళ్, సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ ప్రతినిధులు సమావేశానికి గైర్హాజరయ్యారు. సమావేశానికి హాజరైన ప్రతినిధులు రాష్ట్రపతి అభ్యర్థిపై దాదాపు గంటన్నరకుపైగా చర్చించారు. శరద్ పవార్‌ను పునరాలోంచాలని ప్రతిపక్షాలు అభ్యర్థించినప్పటికీ ఆయన అందుకు అంగీకరించే అవకాశాలు కనిపించడం లేదని ప్రతిపక్షాలే అంటున్నాయి.
ఈ నేపథ్యంలో.. ప్రత్యామ్నాయంగా ఫరూక్ అబ్దుల్లా, గోపాలకృష్ణ గాంధీ పేర్లను మమతా బెనర్జీ ప్రతిపాదించినట్టు ఆర్‌ఎస్పీ నేత ఎన్‌కే ప్రేమ్‌చంద్రన్ తెలిపారు. అయితే.. తొలి భేటీ ఫలవంతం కాని నేపథ్యంలో.. ఈ నెల 20-21 తేదీల్లో మరోసారి ముంబైలో శరద్‌పవార్ నేతృత్వంలో భేటీ అయి, ఏకాభిప్రాయానికి వస్తామని ఈ సమావేశంలో పాల్గొన్న నేతలు పేర్కొన్నారు. ఆ భేటీకి వచ్చే పార్టీలూ ఊరకనే రాకుండా ఎవరో ఒకరి పేరును ప్రతిపాదిస్తాయని భావిస్తున్నామని, అభ్యర్థిపై ఏకాభిప్రాయం వచ్చిన తర్వాత.. టీఆర్‌ఎస్, ఆప్, బీజేడీ, వైసీపీ, ఎస్‌ఏడీ వంటి పార్టీలతో కూడా చర్చిస్తామని వారు స్పష్టం చేశారు.
కాగా.. ‘‘రాజ్యాంగాన్ని సంరక్షించే బాధ్యతను నిర్వర్తించగలిగి.. భారత ప్రజాస్వామ్యాన్ని మోదీ ప్రభుత్వం మరింత నాశనం చేయడాన్ని అడ్డుకోడానికి ఉమ్మడి అభ్యర్థిని బరిలోకి దించాలని నిర్ణయించాం’’ అని ప్రతిపక్ష పార్టీలు తీర్మానాన్ని ఆమోదించాయి. తీర్మాన ప్రతిని సుధీంద్ర కులకర్ణి విలేకరులకు చదివి వినిపించారు. కాగా, విపక్షాల తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా తన పేరు వినిపించడం పట్ల పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ గోపాలకృష్ణ గాంధీ స్పందన కోరగా ఆ విషయంపై ఇప్పుడే స్పందించడం తొందరపాటు అవుతుందని వ్యాఖ్యానించారు. అయితే, విపక్ష నేతలు కొందరు ఈ మేరకు ఆయన్ను సంప్రదించారని.. ఆలోచించుకోవడానికి తనకు కొద్ది సమయం కావాల్సిందిగా వారిని ఆయన అడిగారని విశ్వసనీయ వర్గాల సమాచారం.
సంప్రదింపులతో..
సమావేశం ముగిసిన తర్వాత ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మమతా బెనర్జీ మాట్లాడారు. ప్రతిపక్షాల తరఫున ఒక అభ్యర్థి మాత్రమే ఉండాలని భావిస్తున్నామని, సమావేశంలో ఏకగ్రీవంగా శరద్ పవార్ పేరును ప్రతిపాదించామని వెల్లడించారు. కానీ ఆయన ఆసక్తి లేదని చెప్పారని, పవార్ అంగీకరిస్తే అందరూ ఆయనకు మద్దతిస్తారని స్పష్టం చేశారు. అంగీకరించకపోతే ఇతర పార్టీలు ప్రతిపాదించే పేర్లపై సంప్రదింపులు జరిపి నిర్ణయం తీసుకుంటామన్నారు. అన్ని ముఖ్యమైన పార్టీలూ తమ తమ ప్రతినిధులను ఈ సమావేశానికి పంపించాయని ఆమె తెలిపారు. సమాజ్‌వాది పార్టీ నేత అఖిలేశ్ యాదవ్, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీతోపాటు.. సీపీఎం, సీపీఐ, ఆర్‌ఎస్పీ, కాంగ్రెస్, శివసేన, డీఎంకే, ఎన్సీపీ, జేడీఎస్ వంటి అనేక పార్టీల ప్రతినిధులు హాజరయ్యాయని పేర్కొన్నారు. ‘‘కేవలం ఒకటి రెండు పార్టీలు మాత్రమే గైర్హాజరయ్యాయి.
అందుకు వారికి ఏమైనా కారణాలు ఉండవచ్చు, బిజీగా ఉండవచ్చు.’’ అని దీదీ అన్నారు. చాలా నెలల తర్వాత ప్రతిపక్షాల భేటీ జరిగిందని గుర్తుచేసిన మమత.. ఇది ఆరంభం మాత్రమేనని వ్యాఖ్యానించారు. దేశంలో బుల్డోజింగ్ జరుగుతోందని, ప్రజాస్వామ్యంలో ప్రతి వ్యవస్థనూ కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు. దీన్ని ఎదుర్కోవడానికి ప్రతిపక్షాలు ఏకతాటిపై ఉండాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఇక.. ప్రతిపక్షాల తరఫున నిలబెట్టే రాష్ట్రపతి అభ్యర్థిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడంలో కాంగ్రెస్ పార్టీ నిర్మాణాత్మక పాత్ర పోషిస్తుందని ఆ పార్టీ నేత మల్లికార్జున ఖర్గే తెలిపారు. విపక్షాలన్నీ ఈ విషయంలో క్రియాశీల పాత్ర పోషించాలని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా.. ఈ సమావేశంలో మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక ముసాయిదా తీర్మానాన్ని మమత ప్రవేశపెట్టినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆ ముసాయిదాను ముందుగానే తమకు ఇవ్వకపోవడంపై పలు పార్టీలు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక కోసం ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో ఇతర అంశాలపై చర్చ వద్దని మరికొన్ని పార్టీలు సూచించినట్లు సమాచారం.
టీఆర్‌ఎస్ ప్లెక్సీ తొలగింపు
టీఆర్‌ఎ్‌సను కూడా ఆహ్వానించిన నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఈ భేటీకి వస్తారని భావించిన పెనుగొండ సాయి సప్త కుమార్ అనే టీఆర్‌ఎస్ నేత.. క్లబ్ ముందు ప్లెక్సీలను ఏర్పాటు చేశారు. ‘‘సీఎం కేసీఆర్‌కు స్వాగతం… దేశ్‌కా నేత కేసీఆర్’’ అని వాటిపై రాయించారు. వీటిని గమనించిన టీఎంసీ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. వాటిని తీసేయించాలని క్లబ్ వర్గాలకు సూచించగా.. వారు వాటిని తొలగించారు.
Also Read:Agneepath Scheme: ‘అగ్నిపథ్’పై మిశ్రమ స్పందన.. తప్పుపడుతున్న రక్షణరంగ నిపుణులు
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Presidential elections 2022 unsatisfactory consensus among the opposition
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com