Pravallika: ప్రవళిక మరణాన్ని అధికార పార్టీ సైడ్ ట్రాక్ పట్టించింది. ఉద్యమ కాలంలో యువకులు మరణించినప్పుడు అప్పటి పోలీసులు ఏ విధంగా అయితే వ్యవహరించారో.. ఇప్పుడు స్వరాష్ట్రంలో కూడా అలానే పోలీసులు మసులుకుంటున్నారు. అంటే సొంత రాష్ట్రం వచ్చినప్పటికీ పరిస్థితిలో పెద్దగా మార్పు రాలేదు. రాజ్యానికి అనుకూలంగా పోలీసు వ్యవస్థ మారిపోయినప్పుడు న్యాయం జరుగుతుందని చెప్పడం అవివేకం. ప్రవళిక మరణం తర్వాత అధికార పార్టీ నుంచి ఒక రకమైన స్పందన, ఆమె తల్లిదండ్రుల నుంచి మరొక స్పందన వచ్చింది. కానీ శేషం లేని ప్రశ్నలు ప్రవళిక మిగిల్చి వెళ్లిపోయింది.
‘‘నీళ్లు.. నిధులు.. నియామకాలు..’’ ఇదీ తెలంగాణ ఉద్యమ సమయంలో సకల జనుల నినాదం. నిరుద్యోగుల త్యాగాలు.. ఉద్యోగులు, కార్మికులు, ఉపాధ్యాయులు.. ఇలా అన్ని వర్గాల పోరాటంతో ప్రత్యేక రాష్ట్రం అనే గమ్యాన్ని ముద్దాడినా.. నిరుద్యోగుల బతుకులు ఇప్పటికీ ఆగమాగంగానే ఉన్నాయి. తెలంగాణలో 1,91,126 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు బిస్వాల్ కమిటీ తేల్చినా.. గ్రూప్-1 నోటిఫికేషన్ రావడానికి ఎనిమిదేళ్ల సమయం పట్టింది. ఆ ఒక్కటే కాదు..! వరుసగా ఏఈఈ, ఏఈ, డీఏవో, గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4, గురుకుల, జూనియర్ లెక్చరర్.. ఇలా వరుస నోటిఫికేషన్లతో నిరుద్యోగులు ‘‘జాబ్ కొట్టాల్సిందే.. తగ్గేదే లే..’’ అంటూ ప్రిపరేషన్లలో నిమగ్నమైన వేళ.. ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఫలితాలు వచ్చిన గ్రూప్-1 ప్రిలిమ్స్ సహా అప్పటికే నిర్వహించిన పలు పరీక్షలు రద్దయ్యాయి. మరికొన్ని రీషెడ్యూల్ అయ్యాయి. నిరుద్యోగులకు కడగండ్లే మిగిలాయి. నిజానికి ఉమ్మడి రాష్ట్రంలో.. 2011లో గ్రూప్-1 నోటిఫికేషన్ వచ్చింది. తెలంగాణ వచ్చాక.. త్వరలో నోటిఫికేషన్లు వస్తాయనే ఆశతో నిరుద్యోగులు 2014 నుంచే ప్రిపరేషన్లు ప్రారంభించారు. 2016లో గ్రూప్-2 నోటిఫికేషన్ వచ్చాక.. కొంత డక్కాముక్కీలు తిన్న నిరుద్యోగులు.. ఈ సారి సీరియ్‌సగా ప్రిపరేషన్లను ప్రారంభించారు. గత ఏడాది వరుస నోటిఫికేషన్లు రావడంతో.. ప్రిపరేషన్‌ను మరింత ముమ్మరం చేశారు. అటు టీచర్ పోస్టుల భర్తీ కోసం కడగండ్లు కాస్తున్న నిరుద్యోగులకు 2018లో డీఎస్సీ వచ్చింది. 2023లో మెగా డీఎస్సీ అంటూ ప్రభుత్వం ఊదరగొట్టడంతో తమ కష్టాలు తీరినట్లే అనుకున్నారు. కానీ, మినీ డీఎస్సీని ప్రకటించి, దాన్ని కూడా ఎన్నికల సాకుతో వాయిదా వేశారు. ఈ ఏడాది ఆరంభంలో రద్దు చేసిన డీఏవో, గ్రూప్-3కి పరీక్షల తేదీని ప్రకటించనే లేదు..! ఇక గ్రూప్-1 ప్రిలిమ్స్‌ను మూడోసారి రాయాల్సిన పరిస్థితి. గ్రూప్-2, డీఎస్సీ/టీఆర్‌టీ పరీక్షల వాయిదాలతో నిరుద్యోగులు నిరాశచెందుతున్నారు. ప్రవళికలాంటివారు తనువు చాలిస్తున్నారు.
ఎవరిని కదిలించినా..
ఉస్మానియా యూనివర్సిటీ పక్కన గల మాణికేశ్వరీనగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, అశోక్‌నగర్, చిక్కడపల్లి, గాంధీనగర్, దోమలగూడ, కవాడిగూడ, రాంనగర్, దిల్‌సుఖ్‌నగర్, చైతన్యపురి, కొత్తపేట, అమీర్‌పేట, ఎస్‌ఆర్‌నగర్, తదితర ప్రాంతాల్లోని హాస్టళ్లలో ఉంటూ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న ఏ నిరుద్యోగిని కదిలించినా.. కన్నీటి కష్టాలే సమాధానాలుగా వస్తున్నాయి. మహబూబ్‌నగర్‌కు చెందిన 32 ఏళ్ల ఓ వ్యక్తి తన డిగ్రీ పూర్తవ్వగానే గ్రూప్-2 కోసం సన్నద్ధమయ్యారు. 2016లో రెండు మార్కులతో ఉద్యోగం తప్పిపోయింది. అప్పటి నుంచి కృతనిశ్చయంతో గ్రూప్-2 కోసం ప్రిపేర్ అవుతున్నారు. ఆయన తమ్ముడు క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నా.. ‘‘కొన్నాళ్లలో జాబ్ వస్తే కష్టాలు తీరుతాయి తమ్ముడూ..’’ అంటూ ఊరడిస్తూ వచ్చారు. జాబ్ సాధించేదాకా పెళ్లి ప్రయత్నాలు వద్దంటూ ఇంట్లో తెగేసి చెప్పారు. ఇప్పుడు పరీక్షలు వాయిదా పడడంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్నారు. యాదాద్రి జిల్లాకు చెందిన ఓ యువతి బీఎస్సీ అగ్రికల్చర్ చదివారు. వ్యవసాయ విస్తీరణ అధికారిగా(ఏఈఓ) ఉద్యోగాన్ని సాధించారు. గ్రూప్-1 కొలువే ఆమె ఆశయం. గత ఏడాది ఏప్రిల్‌లో గ్రూప్-1 నోటిఫికేషన్ రాగానే.. ఆర్నెల్లు సెలవు పెట్టి ప్రిపేర్ అయ్యారు. ప్రిలిమ్స్-1లో గట్టెక్కారు. మెయిన్స్‌కు ప్రిపరేషన్ ప్రారంభించారు. జాబ్ కొట్టాల్సిందేనని రేయింబవళ్లు చదువుకున్నారామె. ప్రశ్నపత్రాల లీకేజీతో ప్రిలిమ్స్-2కు హాజరయ్యారు. సెలవులను కొనసాగిస్తూ.. మెయిన్స్‌కు ప్రిపేర్ అవుతున్నారు. హైకోర్టు ఆదేశాలతో ప్రిలిమ్స్ మరోమారు రద్దవ్వడంతో ఎటూ పాలుపోని స్థితిలో ఉన్నారు. వరుస సెలవుల కారణంగా ఉన్న కొలువు పోయే పరిస్థితి నెలకొందని ఆమె ఘొల్లుమంటున్నారు. ఇలా లక్షల మంది గ్రూప్స్ అభ్యర్థులు ఇప్పుడు పరీక్షల వాయిదాలతో మానసిక క్షోభకు గురవుతున్నారు.
కొత్త ప్రభుత్వం వస్తే పరిస్థితి ఏంటి?
11 ఏళ్ల తర్వాత పెద్దఎత్తున నోటిఫికేషన్లు వస్తున్నందున.. ప్రభుత్వం వయోపరిమితిని కొంత వరకు సడలించింది. జనరల్ కేటగిరీకి 10 ఏళ్ల సడలింపు ఇవ్వవడంతో.. నోటిఫికేషన్ వెలువడేనాటికి 44 ఏళ్ల లోపున్న వారు దరఖాస్తుకు అర్హత సాధించారు. అదేవిధంగా.. ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ బీసీలకు మరో ఐదేళ్ల సడలింపు(49 ఏళ్ల వరకు అవకాశం) ఉంది. దివ్యాంగులు, మాజీ సైనికోద్యోగులకు వేర్వేరుగా సడలింపులున్నాయి. వయసు సడలింపు జీవోతో.. తమ జీవితాలను మార్చుకుందామనుకున్న సీనియర్ నిరుద్యోగులు.. ఇప్పుడు ప్రభుత్వం మారితే ఎలా అనే బెంగతో ఉన్నారు. ‘‘ఇప్పటికే యూపీఎస్సీ మాదిరిగా టీఎస్ పీఎస్సీని నిర్వహిస్తామని కాంగ్రెస్ చెబుతోంది. అంటే.. పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను సమూలంగా ప్రక్షాళన చేసే అవకాశాలున్నాయి. ప్రస్తుత నోటిఫికేషన్లను రద్దు చేస్తే.. మా పరిస్థితేంటి? 2022 నోటిఫికేషన్‌కు అర్హత పొందిన 44 ఏళ్ల వయసు వారు.. కొత్త నోటిఫికేషన్‌కు అనర్హులవుతారు. అలాంటి వారికోసం మరికొంత మినహాయింపు ఉంటుందా?’’ అని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Pravilikas death case was sidetracked what is the point of these vacancies kcr sir
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com