ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కు ఎదురుదెబ్బ తగిలింది. త్రిపుర రాజధాని అగర్తల లో పీకే బృందం బస చేసే హోటల్ కు చేరుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో సర్వేకు ఆటంకాలు ఏర్పడ్డాయి. వారిని అరెస్టు చేయడానికి పోలీసులు చెప్పే కారణం మాత్రం వింతగా ఉంది. కరోనా నేపథ్యంలో ఒకే ప్రాంతంలో 22 మంది ఉండవద్దని సూచించారు. నిజంగా ఇదే తప్పయితే ప్రధాని నరేంద్ర మోడీ తన రోడ్డుషోల్లో వేలాది మందిని ఎలా ఉంచగలిగారనే ప్రశ్నలు వస్తున్నాయి. కొవిడ్ నిబంధనలు అందరికి ఒకేలా ఉండాలని చెబుతున్నారు.
త్రిపురలో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ప్రవేశించాలని చూస్తున్నారు. దీంతో బీజేపీ ఆ ప్రయత్నాలకు అడ్డు కట్ట వేసేందుకు నిర్ణయించుకుంది. బీజేపీ అధికారంలో ఉండగా టీఎంసీ ఆగడాలు అక్కడ సాగవని తెలిసినా ఎందుకు బీజేపీ భయపడుతోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సర్వే నిర్వహించకుండా పీకే బృందాన్ని అదుపులోకి తీసుకుని ఇబ్బందులకు గురిచేయడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
పీకే బృందాన్ని ఒక్క త్రిపురలోనే అడ్డుకోవాలని బీజేపీ చూస్తోందా లేక బీజేపీ పాలిత ప్రాంతాల్లో పీకే రావడానికి చెక్ పెట్టాలని భావిస్తోందా అనే సందేహాలు వస్తున్నాయి. ఒక రాష్ర్ట రాజకీయాలను శాసించేంత శక్తి పీకేకు లేదని తెలుస్తోంది. వారు సర్వే చేసుకోవడానికి వచ్చినట్లు చెబుతున్నారు. ఒక పార్టీని ఓడించి మరో పార్టీని అధికారంలోకి తీసుకురావడం పీకే వల్ల కాదని తెలిసినా బీజేపీ ఎందుకు భయపడుతోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
సామాజిక వర్గాల వారీగా ఏఏ నియోజకవర్గాల్లో పార్టీల బలమెంత? అవి ఏ మేరకు ప్రభావం చూపిస్తాయని సర్వేలో తెలుసుకుంటారు. పీకే బృందం సర్వే చేసినంత మాత్రాన ఎవరికి ఏ నష్టం ఉండదని తెలుసుకోవాలి. పీకే బృందాన్ని అడ్డుకోవడం వల్ల వారికి అనవసర ఇమేజ్ పెంచే దిశగా బీజేపీనే సాయపడుతోందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.