Prashant Kishor: దేశంలో విజయవంతమైన ఎన్నికల వ్యూహకర్తగా గుర్తింపు పొందిన బీహార్ వాసి ప్రశాంత్ కిశోర్ కొన్ని రోజులుగా తీసుకుంటున్న నిర్ణయాలు ఎవరికీ అర్థం కావడం లేదు. కనీసం ఆయనకైనా అర్థం అవుతున్నాయా.. లేదా అన్న అనుమానం కలుగుతోంది. ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు ఇప్పటికే రాజకీయాల్లోకి రావడానికి జేడీయూ, కాంగ్రెస్ పార్టీల చుట్టూ తిరిగిన ఆయన.. ఆ పార్టీలు తనకు సరిపోవు అన్నట్లు వ్యవహరించారు. తాజాగా కొత్త వ్యూహానికి తెరలేపాడు ఈ స్ట్రాటజిస్ట్. తానే సొంతంగా పార్టీ పెట్టాలని నిర్ణయించుకున్నాడు. ఈమేరకు సోమవారం ఓ ట్వీట్ చేశాడు. పార్టీ పేరు ‘జన్ సూరజ్’గా ప్రకటించారు. ఇది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో విస్తత చర్చకు దారితీసింది.

-రాజకీయ అస్తిత్వం కోసం..
దేశంలో విజయవంతమైన ఎన్నికల వ్యూహకర్తగా పేరుపొందిన ప్రశాంత్ కిశోర్ తన స్ట్రాటజీతో ఎన్నో పార్టీలను ఎన్నికల్లో గెలిపించారు. ఎంతో మందిని ముఖ్యమంత్రిని చేశారు. అయితే తానెందుకు రాజకీయాల్లోకి రావొద్దనే ఆలోచన పీకేను కొన్ని రోజులుగా తొలుస్తోంది. ఈ క్రమంలోనే మొదట తన స్వరాష్ట్రం అయిన బిహార్‌లో తాను వ్యూహకర్తగా పనిచేసి ఎన్నికల్లో గెలిపించిన జేడీయూ పార్టీలో నాలుగేళ్ల క్రితం చేరారు. పార్టీ అధినేత నితీశ్‌కుమార్ కూడా ఆయనకు పార్టీలో మంచి స్థానమే కల్పించారు.
Also Read: Pawan Kalyan: సీఎం జగన్ పేరు మార్చిన పవన్ కళ్యాణ్!
అయితే జేడీయూ ప్రాంతీయ పార్టీ కావడం.. అధికారంలోకి వచ్చాక కేంద్రంలోని ఎన్డీయేలో చేరడం.. పీకేకు రుచించలేదు. దీంతో పార్టీ నుంచి బయటకు వచ్చారు. తాను గాంధేయ వాదినని చెప్పుకుంటూ.. ఇటీవల కాంగ్రెస్‌కు దగ్గరయ్యేందుకు ప్రయత్నించారు. సొంత పార్టీలో ఏ నాయకుడికీ ఇవ్వనంతగా సోనియాగాంధీ పీకేకు అపాయింట్‌మెంట్ కూడా ఇచ్చారు. అయితే పీకే ఆశించిన పదవి ఇచ్చేందుకు పార్టీలో చాలామంది వ్యతిరేకించారు. దీంతో చివరి నిమిషంలో స్ట్రాటజీ మార్చుకున్న పీకే.. కాంగ్రెస్ ఆహ్వానాన్ని తానే తిరస్కరిస్తున్నట్లు ఓ ట్వీట్ చేసి సంచలనం రేపారు. 130 ఏళ్ల చరిత్ర ఉన్న పార్టీ అధినేతతో పలుమార్చు చర్చలు జరిపి 2024 అధికారంలోకి తీసుకురావడానికి వందలాది వ్యూహాలను సమర్పించి.. ఆ పార్టీని అవమానించేలా కాంగ్రెస్ ఆహ్వానాన్ని తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు.
-సొంత రాష్ట్రం నుంచే పొలిటికల్ ఎంట్రీ..
ప్రశాంత్ కిశోర్ ఇప్పుడు సొంతగా రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు. ఈమేరకు సోమవారం ఒక ట్వీట్‌చేశారు. గడిచిన కొద్ది నెలలుగా ఢిల్లీలోనే మకాం వేసి, మధ్యమధ్యలో హైదరాబాద్ వచ్చి వెళ్లిన ప్రశాంత్ కిశోర్ కొత్త రాజకీయ పార్టీ ప్రకటనను మాత్రం సొంత రాష్ట్రమైన బీహార్ నుంచే రాజకీయ పార్టీ ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందు కసం ఆయన ఆదివారమే బీహార్ రాజధాని పాట్నా చేరుకున్నారు. అక్కడ తన శ్రేయోభిలాషులు, పలువురు భావసారూప్య పార్టీల నేతలతో చర్చలు జరిపారు. సోమవారం ఉదయం తాను పార్టీ పెడుతున్నట్లు.. పార్టీ పేరు జన్ సూరజ్ అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

-పొలిటికల్ ఎంట్రీ వెనుక ‘వ్యూహం’
ప్రశాంత్ కిశోర్ సొంత సంస్థ ఐపాక్ కు దేశవ్యాప్తంగా వాలంటీర్లు, ఉద్యోగులు ఉండటం ఒక ఎత్తయితే, రాజకీయాల్లోకి యువత రావాలనే నినాదంతో పీకే టీమ్ చేపట్టిన డ్రైవ్‌లోనూ అన్ని రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున పేర్లు నమోదు జరిగినట్లు సమాచారం. సొంత రాష్ట్రం బీహార్‌లో పీకే ఇదివరకే గ్రామస్థాయి నుంచి యువతతో కమిటీలు ఏర్పాటు చేశారు. కొత్త రాజకీయ పార్టీ ప్రకటించిన నేపథ్యంలో ఆ కమిటీలకు మళ్లీ జీవం పోయాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. అన్ని రాష్ట్రాల్లో సమాంతరంగా పార్టీ విస్తరణ జరిగేలా పీకే వ్యూహాలు చచిస్తున్నట్లు తెలుస్తోంది.
-జన్ ‘సూరజ్’ ఉదయించేనా?
వైద్యుడే అయినా.. సొంతంగా చికిత్స చేసుకోలేడు అంటారు. పీకే సొంత సంస్థ ఐపాక్ ఇప్పటికే పలు పార్టీల కోసం పనిచేస్తున్నారు. విజయవంతంగా ఎన్నికల్లో గెలిపించారు. ప్రస్తుతం తెలంగాణ సీఎం, టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌తో రెండు రోజులపాటు హైదరాబాద్‌లోనే ఉండి చర్చలు జరిపారు. షర్మిల పార్టీకి కూడా ఆయన వెనుక ఉండి సలహాలు ఇస్తున్నట్లు సమాచారం. ఏపీలో వైఎస్సార్‌సీపీ మొన్నటి వరకు పనిచేశారు. వారం క్రితం వరకూ కాంగ్రెస్‌కు వ్యూహాలు రచించారు. చివరకు తానే సొంతంగా పార్టీ పెట్టుకున్నారు. అయితే బీజేపీని ఓడించడానికి మూడు, నాలుగో ఫ్రంట్ పనికి రాదని ఇటీవల ప్రకటించి సంచలనం రేపారు పీకే. రెండో కూటమి కావాలని అన్నారు. అయితే దేశంలో రెండో కూటమి లేదని, కాంగ్రెస్ రెండో అతిపెద్ద పార్టీ మాత్రమే అని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే రెండో కూటమి తన సారథ్యంలో ఏర్పడాలని భావించిన పీకే సొంత పార్టీని ప్రకటింనట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 2024 నాటికి బీజేపీ వ్యతిరేక పార్టీలను ఏకం చేసి తానే సారథ్యంలో బీజేపీని ఓడించే రెండో కూటమి ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉన్నందున పీకే జన్ సూరజ్ ఏమేరకు ఉదయిస్తుందో వేచి చూడాలి మరి!!
Also Read: Teenmar Mallanna: బీజేపీకి తీన్మార్ మల్లన్న రాం రాం..! షాకింగ్ కారణం ఇదేనా..?



[…] […]