Homeజాతీయ వార్తలుPrajwal Revanna: దౌత్య పాస్‌పోర్టు.. ఎవరికి ఇస్తారు.. ప్రజ్వల్‌కు ఎలా వచ్చింది?

Prajwal Revanna: దౌత్య పాస్‌పోర్టు.. ఎవరికి ఇస్తారు.. ప్రజ్వల్‌కు ఎలా వచ్చింది?

Prajwal Revanna: పార్లమెంట్‌ ఎన్నికల సందర్భంగా హాసన సెక్స్ కుంభకోణం కర్ణాటక రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేసిన సిట్‌.. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీఎస్‌ అధినేత హెచ్‌డీ దేవగౌడ కుమారుడు రేవణ్ణ, మనుమడు ప్రజ్వల్‌పై కిడ్నాప్‌, అత్యాచారం కేసులు నమోదు చేసింది. అయితే ఈ వ్యవహారం బయటికొచ్చిన మొదట్లోనే ప్రజ్వల్ డిప్లొమాటిక్ పాస్‌పోర్టుతో దేశం విడిచి వెళ్లిపోయారు. చట్ట ప్రకారం విచారణ ఎదుర్కొనేందుకు ప్రజ్వల్‌ను తిరిగి భారత్‌కు తీసుకువచ్చేందుకు సరైన చర్యలు తీసుకునేలా విదేశీ వ్యవహారాల శాఖను ఆదేశించాలని ప్రధాని నరేంద్రమోదీని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కోరారు. ప్రజ్వల్ దౌత్య పాస్‌పోర్టు రద్దు చేయాలని కోరారు. అయితే ఈ పాస్‌పోర్టు ఎవరికి ఇస్తారు, ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి, ప్రజ‍్వల్‌కు ఎలా వచ్చింది అనే వివరాలు తెలుసుకుందాం.

టైప్‌ డి పాస్‌ పోర్టు..
డిప్లొమాటిక్‌ పాస్‌పోర్టును టైప్‌-డి పాస్‌పోర్టు అని కూడా అంటారు. దీనిని దౌత్యవేత్తలు, ప్రభుత్వం తరఫున అధికారిక ప్రయాణాలు చేసే ఉద్యోగులు, ప్రత్యేక వ్యక్తులకు జారీ చేస్తారు. ఇండియన్‌ ఫారిన్‌ సర్వీస్‌, కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ కింద పనిచేసే ఉద్యోగులకూ దీనిని జారీ చేస్తారు. వారి బంధువులు, కుటుంబ సభ్యులు, విద్య, వ్యాపారం, విహార యాత్రల కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటే దీనిని పొందవచ్చు. సాధారణ పాస్‌పోర్టు నీలం రంగులో ఉంటే.. డిప్లొమాటిక్‌ పాస్‌పోర్టు మెరూన్‌ కలర్‌లో ఉంటుంది. ఇక దీని చెల్లుబాటు పెద్దలకు పదేళ్లు, మైనర్లకు ఐదేళ్లు మాత్రమే ఉంటుంది. దౌత్య కార్యాకలాపాల కోసం ఇతర దేశాల్లో పర్యటించే వ్యక్తులకు ఇది అధికారిక గుర్తింపుపత్రంగా పనిచేస్తుంది.

ప్రజ్వల్‌కు రెండు పాస్‌పోర్టులు..
పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న ప్రజ్వల్ రేవణ్ణ.. సాధారణ పాస్‌పోర్టుతోపాటు, డిప్లొమోటిక్ పాస్పోర్టు కూడా తీసుకున్నాడు. నిబంధనల ప్రకారం.. దీనితో ఇతర దేశాల్లో పర్యటించాలన్నా, ప్రైవేట్ పర్యటనలు చేపట్టాలన్నా ప్రభుత్వం నుంచి ముందస్తు పొలిటికల్ క్లియరెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. ప్రజ్వల్ రేవణ్ణకు రాజకీయ క్లియరెన్స్ ఇవ్వలేదని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది.

ప్రత్యేక ప్రయోజనాలు..
ఈ పాస్‌పోర్టు కలిగిన వ్యక్తులు అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా కొన్ని ప్రత్యేక ప్రయోజనాలు, దౌత్యపరమైన రక్షణలు పొందుతారు. ఆతిథ్య దేశంలో అరెస్టులు, నిర్బంధలు, కొన్ని చట్టపరమైన చర్యల నుంచి వారిని కాపాడుతుంది. దౌత్య పాస్‌పోర్టు పొందిన వ్యక్తుల కోసం చాలా దేశాలు వీసా ప్రక్రియను వేగవంతం చేస్తాయి. వారి ప్రయాణ ఏర్పాట్లను సులభతరం చేస్తాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారత దౌత్య కార్యాలయాలు, కాన్సులేట్లు, ఇతర డిప్లొమాటిక్‌ మిషన్లు అందించే దౌత్య మార్గాలు, సేవలు పొందుతారు.

రద్దు చేయవచ్చు..
పాస్‌పోర్టు చట్టం ప్రకారం.. సెక్షన్ 6 లోని సబ్సెక్షన్ (1) నిబంధన కింద లేదా సెక్షన్ 10లోని ఏదైనా నోటిఫికేషన్ ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఆమోదంతో ఈ పాస్‌పోర్టు, ట్రావెల్ డాక్యుమెంట్లను రద్దు చేయొచ్చు. ఇది దుర్వినియోగం అయినట్లు పాస్‌పోర్టు అథారిటీ భావిస్తే స్వాధీనం చేసుకోవచ్చు. రద్దు చేసే అధికారం కూడా ఉంటుంది. తప్పుడు సమాచారంతో పొందినట్లు తేలినా రద్దు చేయవచ్చు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version