
Posts Against Jagan: సోషల్ మీడియాలో పోస్టులపై ఓ కన్నేసి ఉంచేందుకు వైసీపీ నేతలు ఒక విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు ఉన్నారు. గత నాలుగేళ్లలో ప్రభుత్వాన్ని, జగన్ ను విమర్శించిన వారిపై వేధింపులకు గురిచేస్తున్నారు, చేస్తూనే ఉన్నారు. సోషల్ మీడియాలో పోస్టులపై నియంత్రణకు చట్టాలు ఉన్నా, అవసరమైన దానికంటే వైసీపీ నేతలు స్పందించడం పరిపాటిగా మారింది. పోలీసుల సాయంతో వేధింపులకు గురిచేస్తూ స్పెషల్ ట్రీట్ మెంట్లను ఇప్పిస్తున్నారు. తాజాగా ఓ ఎన్నారైకు ఇటువంటి అనుభవమైంది. ప్రస్తుతం ఇది వైరల్ అవుతోంది.
విమర్శలను స్వతహాగా భరించని జగన్, పోలీసుల సాయంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవారిని గుర్తించి, వేళాపాళ అంటూ లేకుండా అర్థరాత్రి దొంగలమాదిరిగా పోలీసులు ఇళ్లకు చేరుకొని ఎత్తుకొనివెళ్లిన సందర్భాలు ఉన్నాయి. పోలీసు ట్రీట్మెంట్ అనంతరం కోర్టులో హాజరుపరిచేవారు. 2019లో కృష్ణాజిల్లాకు చెందిన ఇద్దరు యువకులను పోలీసులు ఇదే విధంగా వేధించారు. గుంటూరు జిల్లా తుళ్లూరు యువకుడిని కూడా పోలీసులు ఇదే తరహాలో అరెస్టు చేశారు. టీడీపీ నేతల సహకారంతోనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారంటూ ఆరోపించారు. ఐటీడీపీలో ముఖ్యుడిని అరెస్టు చేయడంతో పెద్ద దుమారమే రేగింది.
తాజాగా, కృష్ణా జిల్లాకు చెందిన ఎన్ఆర్‌ఐ కోటిరత్న అంజన్‌ను ముఖ్యమంత్రి జగన్ పై అసభ్యకర పోస్టులు పెట్టారంటూ పోలీసులు అరెస్టు చేశారు. అమెరికాలో ఎంఎస్ చదివిన ఆయన ఇటీవల ఇండియాకు వచ్చారు. గన్నవరంలోని తల్లిదండ్రుల వద్ద ఉంటున్నారు. . వైసీపీ కార్యకర్త పంజరావు నాగసూర్య ప్రశాంత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయనపై గన్నవరం పోలీసులు కేసు నమోదు చేశారు. అంజన్‌ను తెల్లవారుజామున 6 గంటలకు ఇంటికెళ్లి అదుపులోకి తీసుకున్నారు. అతని ల్యాప్ ట్యాప్, మొబైల్ ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.

ముఖ్యమంత్రి జగన్ పై పోస్టులు పెట్టడం వెనుక టీడీపీ నేతలు ఉన్నారా? అన్న కోణంలోనే ట్రీట్ మెంట్ మొత్తం నడిచిందని తెలిసింది. ఎవరి ప్రమేయం లేదని వ్యక్తిగతంగానే పోస్టులు పెట్టినట్లు అంజన్ చెప్పడంతో జడ్జి ఎదుట హాజరుపరిచారు. రిమాండ్ విధించాలని పోలీసులు కోరగా, కేవలం నోటీసు ఇస్తే సరిపోతుందని అతని న్యాయవాది చెప్పడంతో కోర్టు ఆ మేరకు పరిశీలించి రిమాండ్ విధించేందుకు నిరాకరించింది. అంజన్ ను పోలీసులు హోమో సెక్సువల్ అని రిపోర్టులు పేర్కొన్నారు. ఇది అతని వ్యక్తిగత హక్కులను హరించడం కాదా? అని అంజన్ తరుపు న్యాయవాది ప్రశ్నిస్తున్నారు.
సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెడితే ఇబ్బంది పడాల్సి వస్తుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఫేస్‌బుక్‌లో ప్రముఖ వ్యక్తులపై అసభ్యకర పోస్టింగ్‌లు, షేర్‌లు చేసి వివాదాల్లో ఇరుక్కోవద్దని విజ్ఞప్తి చేస్తున్నా, ప్రభుత్వంపై ఉన్న అసహనాన్ని యువత వెళ్లగక్కుతూనే ఉన్నారు. పోలీసుల వార్నింగ్ లను లెక్క చేయడం లేదు. ముఖ్యమంత్రి జగన్ పై పలుమార్లు యువకులు పోస్టులు పెట్టి అరెస్టు అవుతూనే ఉన్నారు. ముఖ్యమంత్రి జగన్ పై సోషల్ మీడియాలో పోస్టులు పెడితే పరిస్థితి ఇలాగే ఉంటుందని వైసీపీ నేతలు చెప్పకనే చెబుతున్నారు.