ఊసిపోయే పన్నుకు పాచే బలమంటారు. ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి కూడా అలాగే తయారయింది. మునిగిపోయే నావ మాదిరి అయిపోయింది. ఇప్పుడున్న పరిస్థితిలో పార్టని గట్టెక్కించేవాడి కోసం ఆరాటపడాల్సింది పోయి విమర్శలు చేస్తున్నారు. దీంతో కథ మొదటికి వచ్చింది. అమ్మ పెట్టదు.. అడుక్కి తిననివ్వదు అన్నట్లుగా సమర్థత కలిగిన వారిని రానివ్వరు. వారిలో సమర్థత లేదు. దీంతో పార్టీ భవిష్యత్ రసకందాయంలో పడింది. కుడిదిలో పడిన ఎలుకలాగా అయిపోయింది.
కొద్ది రోజుల కిందట కేరళ పీసీసీ అధ్యక్షుడిని నియమించారు. దీంతో తెలంగాణలో కూడా హడావిడి మొదలైంది. రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మధుయాష్కీ వంటి నేతలు ఢిల్లీ పరుగెత్తారు. అక్కడే మకాం వేసి పరిస్థితుల్ని గమనిస్తున్నారు. కొందరు హైదరాబాద్ టు ఢిల్లీ చక్కర్లు కొడుతున్నారు. పీసీసీ పదవి దక్కించుకోవాలని పావులు కదుపుతున్నారు.
అయితే అధిష్టానం మాత్రం ఇప్పటికే నివేదిక తెప్పించుకున్నట్లు తెలుస్తోంది. అందరు రేవంత్ రెడ్డి వైపు మొగ్గు చూపుతున్నాకొందరు సీనియర్లు మాత్రం ఒప్పుకోవడం లేదు.దీంతో మళ్లీ పీసీసీ కథ సుఖాంతమయ్యేలా లేదు. ఢిల్లీలో ఏం జరుగుతున్నా అధిష్టానం చూపు మాత్రం రేవంత్ రెడ్డి మీదే ఉంది ఆయనే సమర్థుడనే విషయం ఇప్పటికే వారికి తెలిసింది దీంతో పార్టీ ఇన్ చార్జి మాణిక్యం ఠాగూర్, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తదితరులు రేవంత్ రెడ్డి అభ్యర్థిత్వం వైపే ఉన్నట్లు ప్రచారం సాగుతోంది.
కానీ సీనియర్లు మాత్రం రేవంత్ రెడ్డి పేరును వ్యతిరేకిస్తున్నారు. ఆయనకు తప్పించి ఎవరికైనా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో పీసీసీ అధ్యక్ష పదవి మీద ఆలస్యమనే వేటు పడుతోంది. కర్ణాటక, పంజాబ్ తరహాలోనే తెలంగాణకు కూడా పరిశీలకుల కమిటీ నియమించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. చివరికి ప్రకటన వాయిదా వేయడం ఖాయమని తెలుస్తోంది. దీంతో కాంగ్రెస్ కేడర్ మరోసారి నిట్టూరుస్తోంది