ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం రాజకీయాలు కులం చుట్టూ తిరుగుతున్నాయి. జనసేన, వైసీపీ మధ్య నెలకొన్న మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలతో మొత్తం పరిశ్రమ ఉలిక్కిపడింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కుల పిచ్చి ఉందన్న వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో పవన్ చేసిన ప్రకంపనలు ఏపీని అతలాకుతలం చేస్తున్నాయి. నిర్మాత దిల్ రాజు కూడా రెడ్డి కావడంతో ఆయన వల్ల సమస్యలు పరిష్కారం అవుతాయోమో అనే సందేహాలు పవన్ కల్యాణ్ వ్యక్తం చేయడం అందరిలో ఆశ్చర్యం కలిగిస్తోంది.

ఈ నేపథ్యంలో సినీనటుడు, రచయిత పోసాని కృష్ణ మురళి రంగంలోకి దిగి సీఎం జగన్ కు కుల పిచ్చి లేదని సమాధానం చెప్పేందుకు ముందుకొచ్చారు. ఆయనకు కుల పిచ్చి లేదని చెప్పేందుకు వైఎస్సార్ సీపీ కూడా తెగ ప్రయత్నాలు చేస్తోంది. పవన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తోంది. ఈ నేపథ్యంలో నటులు కూడా జగన్ కు కుల పిచ్చి లేదంటూ నిరూపించేందుకు పాల్టు పడుతున్నారు.
కానీ పోసాని కృష్ణమురళి చేసిన కౌంటర్ కు విమర్శలే ఎదురవుతున్నాయి. జగన్ ప్రభుత్వంలో, మంత్రివర్గంలో, నామినేటెడ్ పోస్టుల్లో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఎంత మంది ఉన్నారనే జాబితాను ప్రకటించారు. దీంతో అటు నేతలు, ఇటు నటులు ఏం మాట్లాడలేకపోతున్నారు. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఈ లిస్ట్ వైరల్ అవుతోంది. జగన్ కు కులపిచ్చి లేదని చెబుతున్నా ఇదేంటని అందరు ప్రశ్నిస్తున్నారు.
సినిమా టికెట్ల ఆన్ లైన్ వ్యవహారంలో మొదలైన రగడ కొనసాగుతూనే ఉంది. రెండు పార్టీల్లో ప్రకంపనలు సృష్టిస్తూనే ఉంది. విమర్శలు తారాస్థాయికి చేరాయి. రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై మరొకరు ఎదురుదాడికి దిగుతున్నారు. ఇష్టమొచ్చిన రీతిలో భాషను ప్రయోగిస్తూ చులకన అవుతున్నారు. వైసీపీ నేతలైతే తమ నోటికే పని చెబుతున్నారు. దీంతో వివాదం ముదురుతోంది.