Ponnam Prabhakar Goud: మంత్రి పొన్నం సార్.. పండగ పూట భక్తుల బాధలు పట్టవా?

తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ సోమవారం తన కుటుంబ సభ్యులతో కలిసి మల్లికార్జున స్వామి దర్శనానికి వచ్చారు. స్వామి దర్శనం అనంతరం మంత్రి పొన్నం గర్భాలయానికి వెళ్లారు.

Written By: Anabothula Bhaskar, Updated On : March 25, 2024 6:31 pm

ponnam prabhakar goud was met with protest

Follow us on

Ponnam Prabhakar Goud: మిగతా రోజుల కంటే హోలీ పండుగ నాడు సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయం భక్తులతో మరింతగా కిటకిటలాడుతూ ఉంటుంది. సోమవారం హోలీ పండుగ కావడంతో అదే దృశ్యం ఆవిష్కృతమైంది. భక్తులు భారీగా తరలిరావడంతో ఆలయ ప్రాంగణం మొత్తం కిటకిటలాడింది. మరోవైపు స్వామివారి బ్రహ్మోత్సవాలు కూడా నిర్వహిస్తుండడంతో అక్కడ రద్దీ ఏర్పడింది. వాస్తవానికి ఇలాంటి సమయంలో పెద్ద పెద్ద స్థాయి వ్యక్తులు ఆలయాలకు రాకపోవడమే మంచిది. ఎందుకంటే వారు ఆలయాలకు వస్తే అధికారులు ప్రత్యేక దర్శనాలు కల్పించాల్సి ఉంటుంది. ఆ సమయంలో సామాన్య భక్తులకు ఇబ్బంది ఏర్పడుతుంది. అయితే సోమవారం నాడు భక్తులకు దర్శనం విషయంలో ఇలాంటి ఇబ్బందే ఎదురైంది.

తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ సోమవారం తన కుటుంబ సభ్యులతో కలిసి మల్లికార్జున స్వామి దర్శనానికి వచ్చారు. స్వామి దర్శనం అనంతరం మంత్రి పొన్నం గర్భాలయానికి వెళ్లారు. ఆ సమయంలో ఆలయ అధికారులు భక్తులకు సంబంధించిన దర్శనాల క్యూ లైన్ ను నిలిపివేశారు. అసలే ఎండాకాలం కావడం.. పైగా గంటల తరబడి ఎదురు చూడటంతో.. భక్తుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. పైగా మంత్రి తన కుటుంబ సభ్యులతో కలిసి మల్లన్న స్వామికి మొక్కులు చెల్లించుకునేందుకు దాదాపు గంట సమయం పట్టింది. అప్పటివరకు క్యూ లైన్ నిలిపివేయడంతో భక్తుల్లో కోపం తారాస్థాయికి చేరుకుంది. ఈ నేపథ్యంలో భక్తులు.. మినిస్టర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.

పరిస్థితి తీవ్రతను గమనించిన ఆలయ ఏఈఓ బుద్ధి శ్రీనివాస్ స్పందించారు. “అయిపోయింది.. అయిపోయింది” అంటూ భక్తులకు తన చేతులు చూపిస్తూ వారించే ప్రయత్నం చేశారు. అప్పటికీ వ్యతిరేక నినాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే వీటిని మంత్రి చెవిన పడనీయకుండా ఆలయ కమిటీ సభ్యులు కొందరు కొమురవెల్లి మల్లన్న కు జై జై అంటూ నినాదాలు చేసి కవర్ చేశారు. అయితే ఈ దృశ్యాలను కొంతమంది భక్తులు వీడియో తీసి మీడియా ప్రతినిధులకు పంపించారు. మరికొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు మంత్రి పొన్నం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గంటసేపు క్యూ లైన్ నిలిపివేస్తే ఎండాకాలంలో భక్తులు ఏం కావాలని ప్రశ్నిస్తున్నారు.