
Ponguleti Srinivas Reddy – KCR : పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని, జూపల్లి కృష్ణారావు భారత రాష్ట్ర సమితి సస్పెండ్ చేసిన నేపథ్యంలో.. సోమవారం తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్ చర్చకు దారితీసాయి. బీఆర్ఎస్ సస్పెండ్ చేసిన తర్వాత మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విలేకరుల ముందుకు వచ్చారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ను తూర్పారబట్టారు. భారత రాష్ట్ర సమితిలో తాను ఎంత ఖర్చు పెట్టింది లెక్కలతో సహా వివరించారు. అంతే కాదు చక్రాలు తిప్పాలని బయలుదేరుతున్న కేసిఆర్ కు సొంత రాష్ట్రంలోనే ఓటమిని గిఫ్టుగా ఇస్తామని పొంగులేటి చెబుతున్నారు.
“తెలంగాణ వస్తే ఆత్మగౌరవం ఉంటుందని వేదికలపై సీఎం కేసీఆర్ తీరుపై ప్రశ్నించా…వందరోజులుగా ప్రశిస్తున్నా….కానీ ఇప్పటి వరకు నాపై చర్య తీసుకోలేదు. కొత్తగూడెం ఆత్మీయసమ్మేళనంలో జూపల్లితో కలిసి సభ నిర్వహించి నిలదీసినందుకు ఇప్పుడు సస్పెండ్ చేశారా” అని పొంగులేటి ప్రశ్నించారు.” నాకు పార్టీలో సభ్యత్వం లేదు పార్టీ సభ్యుడిని కాదు, సభ్యత్వం ఉంటే చూపించండి అంటూ ఖమ్మం జిల్లా పార్టీ అధ్యక్షుడు మీడియా సమావేశంలో చెప్పారు. బీఆర్‌ఎస్‌లో సస్పెండ్ చేయడం ఉండదు, దమ్ము, ధైర్యం ఉంటే మీరే రాజీనామా చేయాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గతంలో మీడియా సమావేశంలో అన్నారు. మరి సభ్యత్వం లేదు, సస్పెండ్ లేదన్న అన్న మీరు ఎలా సస్పెండ్ చేశారని” నిలదీశారు.
“2014 ఎన్నికలకు ముందు తర్వాత ఎంపీగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌నుంచి గెలిచిన నన్ను నాతో పాటు గెలిచిన ముగ్గురు ఎమ్మెల్యేలను మంత్రులు కేటీఆర్, జగదీశ్‌రెడ్డి పార్టీలోకి రమ్మని ఆహ్వానించిన మాట నిజంకాదా?, వారితోపాటు అనేకమంది మంత్రలు పార్టీలో చేరమని ఒత్తిడిచేయలేదా? మీరే సమాధానం చెప్పాలని” పొంగులేటి పేర్కొన్నారు. “2014లో సీట్లు తక్కువగా వస్తాయని, వైఎస్‌ఆర్‌సీపీ నుంచి గెలుస్తున్న మీరు పార్టీలోకి వస్తే మంచి గుర్తింపు ఇస్తాని, తగిన సముచిత స్థానం కలిపిస్తామని, నా ఇంటికి పదేపదే తిరిగింది నిజంకాదా” అని నిలదీశారు. “2017లో కూడా పలువురు మంత్రులు, ఎంపీలు అప్పటి టీఆర్ ఎస్ లోకి రమ్మని, వత్తిడిచేశారని, పాలేరు ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ గెలవాలంటే మీరు పార్టీలోకి రావాలని, వత్తిడి తెచ్చి ఆనాడు మంత్రి కేటీఆర్ సీఎం కేసీఆర్‌కు దగ్గరకు తీసుకెళ్లారని, సముచితస్థానం ఇస్తామని బంగారు తెలంగాణ కోసం పార్టీలో చేరాలని, చెబితే నమ్మి పార్టీలో చేరాను. పాలేరులో పార్టీ విజయం కోసం కృషి చేశాను. నాతో పాటు ఉన్న ఎంపీలు విశ్వేశ్వరరెడ్డి, బూర నర్సయ్యగౌడ్ జితేందర్‌రెడ్డి తదితరులు నువ్వు కొత్త పెళ్లికొడుకువు..నీ సంబరం టీఆర్‌ఎస్‌లో కేసీఆర్ దగ్గర ఆరునెలలే ఉంటుందని, చెబితే నేను నమ్మలేదు. కానీ 5నెలలకే నాకు తెలిసిందని” పొంగులేటి వ్యాఖ్యానించారు.
“ఆనాటి టీఆర్‌ఎస్‌లో చేరేటప్పుడు వైఎస్‌ఆర్‌సీపీ పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా ఉండి నాతోపాటు జిల్లా అధ్యక్షులతోపాటు స్థానిక సంస్థల ప్రతినిధులను పార్టీలో చేర్పించింది నిజం కాదా కేసీఆర్” అంటూ ప్రశ్నించారు. “నాకొడుకు పెళ్లి కి వచ్చిన జనంలో కొందరు యుకువలు నువ్వు రాజ్యసభ కాదు జనం నుంచి గెలవాలి, సీఎం సీఎం శీనన్న జిందాబాద్ అని నినాదాలు చేస్తే ఆ వీడియోను చూపించి నన్ను రాజకీయంగా ఊచకోత, సమాధి చేసేందుకు ప్రయత్నించింది నిజం కాదా” అని నిలదీశారు.
“సింగరేణి ఎన్నికల్లో దసరా పండుగను కుటుంబసభ్యులను కూడా పక్కనపెట్టి 35రోజులు కోల్‌బెల్ట్ ప్రాంతంలో ఉండి పార్టీ అభ్యర్ధులను గెలిపించానని, అప్పుడు కేసీఆర్‌ను కలిస్తే అద్భుతంగా గెలిపించారని ఆలింగనం చేసుకుని, ప్రశంసిస్తే నేను నమ్మాను, కానీ అదినటన అని తర్వాత తెలిసిందన్నారు. పార్టీ విరాళంఎవరు ప్రకటించని విధంగా రూ.2కోట్లు ప్రకటించా, కేసీఆర్‌ను కన్నతండ్రి వలే నమ్మి పాదాలు కూడా తాకా. తండ్రిలా కుటుంబంలో ఒకడిగా చూసుకుంటాడని అనుకున్నా, బంగారు తెలంగాణ కోసం కేసీఆర్ మాటలు నమ్మా,ఆయన మాటలు మేడిపండులాంటివి, చూస్తే ఆ వెగటు ఏంటో తెలుస్తుంద”ని పొంగులేటి ధ్వజమెత్తారు. “తెలంగాణ ఉద్యమంలో ప్రొఫెసర్ కోదండరాం, ఆలే నరేంద్ర, విజయశాంతి, ప్రొఫెసర్ జయశంకర్, ఈటల రాజేందర్ వంటి వ్యూహకర్తల కష్టాన్ని వారి మేధోసంపత్తిని సైతం వాడుకుంని తర్వాత వారిని పార్టీనుంచి ఏవిధంగా పంపించారో, నమ్మించి ఎలా మోసంచేశారో వారిని చూస్తే అర్ధమవుతుందని, అదేవిధంగా ఇప్పుడు మమ్ములను కూడా మోసం చేసి పంపించారని” గుర్తుచేశారు.
ధనిక రాష్ట్రంలో రూ.4.80లక్షల కోట్ల అప్పులు ఎందుకు చేశారో….అందరికి తెలుసన్నారు. “2014 , 2018లో ఖమ్మంజిల్లాలో ఒక్కోసీటు మాత్రమే పార్టీ గెలిచింది. 2023లో పదిసీట్లలో ఒక్కసీటుకూడా గెలవనీయం, బీఆర్‌ఎస్ అభ్యర్ధులు ఎవరు అసెంబ్లీ గేట్లుదాటనీనయనని” శపధం చేశారు. “హుజురాబాద్ ఉప ఎన్నికల్లో వందలకోట్లు ఖర్చుపెట్టినా మంత్రులు , ఎమ్మెల్యేలు తిరిగినా తెలంగాణ ప్రజలు మిమ్మలను నమ్మలేదు. ప్రస్తుతం తెలంగాణలో కూడా మిమ్మలను ఎవరు నమ్మే పరిస్థితిలేదు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా మీపట్ల అసంతృప్తితో ఉన్నారు. ప్రజాశక్తిని ఏశక్తీ ఆపలేదు, ఉమ్మడి ఖమ్మంజిల్లా ప్రజలేకాదు. యావత్ తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. కొద్దిరోజుల్లోనే స్ర్కీన్‌మీద చూస్తారని” పొంగులేటి సవాల్ విసిరారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో తీవ్రమైన చర్చకు దారితీస్తున్నాయి.