Kolkata : శిక్షణలో ఉన్న వైద్యురాలి పై హత్యాచారం కేసులో సంచలనం.. నిందితుడితోపాటు అతడికి కూడా పాలిగ్రాఫ్ టెస్ట్

 కోల్ కతా లోని ఆర్జీ కార్ ఆస్పత్రిలో శిక్షణలో ఉన్న వైద్యురాలిపై జరిగిన హత్యాచారం ఘటన రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి.

Written By: Anabothula Bhaskar, Updated On : August 21, 2024 2:13 pm

Polygraph test

Follow us on

Kolkata : ఆర్జీ కార్ ఆస్పత్రిలో శిక్షణలో ఉన్న వైద్యురాలు హత్యాచారానికి గురైన విషయం తెలిసిందే. అక్కడికి కాన్ఫరెన్స్ హాల్లో ఆ వైద్యురాలి మృతదేహాన్ని సిబ్బంది గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వారు సీసీ కెమెరాలో ఉన్న దృశ్యాల ఆధారంగా మరుసటి రోజు నిందితుడిని అరెస్టు చేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సరిగ్గా పట్టించుకోకపోవడంతో కోల్ కతా హైకోర్టు స్పందించాల్సి వచ్చింది. దీంతో సిబిఐ ఈ కేసులోకి ప్రవేశించింది. ప్రస్తుతం ఈ కేసును విచారిస్తోంది. ఈ క్రమంలో దేశ సర్వోన్నత న్యాయస్థానం కూడా ఈ కేసు విషయంలో ఎంట్రీ ఇచ్చింది. సుమోటోగా స్వీకరించి మంగళవారం సుదీర్ఘ విచారణ జరిపింది. ఈ క్రమంలో ఆడపిల్లలకు భద్రత కల్పించాల్సిన బాధ్యత అందరిపై ఉందని వ్యాఖ్యానించింది. మహిళా వైద్యురాళ్లపై దాడులు జరగడం దారుణమని పేర్కొంది. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. మరోవైపు ఈ కేసులో బుధవారం చాలా కీలకమైన మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ కేసు విచారణలో సిబిఐ కీలకమైన అడుగులు వేసింది. దీంతో ఏం జరుగుతుందోననే ఆసక్తి సర్వత్రా వ్యక్తమౌతోంది.

శిక్షణలో ఉన్న వైద్యురాలిపై హత్యాచారం జరిగిన తర్వాత ఈ కేసులో నిందితుడని భావిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతడిని సిబిఐ అధికారులు విచారిస్తున్నారు. విచారణ క్రమంలో అతడు పొంతన లేని సమాధానాలు చెబుతున్న నేపథ్యంలో కోల్ కతా హైకోర్టులో సిబిఐ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. దీంతో కోర్టు నిందితుడికి పాలి గ్రాఫ్ టెస్టు చేయాలని ఆదేశాలు జారీ చేయడంతో.. సిబిఐ అధికారులు ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. మరోవైపు అర్జీ కార్ ఆస్పత్రి ప్రిన్సిపాల్ కు కూడా పాలిగ్రాఫ్ టెస్ట్ చేసేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.. ఆగస్టు 9న ఆ వైద్యురాలి మృతదేహం సెమినార్ హాల్లో లభ్యమైంది. ఆ తర్వాత రెండు రోజులకు ప్రిన్సిపాల్ ఘోష్ తన పదవికి రిజైన్ చేశారు. అప్పట్లో ఆయన వ్యవహార శైలిపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. మరోవైపు ఇప్పటికే ఆయన పలుమార్లు సిబిఐ విచారణకు హాజరయ్యారు. ఆయనను సిబిఐ అధికారులు పలు ప్రశ్నలు అడిగారు.. అయితే అధికారులు అడుగుతున్న ప్రశ్నలకు ఆయన స్పష్టంగా సమాధానం చెప్పకపోవడంతో.. అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే అతడిని మరోసారి పరీక్షించాలని భావిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే పాలి గ్రాఫ్ టెస్ట్ చేయాలనుకుంటున్నట్టు సిబిఐ అధికారులు భావిస్తున్నారు..”ఆ వైద్యురాలి మృతదేహాన్ని చూసేందుకు ఆమె తల్లిదండ్రులను మూడు గంటల పాటు ఎందుకు ఎదురు చూసేలా చేశాడనే విషయంపై ఆరా తీస్తామని.. ప్రధానంగా మాకు ఈ అంశంపైనే అనేక అనుమానాలు ఉన్నాయని” జాతీయ మీడియాతో ఓ సిబిఐ అధికారి అన్నారు.

మరోవైపు ఈ కేసులో సంజయ్ రాయ్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడే ఈ దారుణానికి పాల్పడ్డాడని పోలీసులు అనుమానిస్తున్నారు. అతడు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నియమించిన సివిల్ వలంటీర్. అతడికి ఆసుపత్రిలో అన్ని విభాగాలలోకి ప్రవేశించేందుకు అనుమతి ఉంది. అందువల్లే అతడు ఈ దారుణానికి పాల్పడ్డాడని తెలుస్తోంది. మరోవైపు అతడు కేసు విచారణలో సిబిఐ అధికారులకు సహకరించడం లేదు. అధికారులు అడిగిన ప్రశ్నలకు పొంతన లేకుండా సమాధానం చెబుతున్నాడు. ఈ క్రమంలోనే అతడికి పాలిగ్రాఫ్ టెస్ట్ చేయాలని భావిస్తున్నామని సిబిఐ అధికారులు కోల్ కతా హైకోర్టు నుంచి అనుమతి తెచ్చుకున్నారు. దీంతో ఈ కేసులో ఇద్దరికి సిబిఐ అధికారులు పాలి గ్రాఫ్ టెస్ట్ చేయనున్నారు.