Homeఆంధ్రప్రదేశ్‌AP Politics: ఏపీ రాజకీయాల్లో బూతుల పరంపర

AP Politics: ఏపీ రాజకీయాల్లో బూతుల పరంపర

AP Politics: సినిమాల్లో ఎన్నో ఆశ్లీల దృశ్యాలు కనిపిస్తుంటాయి. కానీ ఎక్కడా నేరుగా తిట్లు,బూతు మాటలు వినిపించవు. ప్రత్యామ్నాయంగా మరికొన్ని పదాలు జతచేసి వాడుతుంటారే తప్ప నేరుగా ఎక్కడా ఇవి వినిపించవు. ఒకవేళ వినోదం పేరిట పెట్టినా సెన్సార్ బోర్డు వారు వాటిని కట్ చేస్తారు.అయితే సినిమాల వరకూ సెన్సార్ బోర్డు కొంత బాధ్యత తీసుకుంటోంది. కానీ రాజకీయాల్లో అటువంటివి కుదరడం లేదు. ఇష్టారాజ్యంగా బూతులు తిట్టినా అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. ప్రధానంగా ఏపీలో ఈ సంస్కృతి పెరుగుతోంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఈ మూడేళ్లలో మంత్రుల నుంచి కిందిస్థాయి నేతల వరకూ బూతులు వల్లె వేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో ప్రస్టేషన్ లో వ్యాఖ్యానించారని అంతా భావించారు. హీరోయిజం చూపించారని అధికార పార్టీ శ్రేణులు సంబరపడ్డాయి. రానురాను బూతులు మాటలు దాటుతున్నాయి. అత్యంత జుగుప్సాకరంగా మారుతున్నాయి. .రెండు రోజుల కిందట అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు మీడియా సమావేశంలోనే అభ్యంతరక వ్యాఖ్యలు చేశారు. దారుణంగా మాట్లడారు. ఈ మాటలు విన్నవారు.. అసలు ఆయన కుటుంబసభ్యులు లేరా? తల్లిదండ్రులు లేరా? అక్క చెల్లెళ్లు లేరా? భార్య, పిల్లలు లేరా? అన్న అనుమానం వ్యక్తం చేశారు. అయితే ఆయన మాటలను చూస్తే కుటుంబసభ్యులకు సైతం అలానే అనిపిస్తుంది. రాజకీయాల కోసం అంతలా దిగజారి మాట్లాడడం అవసరమా అన్నప్రశ్న ఎదురవుతోంది.

AP Politics
Jagan- Chandrababu

అధికార మదంతోనే…
అయితే ఇంతలా బరితెగించి మాట్లాడుతున్న వారు ఒక్క క్షణం ఆలోచిస్తే మాత్రం భయంకరమైన పరిస్థితులు కనిపిస్తాయి. తామే ఇంతలా తిడుతుంటే.. ఎదుటి వ్యక్తి తమను కూడా అదే స్థాయిలో తిడతారని గుర్తిస్తే మాత్రం సిగ్గుతో తలదించుకోవాల్సి ఉంటుంది. కానీ వారి అలా ఆలోచిస్తారని భావించడం కూడా ఒక తప్పే. ఇలా మాట్లాడుతున్న వారంతా అధికార మదంతో ఉన్నవారే. వాస్తవానికి వాయిస్ ఉన్న నేతలు ఏపీలో కోకొల్లలు. అయితే వారంతా నోటికి పనిచెబితే ఏపీ బూతుల రాష్ట్రంగా మారిపోతోంది. అందుకే చాలా మంది వాయిస్ ఉన్న నేతలు జరుగుతున్న పరిణామాలు చూసి సైలెంట్ అయిపోతున్నారు. తమ గౌరవాన్ని కాపాడుకుంటున్నారు. అయితే ఇటువంటి గౌరవాలు, మంచీ చెడ్డతో పనిలేని వారు మాత్రం నోటికి పని చెబుతున్నారు. ఎంత మాట అంటే అంత మాట అనేస్తున్నారు. సెన్సార్ కు అందని మాటలను కూడా చిలకపలుకుల్లా అనేస్తున్నారు. అది శాసనాలు తయారుచేసే శాసనసభ అని చూడడం లేదు. విధానాలు వెల్లడించే మీడియా సమావేశమని భావించడం లేదు. యధాలాపంగా బూతులు, తిట్ట దండకాన్ని అందుకుంటున్నారు. దానికి ఒక విచిత్రమైన వ్యాఖ్యను జత చేస్తున్నారు. తమకు తాము ఫైర్ బ్రాండ్లగా చెప్పుకుంటున్నారు.

తిట్లు, బూతులే కొలమానం..
అయితే ఏపీలో కొంతమంది వైసీపీ నేతలే ఈ విధంగా వ్యవహరిస్తున్నారు. ఇంత బరితెగింపునకు కారణం ఏమిటో కూడా అందరికీ విదితమే. దీనికి రాజకీయ విశ్లేషణలుఅక్కర్లేదు. నిత్యం మీడియాను వాచ్ చేయడం అవసరం లేదు. గత మూడేళ్లుగా ఈ పరిణామాలు అందరికీ తేటతెల్లం. మంత్రులు అంటే తమ శాఖలోచూపిన పరిణితి కంటే.. రాజకీయ ప్రత్యర్థులపై విరుచుకుపడడమే వారి పనితీరుకు కొలమానం. అయితే మంత్రివర్గం మారిన తరువాత అధినేత ఇచ్చిన టాస్క్ పూర్తిచేయడంలో కొత్తగా చేరిన వారు ఫెయిలయ్యారన్న టాక్ వస్తోంది.నోరున్న నేతలు కరువయ్యారని.. తనతో పాటు కుటుంబసభ్యలపై వస్తున్న ఆరోపణలు తిప్పికొట్టలేకపోతున్నారని అధినేత చిన్నపాటి హింట్ ఇవ్వడమే తరువాయి.. కొందరు మాజీలు, పదవులు ఆశీస్తున్న వారు నోటికి పని చెప్పడం ప్రారంభించారు. పోటీపడుతూ మరీ తిట్ల దండకానికి దిగుతున్నారు. బూతులు మాట్లాడుతున్నారు. అయితే అధినేత జడ్జిమెంట్ బట్టివారికి త్వరలో పదవులు దక్కే అవకాశమున్నట్టు ప్రచారం జరుగుతోంది.

అధికారాల కోసమే…
అధికారం శాశ్వతం కాదు. ఈ విషయం తెలియంది కాదు. ఈ రోజు అధినేత మెచ్చారనో.. ఆయన్నుతృప్తి పరిచేందుకే దిగజారితే.. రేపు అధికారం పోతే దాని పర్యవసానాలు అనుభవించేది ఎవరో తెలుసుకోవాలి. నాడు మనల్ని రెచ్చగొట్టే నాయకుడు ఉండడు. భవిష్యత్ గురించి ఆలోచించకపోతే… రేపు భవిష్యత్ లో జరిగే పరిణామాలతో కనీసం సానుభూతి చూపేవారుండరన్న విషయం గమనించాలి. ఈ రోజు అధికారంలో ఉన్నము కాబట్టి.. అధికారంలో లేని వారిని ఇష్టారాజ్యంగా తిట్టవచ్చు. మన అధికారానికి కత్తెరపడి.. వారికి అధికారం వస్తే మన పరిస్థితి ఏమిటి? మన కుటుంబం పరిస్థి ఏమిటి? అన్న విషయాలను గుర్తెరిగితే మాత్రం ఈ బూతులు,తిట్లకు ఫుల్ స్టాప్ పడే అవకాశముంది.

వ్యూహాత్మకంగా.,..
వాస్తవానికి ఈ తిట్లు, బూతులు తిట్టించడం ఒక వ్యూహాత్మకంగా సాగుతోంది. ఏపీలో అధినేత సామాజికవర్గం వారు ఎవరూ ఇటువంటి జుగుప్సాకర విధానాలకు దిగరు. రేపు అధికారం చేతులు మారితే పరిస్థితి ఏమిటన్నది వారికి తెలుసు. అందుకే వారు సైద్ధాంతిక, రాజకీయ విభేదాలను, విధానాలను ప్రస్తావిస్తారే తప్ప తిట్లు, బూతులు వల్లించారు. అటువంటి ఏవైనా రాజకీయ ప్రత్యర్థులపై చేయాలంటే అధినేత అదే సామాజికవర్గం నేతలను, మంత్రులను రంగంలోకి దించుతారు. వారితోనే పని పూర్తిచేయిస్తారు. ఎందుకంటే ఆ సామాజికవర్గమంటే ఆయనకు పడదు. అలాగని ప్రయోగిస్తున్నావారు తమ పార్టీవారేనని ఆయన గుర్తెరగరు. రేపు బలైపోతే తమకు ఇష్టం లేని సామాజికవర్గం వారే కదా అని సరిపుచ్చకుంటారు. రేపటి మాట ఎందుకు.. ఇప్పుడు రాజకీయంగా మనకు పావుగా ఉన్నారా? లేదా? అన్నది చూసుకుంటున్నారు. గత మూడేళ్లుగా ఇదే పరిస్థతి. అంటే సామాజికవర్గంలోనే చిచ్చుపెట్టే రాజకీయ క్రీనీడ ఆడుతున్నారన్న మాట.

Jagan- Chandrababu
Jagan- Chandrababu

ఈ సంస్కృతి కొనసాగే అవకాశం..
నేడు తిట్టించుకున్న వారు రేపు కచ్చితంగా ఇదే ధోరణికి దిగుతారు. ఎందుకంటే రాజకీయాల్లో మాటకు మాట, చర్యకు ప్రతిచర్యకు దిగకపోతే చేతకాని వారుగా భావిస్తారు. ఏపీలో జరుగుతున్నది కూడా ఇదే. అందుకే అధికారం మారిన వెంటనే దీనికి ఫుల్ స్టాఫ్ పడుతుందన్నది భ్రమే. ఇవాళ తిట్టించుకున్న వారు.. రేపు తిట్టకపోతే చేతకానివారు అన్న ముద్రపడుతుందని భావిస్తారు. అందుకే దీనిని రెట్టింపు చేస్తారు. ఈ బూతుల ప్రవాహం కొనసాగుతుంది. అల్టిమేట్ గా తమ రాజకీయపబ్బం కోసం ఆడే డ్రామాలో ఏపీలో తిట్లూ, బూతులకు ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖను పెట్టినా ఆశ్చర్యపోనవసరం లేదు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version