https://oktelugu.com/

AP Politics: ఏపీలో రాజకీయ వైకుంఠపాళి

ప్రస్తుతం చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. పాత కేసులను సైతం ఎదుర్కొంటున్నారు. రాజకీయ వైకుంఠపాళీ లో దాదాపు విజయానికి అవసరమైన అన్ని మెట్లు ఎక్కారు.

Written By:
  • Dharma
  • , Updated On : September 25, 2023 2:48 pm
    ap-politics
    Follow us on

    AP Politics: రాజకీయాలు అంటే పరమపద సోపానం. అసలు సిసలైన వైకుంఠపాళి. గమ్యస్థానానికి త్వరితగతిన చేర్చే నిచ్చెనలు ఉంటాయి.పాతాళానికి చేర్చేపాములు సైతం సిద్ధంగా ఉంటాయి. అందుకే ఆచీతూచీ నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఏపీ రాజకీయాలు అసలు సిసలైన వైకుంఠపాళి ని తలపిస్తున్నాయి. కొందరు నిచ్చెన ఎక్కి పాము ముంగిట నిలిచారు. మరికొందరు పాము నోట్లో పడి.. తిరిగి నిచ్చెన ఎక్కేందుకు ప్రయత్నిస్తున్నారు.

    ప్రస్తుతం చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. పాత కేసులను సైతం ఎదుర్కొంటున్నారు. రాజకీయ వైకుంఠపాళీ లో దాదాపు విజయానికి అవసరమైన అన్ని మెట్లు ఎక్కారు. కూత వేటు దూరంలో పాము ముందు నిలబడ్డారు. సరిగ్గా ఫలితం దక్కే సమయానికి పాము నోట్లో పడి కిందకు దిగిపోయారు. ఇప్పుడు పైకి ఎక్కే ప్రయత్నం చేస్తున్నారు. దానికి జనసేన ను దన్నుగా తీసుకున్నారు. ఒక్క అవకాశంతో యధా స్థానానికి చేరుకునేలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ఏమాత్రం అజాగ్రత్తగా అడుగులు వేసినా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.

    ఇక పవన్ సైతం నిచ్చెన పట్టుకొని కోరుకున్న స్థానాన్ని దక్కించుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఆర్థిక, అంగ బలం లేకుండా వైకుంఠపాళి ఆడుతున్న పవన్ కు తెలుగుదేశం పార్టీ అనుకోని సాయాన్ని అందించింది. వారి సాయంతోనే నిచ్చెనలు ఎక్కే ప్రయత్నం చేస్తున్నారు. క్రమేపీ అడుగులు వేస్తున్నారు. తన బలానికి.. టిడిపి సాయం తోడైతే అనుకున్న స్థానానికి చేరుకోవచ్చు అని భావిస్తున్నారు. అయితే ఏమాత్రం అజాగ్రత్తగా అడుగులు వేసినా సాయం చేసే చెయ్యి పక్కకు తప్పుకునే అవకాశం ఉంది. అదే జరిగితే పాము నోట్లో పడి కిందకు పడే అవకాశాలు ఉన్నాయి. అందుకే టిడిపి అందించే సాయాన్ని మరింత బలోపేతం చేసుకొని.. అనుకున్న లక్ష్యానికి చేరువ కావాలని పవన్ ప్రయత్నిస్తున్నారు.

    అయితే ఈపాటికే నిచ్చెనలు ఎక్కి చివరి స్థానంలో జగన్ ఉన్నారు. దాన్ని స్థిరంగా కొనసాగించాలంటే ఆయన సైతం అడుగులు సక్రమంగా వేయాలి. ఏమాత్రం బ్యాలెన్స్ తప్పినా పాము నోట్లో పడి కింద పడడం ఖాయం. ఇప్పటికే తన ఎత్తులు చిత్తులతో చంద్రబాబును పాము నోట్లో పడేలా పావులు కలిపారు. నిచ్చెనలు ఎక్కకుండా ఎక్కడికక్కడే అడ్డుపడుతున్నారు. నిచ్చెనలు అందకుండా చేస్తున్నారు. ఇలా ఏపీలో వైకుంఠపాళి నడుస్తోంది. ఎవరికి వారు పాములకు దొరకకుండా.. నిచ్చెనలు ఎక్కేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే విజయం అంత సులువుగా దక్కే అవకాశాలు ఏ ఒక్కరికీ లేవు. చివరి వరకు జాగ్రత్తతో, ప్రజాభిష్టానికి తగ్గట్టు వైకుంఠపాళి ఆడితేనే విజయం దక్కే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో?