KCR: 9 ఏళ్ళూ ఇదే వ్యథ.. ఇదీ కేసీఆర్ సర్కార్ ‘ఉద్యోగ నోటిఫికేషన్ల రద్దు కథ’

సాధారణంగా ఒక నోటిఫికేషన్ ప్రకటించి.. పోస్టులు భర్తీ చేసేందుకు సంవత్సరాలు పడుతుంది. అలాంటిది 25 వేల పోస్టులను ఒకే ఏడాదిలో భర్తీ చేయాలంటే మహా యజ్ఞమే చేయాలి.

Written By: Bhaskar, Updated On : September 25, 2023 1:11 pm
Follow us on

KCR: మీరు యమలీల సినిమా చూశారా.. అందులో “నాకు ఒక బుల్లి చెల్లి. నేడే గల్లీలో పెళ్లి. జరగాలి మళ్ళీ మళ్ళీ” అని తనికెళ్ల భరణి అంటాడు.. ఆ డైలాగ్ కాస్త అటు ఇటుగా తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కు వర్తిస్తుంది. ఇది ప్రభుత్వ అజ మాయిషీలో పనిచేస్తుంది కాబట్టి.. కచ్చితంగా ఈ “ఘన కీర్తిని” ప్రభుత్వం కూడా స్వీకరించాలి. నిధులు, నీళ్లు, నియామకాల కోసం ఏర్పడిన తెలంగాణలో పైవేవీ ఆశించినంత స్థాయిలో అమలు కాలేదు.. ఇక కొలువుల భర్తీ విషయం అత్యంత దారుణంగా మారింది. తొమ్మిది సంవత్సరాలలో ఒకే ఒక్క గ్రూప్ నోటిఫికేషన్ వేసిన తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దానిని ఒక ప్రహసనంగా మార్చింది. ఏడాదిలో 80 వేల పోస్టుల భర్తీకి నిర్దేశాలు చేసినప్పటికీ.. ఒక్క నోటిఫికేషన్ పూర్తి చేసేందుకే ఏళ్లకు ఏళ్లు పడుతున్నది.

మా కొలువులు మాకే అంటూ ఉద్యమించిన రాష్ట్రంలో.. ఉద్యమ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయినా ఒకే ఒక్కసారి దాదాపు 1000 పోస్టులతో గ్రూప్ టూ మినహా 9 సంవత్సరాల పాటు ఇతర “గ్రూప్” ఉద్యోగాలు లేవు. ఉద్యోగాలు రావడం లేదని నిరుద్యోగ యువత ఆత్మహత్యలు చేసుకుంటుంటే.. వారిలో నిరాశా నిస్పృహలు పెరిగిపోతుంటే.. ఎన్నికలకు ఏడాది ముందు భారీ నోటిఫికేషన్లను ప్రభుత్వం ప్రకటించింది. వీటిలో దాదాపు 80 వేల పోస్టులను భర్తీ చేస్తామని ఘనంగా ప్రకటించింది. వీటిలో దాదాపు 25 వేల పోస్టుల భర్తీ బాధ్యతను ప్రభుత్వం తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు అప్పగించింది. వీటిని ఒక ఏడాదిలో భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది. అయితే ఇప్పుడు ఈ పోస్టుల పర్తి ప్రక్రియలో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చతికిల పడింది. గ్రూప్_1 పరీక్షలు ఏకంగా రెండుసార్లు రద్దయ్యాయి. చేస్తున్న ప్రైవేటు ఉద్యోగాలు మానుకుని, లక్షల రూపాయలు కోచింగ్ సెంటర్లకు పోసి, రేయింబవళ్లు కష్టపడి చదివిన లక్షలాది మంది నిరుద్యోగులు ఏకంగా రెండుసార్లు నష్టపోవాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్లీ గ్రూప్_1 పరీక్షలను ఎప్పుడు నిర్వహిస్తారో తెలియని అగమ్య గోచర పరిస్థితి. దీంతో చాలామంది గ్రూప్ పోస్టులపై ఆశలు కూడా వదులుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ తీరుపై నిరుద్యోగులు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తొమ్మిదేళ్లుగా మిన్నకుండి ఎన్నికల ఏడాదిలో పోస్టుల భర్తీ ప్రహసనం చేస్తున్నారని మండిపడుతున్నారు. సాధారణంగా ఎక్కడైనా ఏటా లేదా రెండు సంవత్సరాలకు ఒకసారి పోస్టుల భర్తీ ప్రక్రియ నిర్వహిస్తారని, లేదా వరుస క్రమంలో ఒకదాని తర్వాత మరొకటిగా గ్రూపు పోస్టులను భర్తీ చేస్తారని కానీ ఒకేసారి లక్ష పోస్టుల భర్తీ అంటూ ప్రహసనం చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. రాసిన పరీక్షలు వరుసగా రద్దు అవుతుండడం.. రాయాల్సిన పరీక్షలు వాయిదా పడుతుండడంతో నిరుద్యోగులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. తాజాగా గ్రూప్_1 పరీక్షలను హైకోర్టు రద్దు చేయడంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది.

సాధారణంగా ఒక నోటిఫికేషన్ ప్రకటించి.. పోస్టులు భర్తీ చేసేందుకు సంవత్సరాలు పడుతుంది. అలాంటిది 25 వేల పోస్టులను ఒకే ఏడాదిలో భర్తీ చేయాలంటే మహా యజ్ఞమే చేయాలి. మరి ఇంతటి భారీ క్రతువును నిర్వహించడానికి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను బలోపేతం చేశారంటే అదీ లేదు. కొలువులు భర్తీ చేసే టీఎస్పీఎస్సీలో కొలువులు ఖాళీగా ఉన్నాయి. కమిషన్ ఏర్పాటు అయిన సమయంలో మొత్తం 260 మంది రెగ్యులర్ సిబ్బందిని కేటాయించాలన్న ప్రతిపాదనలను ప్రభుత్వానికి సమర్పించారు. కానీ ఇందులో 120 పోస్టులను మాత్రమే మంజూరు చేశారు. ప్రస్తుతం అక్కడ పని చేస్తున్న రెగ్యులర్ సిబ్బంది కేవలం 83 మంది మాత్రమే. 23 మంది అవుట్ సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్నారు. వీరంతా కలిసి గ్రూప్ 1 నుంచి 4 వరకు పోస్టులతో పాటు ఇతర కొలువుల భర్తీ ప్రక్రియ కూడా నిర్వహించాలి. అది కూడా ఏడాదిలోనే.. కేవలం వారితోనే ఇదంతా సాధ్యమా అనే ప్రశ్న ప్రస్తుతం ఉత్పన్నమవుతోంది. నిజానికి గ్రూప్_1 పేపర్ లీకేజీ వ్యవహారం బయటపడినప్పుడే సిబ్బంది కొరత సమస్య ప్రధానంగా బయటకు వచ్చింది. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లోనే ఖాళీలను భర్తీ చేయాలనే వాదన వచ్చింది. కానీ, ప్రభుత్వం ఆ దిశగా ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. అవసరమైనప్పుడు ఇతర శాఖల నుంచి డిప్యూటేషన్ పై తీసుకోవాలనే నిర్దేశాలు తప్ప.. టీఎస్ పీఎస్సీ ని బలోపేతం చేసేందుకు ఎటువంటి చర్యలూ తీసుకోలేదు.

మరోవైపు, ఏళ్ల తరబడి ఉద్యోగాలను భర్తీ చేయకపోవడంతో అభ్యర్థులపై తీవ్ర ఒత్తిడి పడుతుంది. పైగా చాలా కాలం తర్వాత పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేయడంతో పెద్ద ఎత్తున అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇలా లక్షలాదిమందికి ఒకేసారి పరీక్షలను నిర్వహించాలన్నా.. నియామకాలకు ఇతర ఏర్పాట్లను చేయాలన్నా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతోంది. అలాకాకుండా ఎప్పటికప్పుడు కాళీ పోస్టులను పర్తి చేస్తే అక్రమాలకు తక్కువ అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఉదాహరణకు కేరళ రాష్ట్రంలో అనుసరిస్తున్న విధానాన్ని వారు వివరించారు. ఇతర రాష్ట్రాలకు భిన్నంగా కేరళలో ఉద్యోగాల భర్తీ చేపడుతున్నారు. సర్వీస్ లో ఉన్న ఒక ఉద్యోగి రిటైర్ అయ్యే రోజు నాటికే ఆ పోస్టులో మరొకరిని నియమిస్తున్నారు. దీంతో ఖాళీ పోస్టులు అనే సమస్యే ఉత్పన్నం కావడం లేదు. ఇలా పోస్టులను ఎప్పటికప్పుడు భర్తీ చేస్తుండడంతో పోటీపడే అభ్యర్థులు కూడా తక్కువగా ఉంటారు. తెలంగాణ సహా ఇతర రాష్ట్రాలలో నియామకాలను సకాలంలో చేపట్టకపోవడంతో భారీ సంఖ్యలో ఖాళీ పోస్టులు ఉంటున్నాయి. ఈ నేపథ్యంలోనే ఏటా ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ ప్రకటించాలనే డిమాండ్ ఉత్పన్నమవుతోంది. అయితే దీనిని ప్రభుత్వం పట్టించుకోకపోవడం విశేషం.