తెలుగు రాష్ట్రాల గురించి జాతీయ మీడియా కోడై కూస్తోంది. ఇక్కడ జరుగుతున్న పరిణామాల గురించి ప్రత్యేకంగా కథనం ప్రచురించింది. అయితే ఇందుకు కారణం రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అనుసరిస్తున్న విధానాలేనన్న చర్చ జరుగుతోంది. ఓ వైపు కరోనా విజృంభిస్తుంటే.. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ సమీకరణాలు సంతరించుకోవడంపై జాతీయ మీడియాలో వార్తలు రావడంపై తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే ఇంతలా ఇద్దరు ముఖ్యమంత్రుల గురించి జాతీయ స్థాయిలో చర్చించుకోవాల్సిన అవసరం ఎందుకు ఏర్పడింది..?
ఏపీ ముఖ్యమంత్రి జగన్ కరోనా విషయంలో ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నా.. మరోవైపు రాజకీయంగా కూడా తన పట్టును నిలుపుకుంటున్నాడు. ముఖ్యంగా ప్రభుత్వానికి వ్యతిరేకత రాకుండా ముందే జాగ్రత్తపడుతున్నాడు. ఇందులో భాగంగా ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబను నాయుడు కరోనా గురించి ఇటీవల చేసిన వ్యాఖ్యలపై ఆయనపై కేసులు నమోదు చేయించారు. అంతకుముందే బాబుపై రాజధాని భూముల విషయంలో కేసు నమోదైంది. మరోవైపు మాజీ ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్రను జైల్లో పెట్టించారు.
అటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈటల విషయంలో సీరియస్ గా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఆయనను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయించిన కేసీఆర్ మిగతా వారి విషయాల్లో కూడా అప్రమత్తమయ్యారు. కొందరు నేతలు నోరెత్తకుండా కేసులతో కట్టడి చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా దేవర యాంజల్ భూముల విషయాలో ఈటల పాత్ర తేల్చేందుకు ఓ కమిటీని కూడా వేశారు.
అయితే దేశంతో పాటు తెలుగు రాష్ట్రాలు కరోనాతో అల్లాడుతుంటే ఇద్దరు ముఖ్యమంత్రులు రాజకీయ పరిణామాలపై ఎక్కువగా దృష్టి పెట్టారని జాతీయ స్థాయిలో మీడియా కథనాలు ప్రచురించింది. కరోనా కట్టడి విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఎక్కువగా తమకు వ్యతిరేకంగా ఉన్నవారిపై ఫోకస్ చేశారని ఆ కథనంలో పేర్కొంది.
ఇదిలా ఉండగా ఇప్పటికే హైకోర్టు కేసీఆర్ పై కరోనా విషయంలో అక్షింతలు వేసింది. లాక్డౌన్ విషయంలో అప్రమత్తంగా లేరని ఒత్తిడి చేయడంతో పాటు ఇతర రాష్ట్రాల అంబులెన్స్ లు అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే లాక్డౌన్ విషయంలో హైకోర్టు ప్రకారం నడుచుకున్న కేసీఆర్ ఆ తరువాత ఎలాంటి చర్యలు చేపడుతారోనని అనుకుంటున్నారు. ఏదీ ఏమైనా కరోనా సమయంలో రాజకీయ కల్లోలం లాగా తెలుగు రాష్ట్రాల్లో వాడీ వేడి సంతరించుకుంది.