Telangana: తెలంగాణలో మొదటి నుంచి ముస్లిం ఓట్ల సంఖ్య చాలా ఎక్కువే. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే.. తెలంగాణలో జయాపజయాలను ప్రభావితం చేయగల శక్తి వీరికి ఉంది. అందుకే వీరి ఓట్ల చుట్టూ నిత్యం రాజకీయాలు నడుపుతుంటాయి పార్టీలు. తెలంగాణ రాకముందు హైదరాబాద్ లోని ముస్లిం ఓట్లు ఎంఐఎం బలంగా ఉన్న చోట ఆ పార్టీతో ఉన్నారు. ఎంఐఎం గెలిచే అవకాశం ఉన్న చార్మినార్ చుట్టు పక్కల నియోజకవర్గాల్లో వీరంతా ఇప్పటికీ ఆ పార్టీతోనే ఉన్నారు.
అయితే హైదరాబాద్ లోని మిగతా ఏరియాల్లో మాత్రం కాంగ్రెస్ వెంట ఉండేవారు. సెక్యులర్ పార్టీగా చెప్పుకునే కాంగ్రెస్‌కే తమ ఓట్లు గంపగుత్తగా వేసేవారు. జిల్లాల్లో పరిస్థితి కూడా ఇంతే. కానీ ఎప్పుడైతే రాష్ట్రం ఏర్పడిందో అప్పటి నుంచే వీరంతా టీఆర్ ఎస్‌వైపు మళ్లారు. నిత్యం మైనార్టీల సంక్షేమం కోసం కేసీఆర్ హామీలు ఇవ్వడం, షాదీ ముబారక్‌తో పాటు, ఎంఐఎంతో మొదట్లో పొత్తు పెట్టుకొని వారి ఓట్లను తమవైపు మలుపుకున్నారు.
ముఖ్యంగా చూసుకుంటే భాగ్యనగరంలోని చాంద్రాయణగుట్ట, బహదూర్‌పురా, యాకుత్‌పురా తో పాటు మలక్‌పేట్, చార్మినార్, నాంపల్లి, కార్వాన్ నియోజకవర్గాల్లో మైనార్టీలో ఓటు బ్యాంకు చాలా కీలకం. ఈ నియోజకవర్గాల్లో 40 శాతానికి పైగానే ముస్లిం ఓటర్లు ఉన్నారు. అలాగే అంబర్‌పేట, ఖైరతాబాద్, ముషీరాబాద్, సికింద్రాబాద్, జూబ్లీహిల్స్ లాంటి ఏరియాల్లో 25 శాతం దాకా వీరు ఉన్నారు. ఈ నియోజకవర్గాల్లో ఎవరు గెలవాలో వీరే నిర్ణయించే స్థాయిలో ఉన్నారు.
ఎందుకంటే వీరంతా ఎప్పుడూ ఒకే పార్టీవైపు ఉంటారు. హిందువుల ఓట్లలో చీలికలు ఉంటాయి. కానీ ముస్లింలు మాత్రం గంపగుత్తగా వేస్తుంటారు. అందుకే వీరి ఓట్లు ఈ నియోజకవర్గాల్లో చాలా కీలకం. ఇటు జిల్లాల్లో చూసుకున్నా కూడా.. నిజామాబాద్, మెదక్, కరీంనగర్, వరంగల్, నల్లగొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాలలో ముస్లిం ఓట్లు చాలా ఎక్కువ.
జిల్లాల విషయానికి వస్తే ముస్లింలు అంతా ఒక పార్టీ వెంబడే ఉంటారు. ప్రస్తుతం వీరంతా టీఆర్ ఎస్‌వైపు ఉన్నారు. అందుకే బీజేపీ చేస్తున్న కొన్ని ఆగడాలను నిత్యం కేసీఆర్, కేటీఆర్ ఖండిస్తుంటారు. మసీదుల వద్దకు వెళ్లి యాత్రలు చేయడాన్ని వీరు బహిరంగంగానే విమర్శించారు. అలాగే హిజాబ్, ఇతర విషయాలపై కూడా కేటీఆర్ కుండ బద్దలు కొట్టినట్టు ముస్లింలకు మద్దతు ఇస్తున్నట్టు మాట్లాడుతున్నారు.
Also Read: Bandi sanjay- Aravind: ఎమ్మెల్యే సీటుపైనే సంజయ్, అరవింద్ ఆశలు.. ఇవన్నీ అడ్డంకులే..!
పూర్తిగా హిందూత్వ ఎజెండాను కేసీఆర్ ఎన్నడూ ఎత్తుకోవట్లేదు. ఇందుకు ప్రధాన కారణం ముస్లిం ఓటర్లు దూరం కావొద్దనే. పర మతాలను గౌరవించడమే హిందువుల విధానం అంటున్నారే తప్ప.. హిందువులే ప్రధానంగా ఆయన కామెంట్లు చేయట్లేదు. అందుకే రీసెంట్ గా వచ్చిన కశ్మీర్ ఫైల్స్ మూవీపై కూడా తీవ్ర విమర్శలే చేశారు.
మైనార్టీలకు రిజర్వేషన్లు పెంచాలనే తపన కూడా ఇందులోనిదే. బీజేపీకి వీరు ఎలాగూ ఓట్లేయరు. అటు కాంగ్రెస్ ను వీరు ఇప్పట్లో నమ్మే పరిస్థితులు లేవు. ఇదే ఇప్పుడు టీఆర్ ఎస్‌కు ప్లస్ పాయింట్ అయింది. అందుకే ముస్లింల తరఫున వకాలత్ పుచ్చుకున్నట్టు బీజేపీని నిత్యం తిడుతూ వారిలో నమ్మకాన్ని పెంచుకుంటున్నారు.
అటు ఎంపీ స్థానాల విషయానికి వస్తే 4 నుంచి 5 ఎంపీ స్థానాల్లో ముస్లిం ఓట్లే ప్రభావితం చేయనున్నాయి. అందుకే ఈ స్థానాల్లో ముస్లిం ఓట్లను ప్రభావితం చేసే అంశాలపై ఫోకస్ పెడుతున్నారు కేసీఆర్. అదే సమయంలో హిందూ ఓట్లను దూరం చేసుకోవద్దని సమానత్వమే మన ఎజెండా అంటున్నారు. ఇక ఎంఐఎంతో రెండోసారి పొత్తుపెట్టుకోకపోవడానికి కూడా కారణం ఇదే.
అంటే ఒకే బాల్‌కు రెండు వికెట్లు పడగొట్టాలని టీఆర్ ఎస్ ప్లాన్ చేస్తోందన్నమాట. ఇక రాబోయే ఎన్నికల కోసం కూడా కేసీఆర్ మరో స్కీమ్‌ను తెరమీదకు తేవాలని భావిస్తున్నారంట. ఇది ముస్లిం ఓట్లను గంపగుత్తగా తమ పార్టీ ఖాతాలో వేసే విధంగా ఉంటుందని సమాచారం. మొత్తానికి ఇన్ని తంటాలు పడుతూ.. ఆ ఓటు బ్యాంకును కాపాడుకునే పనిలో పడ్డారన్నమాట కేసీఆర్.
Also Read: TSRTC MD Sajjanar: ఈసారి ఎన్టీఆర్ వీడియోను వాడేసిన సజ్జనార్.. తెగ ఖుషీ అవుతున్న ఫ్యాన్స్..