Balayya: ఏపీ రాజకీయాల్లో వెన్నుపోటు కలకలం మళ్లీ రేగింది. మాజీ సీఎం దివంగత సీనియర్ ఎన్టీఆర్‌ను ఎవరు వెన్నుపోటు పొడవలేదని ఆయన తనయుడు, ప్రముఖ సినీనటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ సర్కిల్స్‌లో ప్రజెంట్ చర్చనీయాంశమవుతున్నాయి. బాలయ్య చేసిన వ్యాఖ్యలకు అధికార వైసీపీ కౌంటర్ ఇస్తోంది. ఇంతకీ వెన్నుపోటు గురించి బాలయ్య ఏమన్నారు, వైసీపీ వాళ్లు ఏవిధంగా కౌంటర్ ఇస్తున్నారనే విషయాలపై ఫోకస్..

‘ఆహా’ ఓటీటీలో ‘అన్‌స్టాపెబుల్ విత్ ఎన్‌బీకే’షోలో బాలయ్య చేసిన వ్యాఖ్యలు ప్రజెంట్ సోషల్ మీడియాలో బాగా వైరలవుతున్నాయి. ఏపీలో ప్రతిపక్ష పార్టీగా ఉన్న టీడీపీకి చెందిన ఎమ్మెల్యే బాలయ్య చాలా కాలం కిందట టీడీపీలో జరిగిన ఓ విషయం గురించి వ్యాఖ్యానించారు. తన నాన్న సీనియర్ ఎన్టీఆర్‌ను ఎవరూ వెన్నుపోటు పొడవలేదని, ఈ విషయమై మీడియా చాలా కాలం నుంచి తప్పుడు ప్రచారం చేస్తోందని వ్యాఖ్యానించారు. దాంతో ఒకనాటి టీడీపీలోని అధికార మార్పిడి, వైస్రాయ్ ఉదంతం, నాదెండ్ల భాస్కర్ రావు గురించిన చర్చ మొదలైంది.
బాలకృష్ణ 1994లో ఆనాటి ఉమ్మడి ఏపీ సీఎం, తన తండ్రి సీనియర్ ఎన్టీఆర్ మరణం గురించి ప్రస్తావించారు. తన తండ్రి డెత్ గురించి ఏళ్లుగా తప్పుడు ప్రచారం జరుగుతుందని, ఆ విషయం తలుచుకుంటేనే తన కళ్ల వెంట కన్నీళ్లు వస్తాయని బాలయ్య ఎమోషనల్‌గా మాట్లాడారు. ఇందుకు సంబంధించిన ప్రోమో నెట్టింట వైరలవుతోంది. ‘అఖండ’ మూవీ యూనిట్ సభ్యులతో ఈ విషయాల గురించి బాలయ్య పంచుకున్నారు. తన తండ్రి వెన్నుపోటు వల్ల మరణించలేదని, తర్వాత కాలంలో జరిగిన పరిణామాలతో గుండెపోటుతో మరణించారని బాలయ్య చెప్పారు.
Also Read: ఆమెను వెలి వేద్దాం.. బ్రదర్ ఏమి చెబితే అదే మా మాట !
బాలయ్య వ్యాఖ్యలకు సంబంధించిన ప్రోమోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుండగా, వాటికి వైసీపీ వారు కౌంటర్ ఇస్తున్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎన్టీరామారావును వెన్నుపోటు పొడిచారని, అందుకు సంబంధించిన సాక్ష్యాలివిగో అంటూ సీనియర్ ఎన్టీఆర్ మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియోను జత చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. తండ్రి లాంటి తనకు నారా చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచారని స్వయంగా సీనియర్ ఎన్టీఆర్ పేర్కొన్నారని పోస్టులు పెడుతున్నారు. మొత్తంగా బాలయ్య అనవసరంగా వెన్నుపోటు వ్యాఖ్యలు చేశారని ఆ మాటలు రాజకీయంగా రచ్చ రచ్చ అవుతున్నాయని టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. వెన్నుపోటు గురించి బాలయ్య వ్యాఖ్యల వల్ల వైసీపీకే అడ్వాంటేజ్ అవుతుందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతున్నట్లు సమాచారం. బాలయ్య వ్యాఖ్యల వల్ల ఆనాటి వైస్రాయ్ ఎపిసోడ్ మళ్లీ తెరమీదకు వస్తుందని, అలా టీడీపీకి మళ్లీ తీరని నష్టం కలగొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Also Read: Katrina: కత్రినా కారు ఆపిన ట్రాఫిక్ పోలీస్.. నెట్టింట్లో వీడియో వైరల్