
YCP MLA Anil Flexi: ఏపీ పోలీసులు అధికార పార్టీ నేతలకే కాదు.. వారి ఫ్లెక్సీలకు కూడా సెక్యూరిటీ కల్పిస్తున్నారు. తాము అధికార పార్టీకి అనుకూలమని చెప్పకనే చెబుతున్నారు. నెల్లూరులో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఫ్లెక్సీకి ఏకంగా ఒక సీఐతో పాటు 15 మంది పోలీసులు సెక్యూరిటీగా నిలవడం ఏపీ పొలిటికల్ సర్కిల్ లో చర్చనీయాంశమైంది. అధికార పార్టీకి విభేదించిన ప్రజాప్రతినిధులకు సెక్యూరిటీ తగ్గిస్తుండగా.. ఇప్పుడు నేతల బొమ్మలను కంటికి రెప్పలా కాపాడుతుండడం హాట్ టాపిక్ గా మారుతోంది. పోలీస్ శాఖ తీరు నవ్వులపాలవుతోంది. పోలీస్ శాఖ అధికార పార్టీ మత్తులో కూరుకుపోయిందని మీడియా వర్గాలు కోడై కూస్తున్న వేళ నెల్లూరులో అనిల్ కుమార్ యాదవ్ ఫ్లెక్సీల చుట్టూ పోలీసులు నిల్చొని గస్తీ కాసిన దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇదండీ ఏపీ పోలీసుల వరుస అంటూ సెటైర్లు పడుతున్నాయి.
పోలీసుల అతిపై విమర్శలు..
పొలిటికల్ గా అనిల్ కుమార్ యాదవ్ కు ప్రాధాన్యత తగ్గిపోయిందన్న ప్రచారం వేళ పోలీసులు అతిచేసి ఆయనకు విశేష ప్రచారం కల్పించారు. రెండు రోజుల కిందట వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ బర్త్ డే సందర్భంగా అభిమానులు నర్తకి సెంటర్‌లో భారీ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ విగ్రహానికి ఆ కటౌట్ అడ్డుగా ఉందని.. తొలగించాలని నగరపాలక సంస్థ అధికారులను టీడీపీ నగర ఇన్ ఛార్జి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి కోరారు. అయితే ఇటీవల టీడీపీలో చేరిన కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఆదివారం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేయడానికి వచ్చారు. ఎమ్మెల్యే ఫ్లెక్సీ తొలగిస్తారమో నన్న అనుమానంతో సీఐతో పాటు 15 మంది ఫ్లెక్సీ వద్ద గస్తీ కాశారు. ఫ్లెక్సీలపై నిషేధం అంటూనే ఇలా పహారా కాయడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు నెట్టింట్లో ఇదో ప్రాధాన్యతాంశంగా మారిపోయింది. చర్చకు కారణమవుతోంది.
నెల్లూరు రాజకీయాలు అంతే…
రాష్ట్ర రాజకీయాల్లో నెల్లూరు జిల్లాకు ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడ నుంచే వైసీపీకి ధిక్కార స్వరాలు ప్రారంభమయ్యాయి. ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిల రూపంలో వైసీపీకి సవాళ్లు ఎదురయ్యాయి. అటు పార్టీలో సైతం అంతర్గత విభేదాలు నెలకొన్నాయి. మంత్రి పదవి ఊడిపోయేసరికి సొంత పార్టీలో అనిల్ కుమార్ యాదవ్ ఒంటరివాడయ్యాడు. అటు వెన్నుదన్నుగా నిలిచిన కోటంరెడ్డి దూరమయ్యేసరికి అనిల్ లో అంతర్మథనం ప్రారంభమైంది. ఈ తరుణంలో నెల్లూరు సిటీలో తన పట్టు సడలకుండా ఉండేందుకు అనిల్ తెగ ప్రయత్నిస్తున్నారు. పుట్టిన రోజు వేడుకలకు భారీగా ప్లాన్ చేశారు. ఈ క్రమంలో అభిమానులు ఏర్పాటుచేసిన భారీ ఫ్లెక్సీ వివాదానికి కారణమైంది. అటు నెల్లూరు సిటీ ప్రజలు సైతం దీనిని తప్పుపడుతున్నారు. ఇప్పుడు ఏకంగా ఫ్లెక్సీకి పోలీసు రక్షణ కల్పించడం కూడా ఇబ్బందికర పరిస్థితులు తెచ్చిపెట్టిందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ముప్పేట విమర్శలు
అయితే రాజకీయాలు శర వేగంగా మారుతున్న వేళ.. నెల్లూరులో పోలీస్ శాఖ చర్యలపై ముప్పేట విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే కోటంరెడ్డి సెక్యూరిటీని తగ్గించారు. ఉన్న ఇద్దరు సిబ్బందిని కోటంరెడ్డి ఎస్పీకి సరెండర్ చేశారు. తమకు సహకరించవద్దని జిల్లా కలెక్టర్, ఎస్పీలకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి సందేశాలు వస్తున్నాయంటూ ఆనం రామనారాయణరెడ్డి ఆరోపిస్తున్నారు. ఇటువంటి తరుణంలో పోలీస్ శాఖ అప్రమత్తంగా ఉండాల్సింది పోయి.. ‘అధికారానికి’ జీహుజూర్ అంటూ ఏకంగా నేతల ఫ్లెక్సీలకు రక్షణ కల్పించడం చూసి సామాన్య జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు. సిటీ నడిబొడ్డున ప్రజా రవాణాకు అంతరాయం కలిగించే నేత ఫ్లెక్సీకి ఈ తరహా బందోబస్తు ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. సోషల్ మీడియాలో హైప్ అవుతుండడంతో అధికార పార్టీకి ప్రతిబంధకంగా మారింది. ఎప్పుడు ప్రత్యర్థులపై నోరుపారేసుకునే అనిల్.. తన ఫ్లెక్సీతో సైతం అదే స్థాయి విమర్శను మూటగట్టుకున్నారు. కానీ ప్రభుత్వం వద్ద తన పరపతి తగ్గలేదని నిరూపించుకోవడానికే ఈ తరహా చర్యలకు పాల్పడుతున్నారని రాజకీయ ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. అయితే దీని వెనుక రాజకీయ కోణం ఉన్నా.. ప్రజాక్షేత్రంలో మాత్రం పోలీస్ శాఖ నవ్వులపాలవుతోంది. దీనిని అధిగమించకపోతే మాత్రం భవిష్యత్ లో నెల్లూరు ప్రజల నుంచి తిరుగుబాటు వ్యక్తమయ్యే చాన్స్ ఉంది.