
CP Ranganath : చాలా మంది పోలీసు వాళ్లు ఉన్నారు. కానీ కొందరే ప్రజల చేత ఈ ప్రశంసలు అందుకుంటున్నారు. ఓ సజ్జనార్ పోలీసుల్లో బాగా పేరొందాడు. అమ్మాయిలను హతమార్చిన నిందితులను ఎన్ కౌంటర్ చేసి ప్రజల్లో హీరోగా మారిపోయాడు. వరంగల్ ఘటన, దిశ ఎన్ కౌంటర్ తో సజ్జనార్ ప్రతిభ దేశవ్యాప్తమైంది. ఈయనే కాదు.. మరో పోలీస్ కమిషనర్ సైతం ఇప్పుడు ప్రజల పాలిట దేవుడిగా కీర్తించబడుతున్నాడు. పూజలు అందుకుంటున్నాడు. తాజాగా వరంగల్ రైతుల కష్టాలు తీర్చి వరంగల్ సీపీ రంగనాథ్ హీరోగా మారిపోయారు. వారి చేత క్షీరాభిషేకం చేయించుకున్నారు.
తమకు న్యాయం చేసిన వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ ఫ్లెక్సీకీ వరంగల్ జిల్లా నర్సంపేటలో రైతు నాడెం వీరస్వామి , రాజ్యలక్ష్మి దంపతులు శుక్రవారం పాలతో అభిషేకం చేశారు. ఈ సందర్భంగా రైతు వీరస్వామి, రాజ్యలక్ష్మి దంపతులు తమకు జరిగిన అన్యాయాన్నికి న్యాయం చేసిన సీపీ రంగనాథ్ కు రుణపడి ఉంటామన్ానరు..
తమకు నర్సంపేట శివారులో రెండెకరాల భూమి ఉండగా, అందులో నుంచి ఇరవై గుంటల భూమిని ఏనుగుల తండాకు చెందిన ఎస్ బీ ఐ ఉద్యోగి బానోతు అనిల్ నాయక్ భార్యకు, బానోతు సునీల్ నాయక్ కు 2018 లో అమ్మినట్లు వీరస్వామి-రాజ్యలక్ష్మి దంపతులు తెలిపారు. అప్పటి నుంచి ఎవరి హద్దుల్లో వాళ్ళమే ఉంటున్నామన్నారు. అయితే, కొద్ది కాలం నుంచి మరో పది గుంటల భూమిని అమ్మాలని అనిల్ నాయక్, సునీల్ నాయక్ తమను ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు. తమకు జీవనోపాధిగా ఉన్న భూమిని అమ్మబోమని చెప్పగా, అప్పటి నుంచి తమను అనిల్ నాయక్, సునీల్ నాయక్ మరి కొంత మందితో కలిసి బెదిరించడంతో పాటు, తమ పొలాన్ని ధ్వంసం చేశారని, హద్దు రాళ్లు తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. తామే వారిని కులం పేరుతో దూషించామని మాపై పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేశారని తెలిపారు.
అయితే, వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ గారికి తమకు జరిగిన అన్యాయం గురించి చెప్పామని వీరస్వామి, రాజ్యలక్ష్మి దంపతులు తెలిపారు. దీనిపై ఆయన విచారణ జరిపి తమను భయభ్రాంతులకు గురి చేస్తున్న వారిపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారన్నారు. దీంతో 11 మందిపై నర్సంపేట పోలీసులు కేసులు నమోదు చేశారని తెలిపారు.
భూమిని నమ్ముకొని, సాగు చేసుకొని బతికే తమకు సీ పీ రంగనాథ్ సార్ న్యాయం చేశారని, అందుకే ఆయన ఫ్లెక్సీకీ పాలతో అభిషేకం చేశామని రైతు వీరస్వామి, రాజ్యలక్ష్మి దంపతులు తెలిపారు. అలాగే, డీసీపీ కరుణాకర్ కు , పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు. ఇలా ప్రజల భూపంచాయితీల విషయంలో సివిల్ కేసు అని వేలు పెట్టని పోలీస్ అధికారులు ఉన్న ఈరోజుల్లో ఓ పేద రైతు కష్టాలు తీర్చి రంగనాథ్ నిజమైన పోలీస్ గా గొప్ప పరిపాలన దక్షుడిగా మారారు. ఆయన చేస్తున్న సేవలపై ప్రశంసలు కురుస్తున్నాయి.