
CP Ranganath Vs Bandi Sanjay: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇటీవల టెన్త్ ప్రశ్నపత్రం లీకేజీ కుట్రదారుగా సంజయ్‌ను వరంగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. తర్వాతి రోజు కోర్టు ఎనిమిదిన్నర గంటల సుదీర్ఘ వాదనల తర్వాత సంజయ్‌కు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్‌పై విడుదలైన సంజయ్ సీఎం కేసీఆర్, వరంగల్ సీపీపీ విరుచుకుపడ్డారు. టెన్త్ పేపర్ లీకేజీ మొత్తం కేసీఆర్ డ్రామాగా అభివర్ణించారు. ఇక సీపీ రంగనాథ్‌కు లీకేజీకి మాల్ ప్రాక్టిస్‌కు తేడా తెలియది విమర్శించారు. పేపర్ లీకేజీపై సీసీ ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు.
బండారం బయట పెడాతా అని..
ఇక మూడు రోజుల క్రితం మరోమారు మీడియా ముందుకు వచ్చిన బండి సంజయ్ వరంగల్ సీపీ టార్గెట్‌గా ఆరోపణలు చేశారు. ‘నీ అక్రమాల చిట్టా తీస్తున్నా.. విజయవాడ సత్యంబాబు కేసులో ఏం చేశావో, ఖమ్మంలో ఏం చేశావో, నల్లగొండలో ఏం చేశావో బయటకు తీస్తున్నా.. అక్రమాలుస్తులు అన్నీ త్వరలోనే బయట పెడతా’ అని హెచ్చరించారు. కుట్రపూరితంగానే తనపై టెన్త్ ప్రశ్నపత్రం లీకేజీ కేసు నమోదు చేశారని ఆపించారు. తన ఫోన్ కూడా వరంగల్ సీపీ వద్దనే ఉందన్నారు. తన ఫోన్ దొరికే వరకు తనను పిలవొద్దని సూచించారు. అంతకంటే ముందు సీపీ ఫోన్‌కాల్ డాటా బయట పెట్టాలని డిమాండ్ చేశారు. తన అరెస్ట్‌కు ముందు ఎవరెవరు సీపీకి ఫోన్ చేశారో వెల్లడించాలన్నారు. రెండు రోజుల ప్రెస్మీట్లో రెండు రకాలుగా మాట్లాడారని తెలిపారు. లీకేజీకి, మాల్ ప్రాక్టిస్‌కు తేడా తెలియదా అని ప్రశ్నించారు.
నవ్వాలో ఏడవాలో తెలియడం లేదు..
సంజయ్ ఆరోపణలపై వరంగల్ సీపీ రంగనాథ్ సైతం స్పందించారు. మంగళవారం సాయంత్రం మీడియా సమావేశం ఏర్పాటు చేసి బండి ఆరోపణలను తిప్పికొట్టారు. ఒక్కో ఆరోపణకు సమాధానం ఇచ్చారు. సాధారణంగా రాజకీయ నాయకులు చేసే ఆరోపణలకు పోలీస్ అధికారులు స్పందించరు. కానీ రంగనాథ్ పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు కూడా కావడంతో తనపై వచ్చిన ఆరోపణలకు తిప్పికొట్టారు. సంజయ్ చేసిన ఆరోపణలకు నవ్వాలో ఏడవాలో తెలియడం లేదన్నారు. తన బాధితులు సమావేశం అయినట్లు కూడా ఓ పత్రికలో చూశానని, తన బాధితులు ఎవరైనా ఉంటే వారు రౌడీషీటర్లు, భూకబ్జాదారులు, కరుడుగట్టిన నేరగాళ్లే అయి ఉంటారన్నారు. తన బాధితులమని సంజయ్‌ను ఎవరైనా కలిస్తే వారిలో కూడా నేరస్థులే ఉంటారని స్పష్టం చేశారు.
ఇక నిష్పక్షపాతంగా, పార్టీలకు అతీతంగా తాను విధులు నిర్వహిస్తున్నానని తెలిపారు.
ప్రమాణం చేసే ఉద్యోగంలోకి..
‘బండి సంజయ్ నాపై అనేక ఆరోపణలు చేశారు. ప్రమాణం చేయమంటున్నారు. మేం ప్రమాణం చేసిన తర్వాతే ఉద్యోగంలోకి వస్తాం. ప్రతీ కేసులో ప్రమాణం చేయాలంటే.. ఇప్పటి వరకు 10 వేల సార్లు ప్రమాణం చేయాలి. ఈ కేసులో కూడా ప్రమాణం చేయాలంటే చేస్తాం. పరీక్ష ప్రారంభమయ్యాక పేపర్ బయటికొస్తే లీకేజీ కాదు. హిందీ ప్రశ్నపత్రం మాల్ ప్రాక్టీస్ మాత్రమే.. లీకేజీ కాదు. దానికి ముందు జరిగినదంతా పరిగణనలోకి తీసుకున్నాం. హిందీ ప్రశ్నపత్రం కేసులో రాజకీయాలకు ఎక్కడా తావులేదు. పార్టీలకు అతీతంగా కేసు దర్యాప్తు చేస్తాం. దయ చేసి రాజకీయాలు అంటగట్టొద్దు. సమస్యలపై మా దగ్గరకు వచ్చేవారికి పార్టీలకు అతీతంగా న్యాయం చేస్తాం’ అని వెల్లడించారు.

ఆ ఫోన్ మా వద్ద లేదు..
‘ఇక బండి సంజయ్ ఫోన్ మా దగ్గర లేదు. నేను ఎలాంటి సెటిల్ మెంట్లు, దందాలు చేయను. దర్యాప్తు ఏజెన్సీలను బెదిరించే ప్రయత్నం మంచిది కాదు. బండి సంజయ్తోనాకు ఎలాంటి గట్టు పంచాయితీ లేదు. మా ఉద్యోగ ధర్మం మమ్మల్ని చేయనివ్వండి. సత్యంబాబు కేసులో నాపై ఆరోపణలు చేశారు. వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి. సత్యంబాబుకు జిల్లా కోర్టు జీవిత ఖైదు విధించింది. టెక్నికల్ రీజన్స్‌తో అప్పీల్లో హైకోర్టు కొట్టివేసింది. ఆ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది. సత్యంబాబు కేసు దర్యాప్తు అధికారి నేను కాదు. ఆ విషయం బండి సంజయ్ తెలుసుకోవాలి’ అని సీపీ సూచించారు. ఇక ఖమ్మం, నల్లగొండ, కొత్తగూడెంలో తాను ఏం చేశానో అక్కడి ప్రజలకు తెలుసన్నారు. ఇప్పటికీ అక్కడికి వెళితే తనను గౌరవిస్తారని చెప్పారు. తనపై చేసిన ఆరోపణలను సంజయ్ నిరూపిస్తే ఉద్యోగానికి రాజీనామా చేస్తానని సవాల్ చేశారు.
కాల్‌డేటాపై మాట్లాడని సీపీ..
అయితే సంజయ్ చేసిన ఆరోపణలపై స్పందించిన సీపీ, తనను అరెస్ట్ చేసిన రోజు సీపీకి వచ్చిన ఫోన్‌కాల్స్ బయటపెట్టాలన్న డిమాండ్‌పై మాత్రం మాట్లాడలేదు. కాల్‌డేటా బయట పెడతారో లేదో చెప్పలేదు. మొత్తంగా బండి సంజయ్ ఆరోపణలన్నీ గట్టిగా తిప్పికొట్టారు సీపీ రంగనాథ్. వరంగల్‌లో కూడా సీపీకి మంచి గుర్తింపు ఉంది. ప్రజల పక్షాల నిలుస్తారని పేరు తెచ్చుకున్నారు. మరి సీపీ కౌంటర్‌పై సంజయ్ స్పందిస్తారో లేదో చూడాలి.