Police Commemoration Day 2022: ప్రజల ధన, మాన, ప్రాణాలను, సమాజంలో శాంతి భద్రతలను కాపాడటంలో పోలీసులు పడే పాట్లు అన్ని ఇన్ని కావు. విధి నిర్వహణ వారికి ప్రతిరోజూ ఒక సవాలే. ఉగ్రవాదులు మొదలుకొని వామపక్ష తీవ్రవాదుల వరకు, బందిపోటు దొంగలు మొదలుకొని రౌడీ మూకల వరకు భిన్న, విభిన్న సంఘవిద్రోహ శక్తులతో పోరాడుతూ ప్రాణాలను ఇవ్వడం వారికి నిత్య కృత్యం అంటే అతిశయోక్తి కాదు. శాంతి భద్రతలను కాపాడేందుకు ఒకపక్క కృషి చేస్తూనే.. మరోవైపు ట్రాఫిక్ విస్ఫోటనాన్ని నివారించేందుకు ఎండ, వాన, చలిని లెక్కచేయకుండా విధి నిర్వహణ చేస్తూ.. వాహనాల నుంచి వచ్చే కార్బన్ మోనాక్సైడ్ వంటి ప్రమాదకర వాయువులను పీల్చి తీవ్రమైన ఊపిరితిత్తుల వ్యాధులకు గురవుతున్నారు. నిజానికి ప్రభుత్వ ఉద్యోగి రోజుకు 8 గంటలు మాత్రమే పని చేసేందుకు అధికారికంగా అనుమతి ఉంది. కానీ పోలీసులకు మాత్రం పని గంటలు ఉండవు. ఉదయం డ్యూటీలో చేరడం వరకే వారి చేతిలో ఉంటుంది. తర్వాత ఇంటికి వెళ్ళేది పరిస్థితులు, ఉన్నతాధికారుల ఆదేశాలను బట్టి ఉంటుంది. రాష్ట్రంలో వేలాదిమంది పోలీసులు ఉండగా.. అందులో 10 శాతం ఉన్నతాధికారులు ఉన్నారు. పోలీసులు కేవలం శాంతి భద్రతల పరిరక్షణే కాకుండా ప్రకృతి వైపరీత్యాలు సంభించినప్పుడు, కోవిడ్ వంటి మహమ్మారులు ప్రబలినప్పుడు తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. ఇక పండుగల సమయాల్లో బందోబస్తును పర్యవేక్షించే పోలీసులు.. తమ పిల్లాపాపలతో పండుగకు దూరంగా ఉంటారు.

వేలాది మంది మృతి చెందారు
శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా సంఘవిద్రోహశక్తుల చేతిలో దేశవ్యాప్తంగా వేలాది మంది పోలీసులు కన్నుమూశారు. వీరిలో తెలుగు రాష్ట్రాల పరిధిలో పదులకొద్ది పోలీసులు వీరమరణం చెందారు. అయితే గతంతో పోలిస్తే పోలీసు మరణాల సంఖ్య గణనీయంగా తగ్గింది.. శాంతి భద్రతలను కాపాడేందుకు అనుసరిస్తున్న ఎత్తుగడలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో చూపిస్తున్న చొరవ వల్ల పోలీసుల మరణాలు తగ్గాయి. ఇన్ని త్యాగాలు చేస్తున్నా, ప్రజల కోసం తమ సుఖసంతోషాలను విడిచి విధులు నిర్వహిస్తున్నా సమాజంలో పోలీసులు అంటే చిన్నచూపే ఉండటం వారిని బాధిస్తున్నది. ఇతర ప్రభుత్వ ఉద్యోగులతో పోలిస్తే పోలీసులకు శారీరక శ్రమ ఎక్కువ. బాధ్యతలు మరింత ఎక్కువ.. చివరికి ఇంట్లో అశుభం జరిగినా విధి నిర్వహణలో ఉన్న ఒత్తిడి కారణంగా వెళ్లలేని పరిస్థితి సర్వసాధారణం. ఇంత భారీ వ్యవస్థలో ఎక్కడో ఒకచోట ఒక పోలీసు చిన్న తప్పు చేస్తే దానిని పూర్తిగా పోలీసు వ్యవస్థకు ఆపాదించి యావత్ సిబ్బందిని దోషులుగా చూడడం పట్ల పోలీసులు పడే ఆవేదన అంతా ఇంతా కాదు. ఇతర రాష్ట్రాల పోలీస్ వ్యవస్థ తో పోలిస్తే రాష్ట్ర పోలీసు శాఖలో సిబ్బంది సంఖ్య కొంత తక్కువే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసు నియాకమకాలు భారీ ఎత్తున చేపట్టారు. ఆ సంవత్సరం సుమారు 37 వేల మందిని రిక్రూట్ చేసుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే అదొక పెద్ద రికార్డు. ఆ తర్వాత తెలంగాణ ఏర్పడిన అనంతరం రెండు దఫాలుగా పోలీసు నియామకాలు జరిగాయి.
పెరిగిన ఒత్తిడి
తెలంగాణ ఏర్పడిన తర్వాత పోలీసులపై ఒత్తిడి బాగా పెరిగింది. ముఖ్యంగా ఎస్ఐ నుంచి డీజీపీ దాకా పోస్టింగ్ ల వ్యవహారంలో అధికార పార్టీ నాయకుల ప్రమేయం ఎక్కువైపోయింది. ఎమ్మెల్యే సిఫారసు ఉంటే తప్ప ఒక ఎస్సై కి పోస్టింగ్ ఇచ్చే పరిస్థితి లేదు. దీనివల్ల పోలీసులు అనివార్యంగా ప్రజల్లో చులకన భావానికి గురవుతున్నారు. ఇక ఆ మధ్య సిద్దిపేటకు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో ఓ ఎస్ ఐ రివాల్వర్ తో కాల్చుకుని చనిపోవడం చర్చనీయాంశమైంది.

ఇక పోలీసులు కూడా వివిధ రకాలైన వివాదాల్లో తలదూర్చడం వల్ల ఉద్యోగాలను పోగొట్టుకున్నారు. ఒక వివాహితపై అత్యాచారం చేసిన సంఘటనలో మొన్నటికి మొన్న ఈస్ట్ మారేడ్పల్లి సీఐ ఏకంగా ఉద్యోగాన్నే కోల్పోయారు. ఇలా చెప్పుకుంటూ పోవాలి గాని కొంతమంది పోలీసులు చేస్తున్న అనైతిక కార్యకలాపాలకు అడ్డు అదుపు ఉండదు. ఎవరు ఏమనుకున్నా గాని.. పోలీసులు శాంతి భద్రతల పర్యవేక్షణలో రేయింబవళ్ళు కృషి చేస్తుంటారు కాబట్టి సమాజం ఈ మాత్రమైనా ప్రశాంతంగా ఉంది. లేకుంటే అల్లరి మూకల ఆగడాలతో చిన్నా భిన్నం అయ్యేది. అందుకే విధి నిర్వహణలో తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా త్యజించిన వారి స్మృత్యర్థం ఈ అమరవీరుల సంస్మరణ దినం నిర్వహిస్తున్నారు. కానీ స్వరాష్ట్రం ఏర్పడి 8 ఏళ్లు గడుస్తున్నా నేటికీ వీక్లీ ఆఫ్ అనేది పోలీసులకు అందని ద్రాక్ష గానే మిగిలిపోవడం మరింత బాధాకరం.