Pawan Kalyan: ‘ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉండి బూతులు మాట్లాడ్డమా? హవ్వా? రాజకీయాలెంత దిగజారిపోయాయి?’ అంటూ మూడు రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల్లో మేధావులుగా చలామణి అవుతున్న కొంత మంది బుగ్గలు నొక్కుకుంటున్నారు. రాజకీయాల్లో బూతులతో విమర్శలేంటని ప్రశ్నలు సంధిస్తున్నారు. నిజమే. రాజకీయాల్లో విధానాలపై విమర్శలుండాలి. 30 ఏళ్ల క్రితం వరకు వ్యక్తిగత విమర్శలు చేయడాన్ని కూడా తప్పు పట్టేవారు. కానీ రెండో దశ తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించిన కేసీఆర్ తన ప్రస్థానాన్ని బూతులతో నే మొదలెట్టారు. ఎడా పెడా ఆంధ్ర నాయకులనే కాకుండా, ఆంధ్ర ప్రజలను కూడా తిట్టేవాడు. కేసీఆర్ భాషలో చెప్పాలంటే అప్పుడు ఏ మేధావి, సన్నాసి కూడా నోరు మెదపలేదు. ఉమ్మడి రాష్ట్రం విడిపోయాక ఆంధ్రప్రదేశ్ లో వైసిపి కేసీఆర్ బూతుల వారసత్వాన్ని తీసుకుని మరింత పదునుగా బూతులు వాడకం మొదలెట్టింది. పవిత్రమైన అసెంబ్లీలో కూడా వీరి బూతులకు అడ్డూ, అదుపూ లేకుండా పోయింది. మహిళా సభ్యులు కూడా మగవారికి తీసిపోకుండా బూతులు తిడుతున్నారంటూ అప్పట్లో సభాపతిగా వ్యవహరించిన ఒక నేత వ్యాఖ్యానించారంటే వీరి స్థాయి ఏమిటో అర్ధం చేసుకోవచ్చు.

చెప్పుతో కొడతా అన్నాడు
సరే.. అసలు సబ్జెక్ట్ లోకి వస్తే.. ఇప్పుడు ఈ మేధావులంతా బూతుభాషపై దిగులుపడడం దేనికంటే, మొన్న గాక మొన్నజనసేనాధిపతి పవన్ కళ్యాణ్ “నన్ను వైసిపి నేతలు ఇష్టం వచ్చినట్టు దూషిస్తున్నారని, ఇక సహించనని, చెప్పుతో కొడతా కొడకల్లారా”. అని హెచ్చరించారు. దీనిపై వీరంతా ఇప్పుడే నిద్ర లేచినట్టు గగ్గోలు పెడుతున్నారు. గత మూడేళ్లుగా ఎపిలో ఎవరు ఎవరిని బండబూతులు తిడుతున్నారో తెలియదా? విపక్ష నేత చంద్రబాబు, ఆయన కుమారుడు, వారింట్లో మహిళలను, పుట్టుకలను వైసిపి ఎమ్మెల్యేలు, మంత్రులు సభ్యత మరచి అడ్డగోలుగా దూషించినప్పుడు, వారించాల్సిన ఆ పార్టీ అధినేత ఆ బూతులు విని సంతోషంతో తలపంకిస్తున్నప్పుడు ఏమైపోయారీ మేధావులు ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి, బజారు మనిషిలాగా ట్విటర్లో అసభ్యంగా రెట్టలు వేస్తున్నప్పుడు వారించాల్సిన అధినేత మౌనంగా చేతులు పిసుక్కుంటూ ఆనందిస్తున్నప్పుడు ఏమైపోయారు వీరు? ఆ పార్టీ ఎంపీ ఛండాలపు పని చేస్తూ అడ్డంగా దొరికినా అతనిపై ఎలాంటి చర్య తీసుకోకుండా, అతని చర్యని ఖండించకుండా, అతనికి మద్దతుగా ప్రకటనలు, ప్రదర్శనలు చేయించినప్పుడు నోరు మెదపని ఈ మేథావులు (ప్రస్తుతం వీరిలో ఎక్కువ మందికి మేత ఆ పొలం నుంచే వస్తుందని సమాచారం) ఇప్పుడు ఆవులించుకుంటూ ప్రవచనాలు చెప్పడాన్ని ప్రజలు గమనించకుండా ఉండరా? అసలు ఆ ఒక్కడి మెప్పు కోసమే బూతులు తిడుతున్నారని, బాగా తిట్టిన వారికి ప్రశంసలు కూడా లభిస్తున్నాయని వీరికి తెలియదా? అమరావతి పాదయాత్ర చేస్తున్న మహిళలపై మంత్రివర్గ సమావేశంలోనే ఒక మంత్రి అతి జుగుప్సాకర వ్యాఖ్య చేస్తే హాయిగా నవ్విన అధినేత సంస్కారం ఏపాటిదో వీరికి తెలియదా?

ఆ రోజులు పోయాయి
మంచిని మంచి, చెడుని చెడు అని చెప్పే రోజులు పోయి, ఆ పని చేసిన వాడిని బట్టి స్పందించడం నేటి సమాజంలో కనిపిస్తోంది. ఒక దుష్ట సంప్రదాయాన్ని మొదలుపెట్టిన వారు, తరువాత కాలంలో దానికి బలవ్వక తప్పదు. అందుకు కేసీఆరే ఉదాహరణ. గతంలో ప్రత్యర్థులని నిద్రపోనీకుండా తిట్టిన కేసీఆర్, ఆయన పరివారం ఇప్పుడు రాజకీయాల్లో సభ్యత, భాష గురించి సన్నాయి నొక్కులు నొక్కడాన్ని చూస్తున్నాం. ఇదే పరిస్థితి రేపు అధికార వైసిపికి కూడా తప్పదు. కాకపోతే ఇప్పుడు తప్పుపట్టని నోర్లు అప్పుడు మేం రెడీ అంటూ తయారవుతారని పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ తో అర్ధమవుతోంది.