Vizag Harbour Fire Accident: విశాఖ హార్బర్ లో భారీ అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి ట్విస్టులు కొనసాగుతున్నాయి. యూట్యూబర్ నాని నుంచి మొదలైన అనుమానాలు.. గంజాయి బ్యాచ్ వరకు చేరాయి.అటు తరువాత బోటు విక్రయానికి సంబంధించి వివాదాలి కారణమని వార్తలు వచ్చాయి. చివరకు మూడు రోజుల తర్వాత పోలీసులు అసలు నిందితులు ఎవరో గుర్తించి అరెస్టు చేశారు. విశాఖ హార్బర్ అగ్నిప్రమాద ఘటనపై నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్ అయ్యన్నార్ శనివారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. నిందితుల వివరాలను వెల్లడించారు.
ఈ అగ్ని ప్రమాదానికి కారకులుగా ఇద్దరిని గుర్తించారు. వాసుపల్లి నాని అలియాస్ దొంగకోళ్లు, అతని మామ అల్లిపిల్లి వెంకటేశులుగా గుర్తించినట్లు సిపి తెలిపారు. ఇద్దరూ మద్యం సేవించి సిగరెట్ తాగి నిర్లక్ష్యంగా పక్కబోటు పై విసిరేసారని.. అది బోట్ ఇంజిన్ పై పడి గాలి వల్ల మండి పెను ప్రమాదానికి కారణమైందని తెలిపారు. కాగా ఈ ఘటనలో 30 బోట్లు పూర్తిగా కాలిపోయిన సంగతి తెలిసిందే.
నిందితునిలో ఒకరి పేరు నాని కావడంతో.. యూట్యూబర్ నాని పేరు కూడా బయటకు వచ్చింది. ఇంకో వాసుపల్లి నాని అని మరో వ్యక్తిని కూడా తీసుకువచ్చి విచారించి పోలీసులు వదిలేసినట్లు తెలుస్తోంది. కాగా హార్బర్లో కనీవిని ఎరుగని రీతిలో ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. కోట్లాది రూపాయల నష్టం వాటిల్లింది. రకరకాల అనుమానాలు వెల్లువెత్తాయి. కానీ ఇది చివరకు మద్యం మత్తులో ఇద్దరు మత్స్యకారులు చేసిన పనిగా పోలీసులు తేల్చారు. కానీ మత్స్యకారులకు అంతులేని నష్టం జరిగింది. ఆ విషాదం నుంచి మత్స్యకారులు ఇంకా తేరుకోలేదు.