PM Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ చేశారు. 125వ జయంతి ఉత్సవాల సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మోడీ సీతారామరాజు సేవలను కొనియాడారు. స్వాతంత్ర్య పోరాటంలో ఆయన చూపిన తెగువ మరిచిపోలేనిది. తెల్లవారిని తరిమికొట్టిన అల్లూరి దేశం కోసం చేసిన త్యాగం ఎంతో విలువైనది. ఆయన చూపిన మార్గంలో నడిచి మనం కూడా ఆయనకు నిజమైన నివాళులు అర్పించాలని సూచించారు. అడవి పుత్రుల కోసం అల్లూరి చేసిన సాహసం ఎంతో గొప్పదని కొనియాడారు.
తెల్లవారి దురహంకారానికి చరమగీతం పాడే క్రమంలో అల్లూరి చిన్న వయసులోనే మనకు దూరం కావడం బాధాకరం. స్వాతంత్ర్య సంగ్రామంలో అల్లూరి సీతారామరాజు పోరాటం ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయమన్నారు. తెలుగు వీరలేవరా దీక్ష బూని సాగరా అంటూ తెలుగులో మాట్లాడిన ప్రధాని అందరిని ఆకట్టుకున్నారు. నిన్న హైదరాబాద్ లో మొదట తెలుగులో మాట్లాడి అందరి మన్ననలు అందుకున్నారు. అల్లూరి జయంతి సందర్బంగా ఆయన విగ్రహావిష్కరణ చేయడం మన అదృష్టమన్నారు.
అల్లూరి సీతారామరాజు ఒక వ్యక్తి కాదు సమూహ శక్తి. ఆయన చూపిన మార్గంలో మన్యం ప్రజలు నడిచి తెల్లవారికి వ్యతిరేకంగా పోరాడారు. స్వాతంత్ర్య పోరాటంలో తమదైన స్ఫర్తి కలిగించి స్వాతంత్ర్య కాంక్ష పెంచారు. ఫలితంగా తెల్లవారి కుట్రలను తిప్పి కొట్టారు. అందుకే ఆయన అందరికి ఆరాధ్యుడయ్యారు. స్వాతంత్ర్య సంగ్రామంలో 27 ఏళ్లకే అసువులు బాసిన గొప్ప వీరుడు. ఆయన ఎప్పటికి మనలోనే ఉంటారని గుర్తు చేసుకున్నారు. ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించే అవకాశం రావడం నిజంగా అదృష్టమే.
తెలుగువారిలో పోరాట స్ఫూర్తి ఎక్కువగా ఉంది. అందుకే స్వాతంత్ర్య పోరాటంలో ఉయ్యాల నర్సింహారెడ్డి, కట్ల బ్రహ్మన్న, కందుకూరి వీరేశలింగం, పొట్టి శ్రీరాములు లాంటి వారు ఎందరో పోరాటాలు చేసిన విషయాలు మనకు సుపరిచితమే. ఇంతటి మహత్తరమైన మహనీయుల పురిటిగడ్డ తెలుగు గడ్డ అని కితాబిచ్చారు. నిన్న హైదరాబాద్ లో ఇవాళ భీమవరంలో ప్రధాని మోడీ తనదైన శైలిలో ప్రసంగించి అందరిని ఆకట్టుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో తమ పార్టీ బలోపేతం కోసం చేస్తున్న ప్రయత్నంలో భాగంగానే ఇలా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.