
దేశంలో కరోనా మహమ్మారి ఎంతటి మారణహోమం సృష్టించిందో అందరికీ తెలిసిందే. అయితే.. ఇందులో మెజారిటీ పాపం కేంద్ర ప్రభుత్వానిదే అనే విమర్శలు దేశవ్యాప్తంగా వ్యక్తమయ్యాయి. చివరకు న్యాయస్థానాలు సైతం మండిపడ్డాయి. సెకండ్ వేవ్ విజృంభిస్తూ.. వేలాది మంది ప్రాణాలు బలిగొంటుంటే.. నియంత్రణ చర్యలు చేపట్టాల్సిన నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎన్నికలపై దృష్టిసారించిందని తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి.
మందుల కొరత, ఆసుపత్రుల్లో బెడ్ల కొరత, వ్యాక్సిన్ ఉత్పత్తిలో జాప్యం వంటి ఎన్నో సమస్యలతో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. చివరకు శ్మశానాల్లో కాల్చేసేందుకు శవాలకు చోటు దొరక్క.. ఉత్తరప్రదేశ్ లో గంగానదిలో మృతదేహాలను పడేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తింది. ఈ విషయంపై దేశప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ఎంతో మంది నిపుణులు నేరుగా మోడీ సర్కారును దునుమాడారు. సెకండ్ వేవ్ హెచ్చరికలు చేసినప్పటికీ.. నిర్లక్ష్యంగా వ్యవహరించారని, ఈ పాపం కేంద్రానిదేనని అన్నారు. చివరకు అంతర్జాతీయ మీడియా సైతం మోడీ సర్కారుపై దుమ్మెత్తిపోసింది.
దీంతో.. మోడీ ఇమేజ్ చాలా వరకు డ్యామేజ్ జరిగిపోయిందనే విశ్లేషణలు వచ్చాయి. అప్పటికే.. కార్పొరేట్ల సేవలో తరిస్తోందని విమర్శలు మూటగట్టుకున్న మోడీ సర్కారు.. రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చిందంటూ ఏ స్థాయిలో ఉద్యమం జరిగిందో తెలిసిందే. ఆ విధంగా.. మోడీ సర్కారు రైతు వ్యతిరేకి అని కూడా ప్రచారం చేశాయి విపక్షాలు. ఆ తర్వాత కరోనా వచ్చి పరిస్థితి మరింతగా దిగజార్చేసింది. ఇక, అంతు లేకుండా పెరుగుతున్న పెట్రోలు, గ్యాస్, నిత్యావసర ధరల గురించి అందరూ చూస్తున్నదే. దీంతో మోడీపై నమ్మకంరోజురోజుకూ సన్నగిల్లుతోందని అంటున్నారు.
ఈ నేపథ్యంలో.. పోయిన ఇమేజ్ ను మళ్లీ తెచ్చుకోవాలని చూస్తున్నారట మోడీ. ఇందుకోసం ప్లాన్ వేశారట. ఈ తప్పు కేంద్రానిది కాదని, రాష్ట్రాలదేనని జనాల్లోకి తీసుకెళ్లాలని చూస్తున్నారట. తాము రాష్ట్రాలకు చాలా డబ్బులు ఇస్తున్నామని, వాటి లెక్కలు పట్టుకొని మరీ.. ఇల్లిల్లూ తిరిగేందుకు బీజేపీ నేతలు సిద్ధమవుతున్నారట. దీంతోపాటు గరీబ్ కల్యాణ్ యోజన పథకం కింద పేదలకు ఇస్తున్న సరుకులను మోడీ ఫొటో ఉన్న సంచిలో వేసి ఇవ్వాలని నిర్ణయించుకున్నారట. ఈ విధంగా ప్రజల్లోకి వెళ్లి.. మోడీకి పాజిటివ్ ఇమేజ్ మళ్లీ పెంచాలని చూస్తున్నారట. మరి, ఇందులో నిజం ఎంత? నిజమే అయితే.. ఎంత వరకు సక్సెస్ అవుతుంది? అన్నది చూడాలి.