Homeజాతీయ వార్తలుPM Modi: అరకు కాఫీని అంతర్జాతీయం చేసిన మోడీ 'మనసులో మాట'

PM Modi: అరకు కాఫీని అంతర్జాతీయం చేసిన మోడీ ‘మనసులో మాట’

PM Modi: ముచ్చటగా మూడోసారి కేంద్రంలో కొలువుదీరింది ఎన్డీఏ ప్రభుత్వం. ప్రధాని మోదీ బాధ్యతలు స్వీకరించారు. తొలిసారిగా మన్ కీ బాత్ లో ప్రధాని మాట్లాడారు. అరకు కాఫీ పై ప్రశంసల వర్షం కురిపించారు. ‘ఆంధ్రప్రదేశ్ కు చెందిన అరకు కాఫీ చాలా ప్రత్యేకమైంది. మిత్రులారా.. భారత్లోని చాలా ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. దేశానికి చెందిన ఏదైనా స్థానిక ఉత్పత్తి ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందడం చూసినప్పుడు గర్వంగా అనిపించడం సహజం. అలాంటి ఉత్పత్తుల్లో అరకు కాఫీ కూడా ఒకటి’ అంటూ ప్రధాని మోదీ ప్రస్తావించారు. దీంతో అరకు కాఫీ ప్రత్యేకత సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజెన్లు ఎక్కువమంది ఆరా తీయడం ప్రారంభించారు. అసలు అరకు కాఫీ ప్రత్యేకత ఏంటి? అన్న వివరాలు సమగ్రంగా ఈ కథనంలో తెలుసుకుందాం.

దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాలు కాఫీని ఉత్పత్తి చేస్తున్నాయి.కానీ అందులో అరకు కాఫీ ప్రత్యేకం. సముద్ర మట్టానికి 3600 అడుగుల ఎత్తులో ఉండే విశాఖ మన్య ప్రాంతంలో గిరిజనులు ఈ కాఫీని సాగు చేస్తున్నారు. సుమారు లక్ష ఎకరాల్లో కాఫీ తోటలు సాగుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అత్యంత నాణ్యమైన కాఫీ గింజలు ఇక్కడే ఉత్పత్తి అవుతాయి. పూర్తి సేంద్రీయ పద్ధతుల్లో పండించడంతో కాఫీ ఎంతగానో రుచిగా ఉంటుంది. కాఫీ ప్రియులకు ఇట్టే ఆకట్టుకుంటుంది. ఇక్కడ పండించే కాఫీ పంటకు డిమాండ్ ఎక్కువ. అనతి కాలంలోనే జాతీయ అంతర్జాతీయ స్థాయిలో బ్రాండ్ ఇమేజ్ సొంతం చేసుకుంది అరకు కాఫీ.ఇక్కడ పండించే కాఫీ గింజలను ప్రైవేటు వ్యాపారులతో పాటు గిరిజన సహకార సంస్థ జిసిసి సేకరిస్తుంది. అందులో కొంత ఈ వేలం ద్వారా అమ్మకాలు చేస్తూ.. మరికొంత అరకు వ్యాలీ కాఫీ పేరుతో మార్కెటింగ్ చేస్తోంది. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అరకు కాఫీకి బ్రాండ్ ఇమేజ్ ఉన్నా.. స్థానికంగా ఆ ఇమేజ్ ను జిసిసి కొనసాగించ లేకపోతోంది.

అరకు కాఫీ రుచి చూసిన వారికి ఎంతో మాధుర్యం లభిస్తుంది. అంత రుచిగా ఉంటుంది ఈ తేనీరు. ఆనంద్ మహీంద్రా లాంటి పారిశ్రామికవేత్తలు ట్విట్టర్ వేదికగా అరకు కాఫీ మాధుర్యాన్ని వర్ణించిన సందర్భాలు ఉన్నాయి. ఎన్నో స్వచ్ఛంద సంస్థలు కాఫీ గింజల సేకరణ, ఉత్పత్తిలో తీసుకోవాల్సిన అంశాలపై గిరిజనులకు శిక్షణ ఇచ్చాయి. జాతీయంగా, అంతర్జాతీయంగా అరకు కాఫీ ప్రాచుర్యం పొందడంతో.. గిరిజనుల జీవనోపాధి మెరుగుపడుతూ వస్తోంది. జిసిసి కూడా గిరిజనుల నుంచి కాఫీ గింజలను కొనుగోలు చేసి ఆకర్షణీయమైన ప్యాకింగ్ లో కాఫీని మార్కెట్ చేస్తోంది. జిసిసి ఫ్రాంచైజీలు తీసుకొని అరకు కాఫీ పేరుతో షాపులు పెట్టడానికి చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. ఏపీవ్యాప్తంగా జిసిసి అవుట్ లెట్లు ఉన్నాయి. వీటిలో ఎక్కువ కాఫీ కే డిమాండ్ ఉంది. కానీ జీసీసీ మాత్రం అరకు కాఫీని సరైన దిశగా మార్కెట్ చేయలేకపోతోంది. గతంలో కార్పొరేట్ కంపెనీలకు దీటుగా అరకు కాపీని కూడా ఇన్ స్టంట్ ప్యాకెట్ల రూపంలో తీసుకొచ్చారు. కానీ కొద్ది రోజుల తరువాత వాటిని నిలిపివేశారు. దీంతో అమ్మకాలపై అవి ప్రభావం చూపాయి.

అయితే ఇప్పుడు ప్రధాని మోదీ నోటి నుంచి అరకు కాఫీ మాట రావడం విశేషం. 2016లో సీఎం చంద్రబాబు తో కలిసి విశాఖలో అరకు కాఫీ తాగిన ఫోటోను షేర్ చేశారు ప్రధాని. దీనిపై చంద్రబాబు సైతం తాజాగా స్పందించారు. మరోసారి మీతో కలిసి కాఫీ తాగడానికి ఎదురుచూస్తున్నానని మోడీకి రిప్లై ఇచ్చారు. దీంతో అరకు కాఫీ అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నడుము బిగిస్తాయని గిరిజనులు ఆశ పెట్టుకున్నారు. ఏకంగా ప్రధాని నోటి నుంచి అరకు కాఫీ మాట రావడంతో ఉబ్బి తబ్బిబ్బవుతున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular