మూలిగే నక్కపై తాటి పండు పడిన చందంగా మారింది ఆంధ్రప్రదేశ్ పరిస్థితి. ఓ పక్క ఆర్థిక ఇబ్బందులతో కుదేలవుతున్న రాష్ర్టం కేంద్రం విధించిన షరతులతో తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే ప్రధాని మోడీ అన్ని స్టేట్ల సీఎంలతో మాట్లాడి కేంద్రం ఇచ్చే నిధులు పక్కదారి పట్టకుండా చూడాల్సిన బాధ్యత మీదేనని స్పష్టం చేశారు. దీంతో ఏపీ లాంటి స్టేట్ కు ఇబ్బందులు తప్పకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. తక్షణ తరుణోపాయం సైతం ఏపీకి కనిపించడం లేదు. కేంద్రం విధించిన షరతులను పాటించడం ఒకటే కనిపిస్తోంది.
కేంద్రం ఇస్తున్న నిధులు స్టేట్లు కొన్ని పథకాలకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. కానీ పలు స్టేట్లు మాత్రం ఆ నిధులతో ఇతర పనులు చేస్తున్నాయి. దీంతో కేంద్రానికి రావాల్సిన పేరు రావడం లేదు. దీంతో ప్రధాని మోడీ దీనిపై ప్రత్యేక దృష్టి సారించి స్టేట్లు తాము ఇస్తున్న నిధులు పక్కదారి పట్టించకుండా సూచించిన వాటికే ఖర్చు చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఈ నిబంధనలు ఎవరు అతిక్రమించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. దీంతో పలు స్టేట్ల పరిస్థితి అధ్వానంగా మారింది. ముఖ్యంగా అప్పుల్లో చిక్కుకున్న ఏపీ లాంటి స్టేట్ కు ఆశనిపాతంగా ఉంది.
ప్రధాని మోడీ ఏపీతో సహా 20 స్టేట్లకు లేఖలు రాశారు. నిధులు సక్రమంగా ఖర్చు చేసేందుకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో 25 శాతం నిధుల్ని స్టేట్లకు కేంద్రం ఇస్తుంది. దీంతో ప్రస్తుతం స్టేట్లకు ఇబ్బందిగా మారిందని పలువురు చెబుతున్నారు. రాష్ర్టం తన వాటా నిధులను కూడా జత చేసి అందులో 75 శాతం ఖర్చు చేసిందని నిర్ధారించుకున్న తరువాతే మిగిలిన నిధులు కేంద్రం విడుదల చేస్తుంది.
కేంద్రం ఇస్తున్న నిధుల్ని ఇతర పథకాలకు మళ్లిస్తున్న స్టేట్లలో ఏపీ కూడా ఒకటి. ఈ నేపథ్యంలో కేంద్రం తీసుకున్న నిర్ణయంతో రాష్ర్టం అధోగతి పాలవుతుందని తెలుస్తోంది. ఇన్నాళ్లు కేంద్రం ఇచ్చిన నిధుల్ని సైతం తమ పథకాలకు వాడుకుని లబ్ధిపొందిన రాష్ర్టం ఇప్పుడు ఏం చేయాలో తోచని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. కేంద్రం విధించిన షరతుకు ఓకే అనలేక నో చెప్పలేక కుడితిలో పడ్డ ఎలుక చందంగా మారింది జగన్ పరిస్థితి అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.