గత ఏడాది నరేంద్ర మోదీ మంత్రివర్గంలో హోమ్ మంత్రిగా చేరినప్పటి నుండి అమిత్ షా దూకుడుకు అడ్డు లేకూండా పోతున్నది. ముఖ్యమైన ఆర్టికల్ 370 రద్దు, పౌరసత్వ సవరణ చట్టం వంటి వాటిని కనీసం పార్టీలో, మంత్రివర్గంలో తగు చర్చలు లేకుండా; తగిన సన్నాహాలు కూడా లేకుండా ఏకపక్షంగా తీసుకు వచ్చి కాబోయే ప్రధాని తానే అన్న సందేశాన్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తూ వస్తున్నాడు.
అయితే ఢిల్లీ అల్లర్లు, ప్రస్తుతం కరోనా వైరస్ విజృంభణకు మూలమైన నిజాముద్దీన్‌లోని తబ్లిగీ జమాత్ సుమారు 2,000 మంది విదేశీయులతో పాటు వేలాది మంది వివిధ రాష్ట్రాల నుండి వచ్చి గుమికూడిన గుర్తించలేక పోవడం అమిత్ షా వైఫల్యంగా అందరూ భావిస్తున్నారు. అప్పటి నుండి అమిత్ షా దూకుడుకు ప్రధాని చెక్ పెట్టిన్నట్టు భావిస్తున్నారు.
మొన్నటి వరకు కేంద్ర ప్రభుత్వంలో ఏది జరిగినా అమిత్ షా ముందుండే వారు. కానీ ఇప్పడు కరొనపై పోరులో స్వయంగా ప్రధాని మోదీ ముందుండి నడిపిస్తున్నారు. ఆయన ఈ సందర్భంగా ముగ్గురు మంత్రులను మాత్రమే విశ్వాసంలోకి తీసుకొన్నట్లు తెలుస్తున్నది. వారు ఆరోగ్య మంత్రి హర్ష వర్ధన్, విదేశాంగ మంత్రి జయశంకర్, పౌరవిమానయాన మంత్రి హర్ డీప్ సింగ్ పూరిలు కీలక పాత్ర వహిస్తూ వచ్చారు.
మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం పడగొట్టడం అంతా అమిత్ షా దర్శకత్వంలో జరిగిన్నట్లు ప్రచారం జరిగినా తెర వెనుక నడిపించింది ప్రధానియే అని తెలుస్తున్నది. ఇటువంటి పరిస్థితులలో ప్రభుత్వంలో ఇంకా తన పట్టు తగ్గలేదని సందేశం ఇవ్వడం కోసం దేశం అంతా కరొనపై పోరులో నిమగ్నమై ఉన్న సమయంలో గుట్టుచప్పుడు కాకుండా జమ్మూ-కశ్మీరు కేంద్ర పాలిత ప్రాంతం శాశ్వత నివాసుల నిబంధనలను అమిత్ షా ప్రకటించారు.
ఈ ప్రకటనను స్వయంగా జమ్మూ బీజేపీ తప్పుబట్టడం అంటే ఒక విధంగా అమిత్ షా ఆధిపత్యాన్ని ప్రశ్నించడమే అనే అభిప్రాయం కలుగుతున్నది. ప్రధాని నుండి సానుకూల సంకేతం లేకుండా ఆ విధంగా బహిరంగంగా నిరసన తెలిపే అవకాశం లేదని స్పష్టం అవుతున్నది.
శాశ్వత నివాసులుగా ప్రకటించే విధానం బలహీనంగా ఉందని, క్రింది స్థాయి ఉద్యోగాలు మాత్రమే స్థానికులుగా రిజర్వు చేయడానికి వీలు కల్పిస్తోందని అంటూ జమ్మూ బిజెపి అమిత్ షా కు స్పష్టం చేసింది. తాజా నోటిఫికేషన్ ప్రకారం స్థానికులకు కేవలం గ్రూప్-డి ఉద్యోగాలు మాత్రమే రిజర్వు చేయడానికి వీలవుతుందని ఎద్దేవా చేశారు.
పైగా, జమ్మూ బీజేపీ ఆందోళన పట్ల జమ్మూ-కశ్మీరు వ్యవహారాలను సుదీర్ఘ కాలం నుంచి పర్యవేక్షిస్తున్న బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ సహితం సానుభూతి ప్రకటించారు. ముఖ్యంగా స్థానిక ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు సంబంధించిన ఆందోళన ఉందని, వారి భయాలకు కొంత వరకు విలువ ఉందని స్పష్టం చేశారు.