
ఏపీలో వైసీపీ, టీడీపీ అంటే ఉప్పునిప్పుగానే ఉంటాయి. ఇక రాజకీయంగా పగ ప్రతీకారాలు కామన్. ఏపీ సీఎం వైఎస్ జగన్ పై ఇన్నాళ్లు విమర్శలు చేసిన ఓ టీడీపీ ఎంపీ.. ఆశ్చర్యకరంగా జగన్ సాయం కోరారు. ‘ప్లీజ్ ఈ పనులు చేసి పెట్టండని’ విన్నవించారు. కొద్దిరోజులుగా చంద్రబాబుకు, టీడీపీకి దూరంగా ఉంటున్న ఆయన జగన్ కు ఈ అరుదైన రిక్వెస్ట్ పెట్టడం చర్చనీయాంశమైంది.
సోషల్ మీడియా అయినా.. బహిరంగంగా అయినా ఏపీలోని వైసీపీ ప్రభుత్వంపై ఎప్పుడూ విమర్శలు చేసే విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని ఆశ్చర్యకరంగా బుధవారం సీఎం వైఎస్ జగన్ కు ఓ ప్రత్యేక అభ్యర్థన పెట్టుకున్నాడు. ప్రతిరోజూ ప్రయాణికులు నరకం అనుభవిస్తున్నారు. విజయవాడలోని సివిఆర్ ఫ్లైఓవర్ మరమ్మతులు చేయించాలని ఆయన ట్విట్టర్ ద్వారా ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. తన అభ్యర్థనకు మద్దతుగా ఆయన మీడియా నివేదికను జత చేశారు.
“ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ గారు .. దయచేసి ఈ ఫ్లైఓవర్ మరమ్మతులు చేయగలరా? విజయవాడ ప్రజలు మీకు రుణపడి ఉంటారు ”అని నాని సవినయంగా ట్వీట్ చేస్తూ ముఖ్యమంత్రిని, సిఎంఓను కూడా తన ట్వీట్ కు ట్యాగ్ చేయడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది.
విజయవాడలోని సివిఆర్ ఫ్లైఓవర్ పెద్ద గుంతలను పడి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ దారి జాతీయ రహదారులను లోపలి రింగ్ రోడ్డుతో కలుపుతుంది కాబట్టి, చాలా బస్సులు మరియు ప్రైవేట్ వాహనాలు ఈ ఫ్లైఓవర్ గుండా వెళతాయి. దీనిని రాష్ట్ర రహదారులు మరియు భవనాల విభాగం మరియు కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ సంయుక్తంగా నిర్మించాయి, కాని దీనిని విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ నిర్వహిస్తోంది. ఈ మూడు సంస్థలలో సమన్వయం లేకపోవడం వల్ల మరమ్మతులు జరగడం లేదని నాని వివరించారు.
మరి పగోడు.. ప్రత్యర్థి చేసిన ఈ విన్నపాన్ని సీఎం జగన్ ఆలకిస్తాడా? నెరవేరుస్తాడా అన్నది వేచిచూడాలి.