దేశంలో ఫోన్ ట్యాపింగ్ కలకలం.. వాళ్లే టార్గెట్!

దేశంలో మ‌ళ్లీ ఫోన్ ట్యాపింగ్ క‌ల‌క‌లం రేగింది. ప్ర‌తిప‌క్ష నేత‌లు, జ‌ర్న‌లిస్టులు, సుప్రీం కోర్టు జ‌డ్జీల ఫోన్లు కూడా హ్యాక్ చేశార‌నే వార్త సంచ‌ల‌నంగా మారింది. ఇజ్రాయెల్ లోని ఎస్ ఎస్ వో గ్రూప్ కంపెనీకి చెందిన ‘పెగాస‌స్‌’ అనే స్పై వేర్ సాయంతో.. ఈ ట్యాపింగ్ నిర్వ‌హించిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. ‘ది వైర్‌’ అనే వార్తా సంస్థ ఈ మేర‌కు ఓ సంచ‌ల‌న క‌థ‌నం ప్ర‌చురించింది. అయితే.. ఇలాంటి స్పై వేర్ ప్ర‌భుత్వాల వ‌ద్ద మాత్ర‌మే […]

Written By: Bhaskar, Updated On : July 19, 2021 12:01 pm
Follow us on

దేశంలో మ‌ళ్లీ ఫోన్ ట్యాపింగ్ క‌ల‌క‌లం రేగింది. ప్ర‌తిప‌క్ష నేత‌లు, జ‌ర్న‌లిస్టులు, సుప్రీం కోర్టు జ‌డ్జీల ఫోన్లు కూడా హ్యాక్ చేశార‌నే వార్త సంచ‌ల‌నంగా మారింది. ఇజ్రాయెల్ లోని ఎస్ ఎస్ వో గ్రూప్ కంపెనీకి చెందిన ‘పెగాస‌స్‌’ అనే స్పై వేర్ సాయంతో.. ఈ ట్యాపింగ్ నిర్వ‌హించిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. ‘ది వైర్‌’ అనే వార్తా సంస్థ ఈ మేర‌కు ఓ సంచ‌ల‌న క‌థ‌నం ప్ర‌చురించింది. అయితే.. ఇలాంటి స్పై వేర్ ప్ర‌భుత్వాల వ‌ద్ద మాత్ర‌మే ఉంటుంది. నిఘా కార్య‌క‌లాపాల‌కోసం ప్ర‌భుత్వ సంస్థ‌లు వినియోగిస్తుంటాయి. దీంతో.. ఈ తాజా హ్యాకింగ్ వెన‌క ప్ర‌భుత్వ పాత్ర ఉంద‌నే అనుమానాలు వ్య‌క‌మ‌వుతున్నాయి. అయితే.. కేంద్రం మాత్రం త‌మ‌కేమీ తెలియ‌ద‌ని ప్ర‌క‌టించింది.

ఈ వ్య‌వ‌హారానికి సంబంధించి బీజేపీ నేత‌, రాజ్య‌స‌భ స‌భ్యుడు సుబ్ర‌హ‌ణ్య స్వామి చేసిన ట్వీట్ క‌ల‌క‌లం రేపింది. ‘‘వాషింగ్టన్ పోస్టు, లండన్ కు చెందిన గార్డియన్ పత్రికలు ఓ ఆసక్తికర విషయాన్ని ప్ర‌చురించాయి. పెగాస‌స్ ద్వారా కొంద‌రు కేంద్ర మంత్రులు, ఆర్ఎస్ఎస్ నేత‌లు, సుప్రీం న్యాయ‌మూర్తులు, జ‌ర్న‌లిస్టుల ఫోన్ల‌ను ట్యాప్ చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వాస్త‌వాల‌ను నిర్ధారించుకున్న త‌ర్వాత‌.. ఎవెవ‌రి ఫోన్లు ట్యాప్ అయ్యాయో జాబితా వెల్ల‌డిస్తా’’ అని ట్వీట్ చేశారు. దీంతో.. ఈ విష‌యం హాట్ టాపిక్ గా మారింది. 2019లో వెలుగు చూసిన ఈ అంశం.. మ‌రోసారి తెర‌పైకి వ‌చ్చింది.

ఈ విష‌య‌మై విప‌క్ష నేత‌లు తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. తృణ‌మూల్ ఎంపీ ఓబ్రియెన్‌, కార్తీ చిదంబ‌రం దీనిపై స్పందించారు. అదేవిధంగా.. ప్ర‌ముఖ జ‌ర్న‌లిస్టు షీలా భ‌ట్ ‘ఇదో పెద్ద క‌థ‌’ అంటూ ట్వీట్ చేశారు. పెగాసస్ లో భారత్ తోపాటు మీడియా సంస్థల పాత్ర కూడా ఉందని పేర్కొనడం గమనార్హం. రెండేళ్ల క్రితం వెలుగు చూసిన ఈ వ్యవహారంలో.. ప్రపంచ వ్యాప్తంగా 1400 మంది ఫోన్లను ట్యాప్ చేసినట్టు చర్చ జరిగింది. అప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం దీన్ని కొట్టిపారేసింది. ఇప్పుడు మళ్లీ వార్తల్లోకి రావడం గమనార్హం.

ఇజ్రాయెల్ కు చెందిన ఈ స్పైవేర్ టూల్ అనేది చాలా ప్ర‌మాద‌క‌ర‌మైన‌ది. దీని ద్వారా ఫోన్లు ట్యాప్ చేసేందుకు ఒక లింక్ మెసేజ్ రూపంలో పంపిస్తారు. అది ఓపెన్ చేస్తే ఖ‌త‌మే. ఫోన్ లో ఈ మాల్ వేర్ ఇన్స్టాల్ అయిపోతుంది. ఆ త‌ర్వాత ఫోను మొత్తం హ్యాక‌ర్ చేతిలోకి వెళ్లిపోతుంది. అప్ప‌టి నుంచి ఫోన్లో ఉన్న స‌మాచారం మొత్తం హ్యాక‌ర్ సేక‌రిస్తుంటాడు. ఇందులో కాంటాక్ట్ లిస్టు మొద‌లు ప్ర‌తీ డేటాతోపాటు చివ‌ర‌కు ఫోన్ కాల్స్ కూడా అవ‌త‌లి వ్య‌క్తి వింటాడు. అయితే.. ఇప్పుడు లేటెస్ట్ వ‌ర్ష‌న్ ప్ర‌కారం.. కేవ‌లం ఒక వీడియో మిస్డ్ కాల్ ఇచ్చి కూడా ఫోన్ హ్యాక్ చేస్తుంద‌ట‌.