Perni Nani: తానొకటి తలిస్తే దైవమొకటి తలిచాడు అన్న చందంగా తయారైంది తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పరిస్థితి. తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతోంది, బ్రహ్మాండంగా పాలన సాగిపోతోంది అని గొప్పలు చెప్పుకునేందుకు పోయి తిప్పలు తెచ్చుకున్నట్టైంది సీఎం కేసీఆర్ పరిస్థితి. ఇటీవల హైదరాబాద్ లో నిర్వహించిన ప్లీనరీ సమావేశాల్లో ఆయన చేసిన వ్యాఖ్యలు రెండు రాష్ట్రాల్లో చర్చనీయాంశం అయ్యాయి. అది ప్రత్యేక్షంగా టీఆర్ ఎస్‌కు ఇబ్బంది తీసుకొస్తే పరోక్షంగా వైఎస్ఆర్ టీపీని ఇరకాటంలో పెట్టాయి.

సీఎం కేసీఆర్ ఏమన్నారు ?
టీఆర్ ఎస్ ప్లీనరీ సందర్భంగా సీఎం కేసీఆర్ వేదికపై నుంచి మాట్లాడారు. తెలంగాణలో సంక్షేమ పథకాలు చూసి మహారాష్ట్రలోని నాందేడ్ వాసులు, చత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని బార్డర్ లో నివసిస్తున్న ప్రజలు టీఆర్ఎస్‌ను ప్రశంసిస్తున్నారని అన్నారు. తమను కూడా తెలంగాణలో కలిపేయాలని ఆయా రాష్ట్రాలను డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. అలాగే టీఆర్ఎస్ పాలను చూసి ఏపీ ప్రజలు కూడా అక్కడ పోటీ చేయాలని కోరుతున్నారని చెప్పారు. అక్కడ టీఆర్ ఎస్ పోటీ చేస్తే అన్ని తామే చూసుకుంటామని అక్కడి ప్రజలు చెబుతున్నారని అన్నారు. ఈ వ్యాఖ్యలపైనే ఇప్పుడు చర్చ సాగుతోంది. సీఎం కేసీఆర్ ఏపీలో పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నారని, అందుకే ప్లీనరీలో ఆయన ఆ వ్యాఖ్యలు చేశారని రాజకీయవర్గాల్లో చర్చలు జరిగాయి.
సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై ఏపీ మంత్రి పేర్ని నాని స్పందించారు. ఏపీలో జరుగుతున్న అభివృద్ధి పనులు తెలంగాణలో జరగడం లేదని అన్నారు. వైఎస్ఆర్ సీపీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, తెలంగాణలో ఎక్కడున్నాయంటూ ప్రశ్నించారు. గొప్పలు చెప్పుకోవడానికే కేసీఆర్ అలా చెప్పి ఉంటారని తెలిపారు. అనంతరం ఈ సమస్యకు పరిష్కారం కావాలంటే ఏపీ, తెలంగాణను మళ్లీ కలపాలని అన్నారు. అప్పుడు ఏపీలో సీఎం పార్టీ పెట్టాల్సిన అవసరం సీఎం కేసీఆర్‌కు ఉండదని సూచించారు. వెంటనే ఈ తీర్మాణాన్ని అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టి, ఆమోదించాలని కోరారు. మంత్రి పేర్నిని మాటలపై టీఆర్ ఎస్ నుంచి ఎవరూ స్పందించలేదు. కానీ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. ఎన్నో బలిదానాల ఫలితంగా సాధించుకున్న తెలంగాణను బలిపీఠం ఎక్కించే కుట్ర సాగుతోందని అన్నారు. సీఎం కేసీఆర్ రాజ్య విస్తరణ వల్లే ఇదంతా జరగబోతోందని ఆరోపించారు. దానిని జరగనివ్వబోమని తెలిపారు.
వైఎస్ఆర్‌టీపీకి వచ్చిన ఇబ్బందేంటి ?
తెలంగాణలో రాజన్న రాజ్యం తేవడమే లక్ష్యంగా ఇక్కడ పార్టీ స్థాపించారు వైఎస్ శర్మిల. దానికి వైఎస్ఆర్‌టీపీ అనే పేరు పెట్టి పార్టీని బలోపేతం చేసే దిశగా ప్రయాత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు పాదయాత్ర చేస్తున్నారు. అయితే ఏపీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యలు ఇప్పుడు వైఎస్ఆర్‌టీపీని ఇరకాటంలో పడేశాయి. తెలంగాణకు ప్రాతినిధ్యం వహిస్తున్నా పార్టీగా.. ఇప్పుడు ఏపీ మంత్రి వ్యాఖ్యలను ఖండించాల్సిన అవసరం ఏర్పడింది. అంటే పరోక్షంగా తన అన్న పార్టీ అయిన వైఎస్ఆర్‌టీపీని విమర్శించాలి. తనకు తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యమని చెప్పే శర్మిల ఈ విషయంపై స్పందించాల్సిన అవసరం వచ్చింది. మరి ఈ పరిస్థితిని ఆమె ఏ విధంగా డిఫెన్స్ చేస్తారో వేచి చూడాల్సి ఉంది.