Perni Nani: ఇదేందయ్యా పేర్ని నాని.. జగన్ అంటే లెక్కలేదా?

ఈ ఏడాది మే 22న సీఎం జగన్‌ మచిలీపట్నం పోర్టుకు భూమిపూజ నిర్వహించారు. ఇదే పోర్టుకు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఒకసారి, చంద్రబాబు మరోసారి శంకుస్థాపన చేశారు.

Written By: Dharma, Updated On : June 10, 2023 6:15 pm

Perni Nani: మాజీ మంత్రి పేర్ని నాని వ్యవహార శైలి వైసీపీలో చర్చనీయాంశంగా మారుతోంది. మొన్నటికి మొన్న సీఎం జగన్ ను ఏకవచనంతో సంభోదించారు. ఆ ఘటన మరువక ముందే మరోసారి జగన్ అంటే లెక్కలేని తనం ప్రదర్శించారు. ఏకంగా సీఎం హోదాలో జగన్ చేసిన శంకుస్థాపనలకు కాదని.. తనకు తానుగా మరోసారి అదే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సొంత పార్టీలోనే పేర్ని నాని కాక రేపుతున్నారు. కానీ ఆయన అనుచరులు మాత్రం నాని చర్యలను అడ్డగోలుగా సమర్థించుకుంటున్నారు.

ఈ ఏడాది మే 22న సీఎం జగన్‌ మచిలీపట్నం పోర్టుకు భూమిపూజ నిర్వహించారు. ఇదే పోర్టుకు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఒకసారి, చంద్రబాబు మరోసారి శంకుస్థాపన చేశారు. పోర్టుకు మళ్లీ శంకుస్థాపన చేశారన్న విమర్శలు రాకుండా ఉండేందుకు జగన్‌ భూమిపూజ పేరుతో కార్యక్రమం పూర్తిచేశారు. కానీ పట్టుమని 16 రోజులు కూడా పూర్తి కాకముందే మరోసారి పేర్ని నాని అక్కడ భూమిపూజ పేరుతో హడావిడి చేశారు. పోర్టు పైలాన్‌ వద్ద నార్త్‌ బ్రేక్‌ వాటర్‌ గోడ నిర్మాణ పనులకు భూమిపూజ నిర్వహించారు.నాని తీరుపై సొంత పార్టీ నాయకులే విమర్శలు గుప్పిస్తున్నారు. సీఎం జగన్‌ను కించపరిచే విధంగా.. ఆయనంటే లెక్కలేనితనంగా పేర్ని నాని వ్యవహారశైలి ఉందని వైసీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అయితే నాడు జగన్ ను ఉద్దేశించి పేర్ని నాని వ్యాఖ్యలు కూడా దుమారం రేపాయి. ఏకవచన ప్రయోగంపై విమర్శలు వెల్లువెత్తాయి. నాని అతి చనువు తీసుకొని జగన్ తనకు దగ్గర వ్యక్తి అని చెప్పుకునేందుకు ఉబలాట పడ్డాయి. అయితే విన్నవారికి మాత్రం ఎబ్బెట్టుగా కనిపించింది. దీంతో నేరుగా సీఎంవో సీనియర్‌ అధికారి ధనుంజయరెడ్డి లైన్‌లోకి వచ్చి పేర్ని నాని తీరును తప్పుబట్టారు. ఈ వివాదం సద్దుమణగక ముందే పేర్ని నాని మరోసారి తన చర్యలతో కొత్త వివాదానికి తెరదీశారు.

వచ్చే ఎన్నికల్లో మచిలీపట్నం నియోజకవర్గ టిక్కెట్ ను తనకు బదులు కుమారుడుకి ఇవ్వాలని పేర్ని నాని కోరుతూ వస్తున్నారు. కానీ జగన్ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించడం లేదు. అదే సమయంలో చెవిరెడ్డి భాస్కరరెడ్డి, భుమన కరుణాకర్ రెడ్డి వారసులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ప్రచారం సాగుతోంది. కానీ పేర్ని నాని విషయంలో మాత్రం సీఎం జగన్ మెత్తబడడం లేదు. అందుకే ఆయన చర్యలు బ్లాక్ మెయిల్ తరహాలో ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. ఏకంగా సీఎం జగన్ శంకుస్థాపన చేసిన కార్యక్రమాలకే మళ్లీ శ్రీకారం చుడుతుండడం హాట్ టాపిక్ గా మారింది. కార్యక్రమానికి మచిలీపట్నం మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్పొరేటర్లు, నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల సర్పంచులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున ఈ కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా పేర్ని నాని హుకుం జారీ చేశారని సమాచారం.