ఎగిరిపోతే ఎంత బావుంటుంది.. అంటూ కరోనా ముందు సెలవులొచ్చినా.. వీకెండ్ వచ్చినా జనాలు తమ స్థోమతను బట్టి విదేశాలకు, దేశంలోని పర్యాటక ప్రాంతాలకు విమానాల్లో ఎగిరిపోయేవారు. కానీ కరోనా దెబ్బకు ఇప్పుడు మొత్తం విమానాలే బంద్ అయిపోయిన పరిస్థితి నెలకొంది. ఏడు ఎనిమిది నెలలుగా జనాలకు ఇంట్లో నుంచి బయటి ప్రదేశాలకు వెళ్లలేక మొహం మొత్తింది. కరోనా మహమ్మారి ఎప్పుడు తగ్గుతుందా? ఎప్పుడు ఎగిరిపోదామా? అని అందరూ ఎదురుచూస్తున్నారు. అయితే ప్రస్తుతానికి పర్యాటక వీసాలను పక్కనపెట్టిన కేంద్రం ఇతర వీసాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో పనులు, ఉద్యోగాలు, అవసరాల కోసం వెళ్లే వారు విదేశాలకు వెళ్లిపోవచ్చు.
Also Read: బీహార్ ఎన్నికలు: కాంగ్రెస్ బలం ఎంత?
భారత్ లో కరోనా రాకతో విదేశీ, స్వదేశీ విమాన రాకపోకలపై కేంద్రం నిషేధం విధించింది. వందే భారత్ మిషన్ అంటూ అప్పట్లో నడిపింది. కరోనా బాగా ప్రబలడంతో ఇక చేసేందేం లేక మొత్తం విమానాల రాకపోకలు ఆ మధ్య బంద్ చేసింది. విదేశాల్లో చిక్కుకుపోయిన వారిని మాత్రమే ప్రత్యేక విమానాలు వేసి తీసుకొచ్చింది.
తాజాగా అంతర్జాతీయ రాకపోకలపై ఆంక్షలను దశలవారీగా ఎత్తివేసేందుకు కేంద్రం సిద్ధమైంది. దేశంలోకి ఇతర దేశాల నుంచి భారతీయులు.. విదేశీయుల రాకపోకలపై విధించిన ఆంక్షలను ఎత్తివేయాలని కేంద్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. పర్యాటక వీసా మినహా అన్ని వర్గాల ప్రయాణాలకు అనుమతులు ఇవ్వనున్నట్లు కేంద్ర హోంశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.అయితే ప్రయాణికులంతా ఆరోగ్యశాఖ సూచించిన ప్రకారం క్వారంటైన్ తదితర కరోనా నిబంధనలను పాటించాల్సి ఉంటుందని పేర్కొంది.
Also Read: కవితకు ఇప్పుడే నో ఛాన్స్?
విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు, భారత మూలాలున్న భారతీయులతోపాటు విదేశీయులు ఎవరైనా వాయు, జల మార్గాల ద్వారా భారత్ కు వచ్చేందుకు కేంద్ర హోంశాఖ అనుమతులు జారీ చేసింది. ఇక నుంచి విదేశాల నుంచి రావచ్చు.. భారత్ నుంచి విదేశాలకు వెళ్లవచ్చని పేర్కొంది. ప్రస్తుతం ఉన్న వీసాలన్నింటిని యాక్టివ్ చేస్తున్నట్టు కేంద్ర హోంశాఖ తెలిపింది. ఎలక్ట్రానిక్, పర్యాటక, వైద్య సంబంధ వీసాలు మినహా ఇతర అన్ని వీసాలను కేంద్రం పునరుద్ధరించింది.భారత్ లో చికిత్స కోసం మెడికల్ వీసాలను కేంద్ర హోంశాఖ మంజూరు చేయడం విశేషం.