
వచ్చే ఎన్నికల్లో పోటీ తీవ్రత పెరగనుంది. రాజకీయపక్షాలు ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తున్నాయి. 2024లో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తేనే విజయం తథ్యమని గ్రహిస్తున్నాయి. ఇందుకోసం పక్కా ప్రణాళికలు వేస్తున్నాయి. బీజేపీ-టీడీపీ-జనసేన కూటమిగా ఏర్పడితే ఎలా ఎదుర్కోవాలనే దానిపై సమాలోచనలు సాగిస్తున్నారు. ముప్పేట దాడికి మార్గాలు సుగమం చేసుకుంటున్నారు. ఇదే సందర్భంల ప్రత్యర్థి పార్టీల కదలికలను ఎప్పటికప్పుడు గుర్తించేందుకు సరైన యంత్రాంగాన్ని తయారు చేస్తున్నట్లు ప్రచార సాగుతోంది.
అధికార పార్టీ వైసీపీ తిరిగి అధికారం చేజిక్కించుకోవాలనే తపనతో ఉంది. అందివచ్చే అవకాశాల్ని సద్వినియోగం చేసుకునేందుకు సిద్ధం అవుతోంది. పార్టీ మరింత పదునుగా వ్యవహరించాల్సిన అవసరాన్ని గుర్తిస్తోంది. ప్రజల నాడిని తెలుసుకుని ఎవరికి టికెట్లు ఇవ్వాలనే విషయంలో కసరత్తు చేస్తోంది. వ్యూహాత్మకంగా అడుగులు వేసే నాయకులకే ప్రాధాన్యం ఇవ్వనుంది. వైసీపీలో ఇప్పుడున్న నేతలను చాలామందికి చెక్ పెడతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
వచ్చే ఎన్నికల్లో ఎన్ని పార్టీలు కూటమిగా ఏర్పడినా వెనక్కి తగ్గేది లేదని జగన్ భావిస్తున్నారు. పార్టీని విజయతీరాలకు చేర్చాలని అన్ని దారులను వెతుకుతున్నారు. పని చేయని వారిని పక్కన పెట్టేందుకే నిర్ణయించుకున్నారు. వారిలో వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి, గూడూరు ఎమ్మెల్యే వెలగపూడి వరప్రసాద్, సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు, తిరువూరు ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి, నూజివీడు అప్పారావు, నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్ధర్, మంత్రులు చెెరుకువాడ శ్రీరంగనాథరాజు, శంకరనారాయణ, గుమ్మనూరు జయరాం తదితరులు ఉన్నట్లు తెలుస్తోంది.
ఆయా నియోజకవర్గాల్లో కొత్త వారికే అవకాశాలు ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లో కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి గెలిచిన వారిపై అధ్యయనం చేస్తున్నారు. ప్రజలకు చేరువలో ఉన్న వారిని గుర్తించి వారికి అవకాశం ఇవ్వాలని, లేని వారిని పక్కకు పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఏదేమైనా వచ్చే ఎన్నికల్లో కొత్తరక్తంతోనే వైసీపీ పోరు జరపనుందని తెలుస్తోంది.