Free Electricity: రేవంత్ సర్కార్ కు ‘షాక్’ లాగా

కాంగ్రెస్‌ సర్కార్‌ కొలువు దీరింది. డిసెంబర్‌ 7న సీఎంగా రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్క, మరో పది మంది మంత్రులు ప్రమాణం చేశారు.

Written By: Raj Shekar, Updated On : December 16, 2023 8:51 am

Free Electricity

Follow us on

Free Electricity: తెలంగాణలో అధికారంలోకి వస్తే ప్రతీ ఇంటికి 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తామని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. ప్రచార సభల్లో పదే పదే ప్రస్తావించారు. కరెంటు బిల్లులు కట్టొద్దని సూచించారు. ఇక కాంగ్రెస్‌ మేనిఫెస్టోలోనూ 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ అంశాన్ని చేరా‍్చరు. ఫ్రీ బస్సు, ఉచిత విద్యుత్‌, పింఛన్ల పెంపు, రైతుబంధు పెంపు, రుణమాఫీ, రూ.500లకే గ్యాస్‌ సిలిండర్‌ తదతర అంశాలు ఓటర్లను ఆకట్టుకున్నాయి. ఇక అన్నింటికంటే.. కేసీఆర్‌ సర్కార్‌పై ఉన్న వ్యతిరేకతకు కాంగ్రెస్‌ ఆకర్షణీయమైన మేనిఫెస్టో తోడైంది. కాంగ్రెస్‌వి ఆచరణ సాధ్యం కాని హామీలు అని ఆరోపించిన బీఆర్‌ఎస్‌ నేతలు.. తర్వాత కాంగ్రెస్‌ హామీలనే అటూ ఇటు చేసి మేనిఫెస్టో రిలీజ్‌ చేశారు. దీంతో ఓటర్లు, కాంగ్రెస్‌వైపే మొగ్గు చూపారు. బీఆర్‌ఎస్‌ను గద్దెదించి.. కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చారు.

రెండు గ్యారంటీల అమలు..
కాంగ్రెస్‌ సర్కార్‌ కొలువు దీరింది. డిసెంబర్‌ 7న సీఎంగా రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్క, మరో పది మంది మంత్రులు ప్రమాణం చేశారు. డిసెంబర్‌ 9వ తేదీన సోనియాగాంధీ జన్మదినం పురస‍్కరించుకుని ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో రెండింటిని అమలు చేయాలని నిర‍్ణయించారు. ఈమేరకు ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచారు. ఇక మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ప్రారంభించారు.

విద్యుత్‌ బిల్లులపై సమీక్ష..
ఇక వారం గడిచినా.. ప్రభుత్వం 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌పై నిర్ణయం ప్రకటించలేదు. ఎవరికి ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ప్రభుత్వంపై ఎంత భారం పడుతుంది అనే విషయాలపై క్యాబినెట్‌ సమావేశంలో చర్చించారు. విధి విధానాల రూపకల్పనకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. డిసెంబర్‌ 28న మరో రెండు గ్యారంటీలు అమలుచేస్తారని తెలుస్తోంది. ఇందులో ఉచిత విద్యుత్‌, రూ.500లకే సిలిండర్‌ అంశాలు ఉంటాయని సమాచారం.

బిల్లులు కట్టని ప్రజలు..
గృహ వినియోగదారులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌పై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ, ఎన్నికల సమయంలో ప్రచారం నిర్వహించిన రేవంత్‌రెడ్డి.. అప్పుడే కరెంటు బిల్లులు కట్టొద్దని సూచించారు. పది రోజులైతే కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని అప్పుడు కరెంటు బిల్లులు ప్రభుత్వమే కడుతుందని పేర్కొన్నారు. రేవంత్‌ చెప్పినట్లుగానే కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. దీంతో 200 యూనిట్లకన్నా తక్కువ కరెంటు బిల్లు వచ్చే వినియోగదారులు ఇప్పుడు బిల్లులు చెల్లించడం లేదు. నవంబర్‌ నెలకు సంబంధించిన బిల్లులను విద్యుత్‌ సిబ్బంది పంపిణీ చేస్తున్నారు. కానీ, చాలా మంది విదు‍్యత్‌ బిల్లులు చెల్లించేందుకు ఆసక్తి చూపడం లేదు. వంద రోజుల్లో హామీలు అమలు చేస్తామని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు. విద్యుత్‌ వినియోగదారులు మాత్రం ఇప్పటి నుంచే బిల్లులు చెల్లించడం నిలిపి వేస్తున్నారు. తాము 200 యూనిట్లలోపే కరెంట్ వాడుకున్నామని, దాన్ని ప్రభుత్వం కొన్ని రోజుల్లో మాఫీ చేస్తుందని పేర్కొంటున్నారు.